రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఖజానా చేతికిచ్చి పోయారు. ఇవీ కాంగ్రెస్ నేతలు అధికారం కోసం కూసిన అడ్డగోలు కూతలు. ఎన్నికల ముందు అప్పుల గురించి చేసిన హంగామా ఇంతా అంతా కాదు. 8 లక్షల కోట్లు అప్పు చేశారంటూ ఇల్లెక్కి కూశారు. అప్పు చేయడమే తప్పన్నట్టుగా నంగనాచి కబుర్లు చెప్పారు. అలవిమాలిన హామీలతో బురిడీ కొట్టించి.. తీరా గెలిచాక అప్పులపై ప్లేటు ఫిరాయించారు. సంపద సృష్టించడం ఎలాగో తెలియక అప్పుల వెంటపడ్డారు. ఇంతవరకు ఏ సర్కారు చేయనంత స్థాయిలో అప్పులు చేశారు. తాహతుకు మించిన అప్పులతో పతార పోగొట్టుకొని అప్పు పుట్టడం లేదని బీద అరుపులు మొదలుపెట్టారు. అప్పు కోసం వెళ్తే దొంగల్లా చూస్తున్నారని దిక్కుమాలిన కథలు చెప్తున్నారు. ఇదీ అప్పులపై కాంగ్రెస్ సర్కారు ఇన్నాళ్లుగా ఆడుతున్న కపట నాటకం. కానీ, నిప్పును మూటకట్టలేం. నిజాన్ని దాచిపెట్టలేం. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం బండారాన్ని స్వయంగా కేంద్రం బద్దలు కొట్టింది. ఎవరు చేసిన అప్పు ఎంత? సృష్టించిన సంపద ఎంత? అనేది పార్లమెంట్ సాక్షిగా తేల్చిచెప్పింది. రాష్ట్రం అప్పులపై కేంద్రం వెల్లడించినవి పూర్తిగా కొత్త సంగతులేమీ కావనేది గమనార్హం. బీఆర్ఎస్ ఇన్నాళ్లుగా చెప్తున్న సంగతులకు అదొక ధృవీకరణగా భావించాలి.
కేంద్రం తాజాగా అందించిన గణాంకాల ప్రకారం ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ వాటా గా వచ్చిన అప్పు రూ.70 వేల కోట్లు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పు అక్షరాలా 2.8 లక్షల కోట్లు. కాంగ్రెస్ చెప్తున్నట్టుగా, బీజేపీ వంతపాడుతున్నట్టుగా 8 లక్షల కోట్లు కానే కాదు. అదే సమయంలో బీఆర్ఎస్ పాలనలో పదేండ్లలో పెరిగిన ఆస్తుల విలువ 4.16 లక్షల కోట్లు. సం పద పెంచడం, ప్రజలకు పంచడమనే ఒడుపు తెలిసిన కేసీఆర్ అప్పుచేసి తెచ్చిన ప్రతిపైసాను రాష్ట్ర సంపద పెంచేందుకే వినియోగించారు. ఆయన పాలనలో మౌలికరంగం విస్తరణ శరపరంపరగా సాగింది. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలకు కావాల్సిన వసతుల మీద ప్రత్యేక దృష్టి నిలిపి అభివృద్ధి చేశారు. రాజధానిలో సచివాలయం, జిల్లాల్లో కలెక్టరేట్లు అత్యాధునికమైన రీతిలో కట్టించారు. కాళేశ్వరం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు ప్రాణప్రతిష్ఠ చేశారు. పదేండ్లలో తెలంగాణను ప్రగతికి చిరునామాగా మార్చారు దేశానికే అన్నపూర్ణగా నిలిపి దేశ విదేశాల్లో మన్ననలు, అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇది కాదనలేని చరిత్ర. కేంద్ర ఆర్థికశాఖ చెప్పిన లెక్కలు ఈ సత్యాన్నే మరోమారు రుజువు చేశాయి.
ఇక అప్పు చేయడమే తప్పు అన్నట్టుగా నంగనాచి కబుర్లు చెప్పి అందుకు విరుద్ధంగా ఎగబడ్డ కాంగ్రెస్ సర్కారు కేవలం 20 నెలల్లో చేసిన అప్పు అచ్చంగా 2.2 లక్షల కోట్లు. బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పుతో పోలిస్తే సుమారు పదిరెట్లుగా ఉండటమే కాకుండా, అదివరకటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చేసిన మొత్తం అప్పుల కంటే ఎక్కువగా ఉన్న ఈ అప్పుతో రేవంత్ సర్కారు ఏం చేసినట్టు? తట్టెడు మట్టి ఎత్తలేదు. జిట్టెడు గోడ పెట్టలేదు. కొత్త ప్రాజెక్టు ఏదీ చేపట్టలేదు. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చినా ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేని పరిస్థితి. అసమర్థ పాలనలో రాష్ట్ర ఆదాయం రోజురోజుకూ పడిపోతున్నది. ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మాది దివాలా తీసిన రాష్ట్రమని ప్రభుత్వమే చెప్పుకుంటుండటంతో పెట్టుబడులూ రావడం లేదు, అప్పూ పుట్టడం లేదు. చేతకాని, చేవలేని నాయకత్వం రాష్ర్టాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. అధికారం మీది యావతో కేసీఆర్ సర్కారు మీద చేసిన ఆరోపణలన్నీ అభూత కల్పనలేనని తేలిపోయింది. అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేకపోయినా, రాష్ట్ర ప్రజలపై తలకు మించిన భారాన్ని మోపింది కాంగ్రెస్ సర్కారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ వేసిన ప్రశ్నతో కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంటులో వెల్లడించిన సమాచారం బీఆర్ఎస్ పాలనను సమున్నతంగా నిలుపడం సత్యానికున్న సర్వోన్నత శక్తికి నిదర్శనం.