ప్రజల ఆలోచనలు మారుతుండటంతో కొంతకాలంగా వారి నోటి నుంచి ఒక ప్రశ్న వినవస్తున్నది. ఏదైనా విషయం తెలుసుకునేందుకు ప్రశ్న వేయడం వేరు, ధిక్కారపూర్వకంగా ప్రశ్న వేయడం వేరు. ఈ ప్రశ్న ధిక్కారపూర్వకమైనది. అది ‘తన జేబు నుంచి ఇస్తున్నాడా?’ అనే మాట. ఒక పాలకుడు ప్రజలకు ఏదైనా మేలు చేసి, అదే విధమైన మేలు భవిష్యత్తులోనూ చేసేందుకు తనను బలపరచవలసిందిగా కోరితే ప్రజల్లో కొందరి నుంచి ఈ మాట వినపడుతున్నది. మరి ఇప్పుడు, తమకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారం సంపాదించిన రేవంత్రెడ్డి ప్రభుత్వం మూడు బడ్జెట్లు గడిచినా ఆ గ్యారెంటీల అమలు మాట ఎత్తలేదు గనుక, ‘తన జేబు నుంచి ఇస్తున్నాడా? ఎందుకివ్వటంలేదు?’ అని ఆయనను ప్రశ్నిస్తారా?
నిధుల రాబడి, వాటి ఖర్చులు ఎవరికోసం ఎటువంటి ఖర్చు చేస్తున్నారు? ఏ ఉద్దేశంతో? అనే పొలిటికిల్ ఎకానమీ సాధారణ ప్రజలకు తెలియదు గనుక మొదట ఆ విషయమై రెండు మాటలు చెప్పుకోవటం అవసరం. ఇక్కడ రాస్తున్నది సాధారణ ప్రజలు చదివేదీ లేనిదీ, చదివినా ఎంతవరకు గ్రహించేదీ తెలియదు. అయినా చెప్పుకోవటం అవసరం. ఏ పాలకుడు గాని, దేని కోసం గాని, జేబు నుంచి ఖర్చు చేయరు. అది ఎవరికీ సాధ్యం కూడా కాదు. ఆ ఖర్చు పరిపాలనా యంత్రాంగం కోసమైనా, అభివృద్ధి కోసమైనా, సంక్షేమం కోసమైనా సరే. ఎవరైనా చేసేది ప్రభుత్వ నిధులను ఏ విధంగా ఖర్చు చేయాలి? ఎవరి కోసం ఖర్చు చేయాలి? అన్నది నిర్ణయించటం మాత్రమే.
అట్లా నిర్ణయించటాన్ని బట్టే ఒక ప్రభుత్వం లేదా పాలకుని విధానం ఏమిటి? స్వభావం ఏమిటి? అనేది అర్థమవుతుంది. వేర్వేరు పాలకుల మధ్య గల తేడా తెలుస్తుంది. ఇందుకు మనకు జ్ఞాపకం ఉన్న చరిత్ర నుంచే కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వాటి వల్ల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఎంతో మేలు కలిగింది. వారు ఆయనను దేవుడన్నారు. తర్వాత అధికారానికి వచ్చిన చంద్రబాబు ఆ పథకాలకు కోతపెట్టారు. కొన్ని రద్దు చేశారు. మరి ఎన్టీఆర్ ఆ పథకాల ఖర్చు తన జేబులోంచి పెట్టినట్టా? తర్వాత చంద్రబాబు తన జేబు సొమ్ము ఖర్చవుతుందని వాటిని ఆపివేసినట్టా?
సాధారణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పొలిటికల్ ఎకానమీ ఇక్కడే ఉన్నది. రామారావుకైనా, చంద్రబాబుకైనా నిధులు సమకూరేది ఒకే విధంగా. రకరకాల పన్నుల ద్వారా. వాటితోనే బడ్జెట్లు తయారవుతాయి. అంతే తప్ప జేబు నుంచి కాదు. కానీ ఆ బడ్జెట్ నిధులను ఇద్దరూ ఒకే విధంగా ఖర్చు చేయలేదు. తగినంత సొమ్ము పేదల కోసం ఎన్టీఆర్ ఖర్చు చేయగా, అట్లా అక్కరలేదనుకొని చంద్రబాబు ధనవంతుల కోసం కేటాయించారు. రైతులు, నిరుద్యోగులు, పేదలను కష్టాలపాలు చేశారు. బడ్జెట్ నిధులు తన జేబు నుంచి వచ్చినవి కాదు గదా! అటువంటప్పుడు ఎన్టీఆర్ వలె చంద్రబాబు కూడా సామాన్యుల కోసం ఎందుకు ఖర్చు చేయలేదు? సులభమైన భాషలో చెప్పాలంటే దీనినే ‘పొలిటికల్ ఎకానమీ’ అంటాం.
ఇక్కడే మరొక మాట కూడా చెప్పుకోవాలి. కొందరి నుంచి పైన అనుకున్నట్టు ‘తన జేబు నుంచి ఇస్తున్నాడా?’ అనే మాటతోపాటు ‘మనం కట్టినయే మనకిస్తున్నడు’ అనే మరొక మాట కూడా వినిపిస్తుంటుంది. వారి ఉద్దేశం తాము కడుతున్న పన్నులు అని. అది నిజమే. వారు కట్టే పన్నులు కూడా ఇతర విధాలైన రాబడులతో కలిసి మొత్తం నిధుల్లో, బడ్జెట్లో భాగమవుతాయి గానీ వేరే కాదు. తమ పన్నులు కూడా కలిసిన మొత్తం నిధులను ఎన్టీఆర్ వంటి పాలకుడైతే ఏ విధంగా, ఎవరి కోసం ఖర్చు చేస్తారు? అదే పద్ధతిలో చంద్రబాబు వంటి పాలకుడు ఎందుకు చేయరన్నది ప్రశ్న. సామాన్య ప్రజలు అర్థం చేసుకోవలసింది సరిగా ఈ తేడానే. పైన చెప్పుకొన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితిని చూద్దాం.
2014కు ముందు సమైక్య రాష్ట్రంలో పదేండ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లపాటు బీఆర్ఎస్ పాలించింది. వివిధ పన్నుల రూపంలో సమకూరిన నిధుల బడ్జెట్లు ఆ పదేండ్లలో ఉన్నాయి, ఈ పదేండ్లలోనూ ఉన్నాయి. పైన అనుకున్న పొలిటికల్ ఎకానమీ, లేదా ఆ బడ్జెట్లను ప్రజల కోసం ఖర్చు చేయటం, ఎప్పుడెట్లా జరిగింది? అప్పుడు గాని, ఇప్పుడు గాని ఏ ముఖ్యమంత్రి కూడా తమ జేబులో నుంచి ఖర్చు చేయలేదు.
కానీ సమకూరిన నిధులను ప్రజల కోసం, పేదల కోసం ఎవరెట్లా ఖర్చు చేశారు? అంతే కాదు. ముఖ్యంగా చూడవలసింది మరొకటి ఉన్నది. అభివృద్ధి కోసమంటూ ఖర్చు చేసిన నిధుల్లోనూ ఎటువంటి అభివృద్ధి కోసం ఎవరెంత ఖర్చు చేశారు? అదే విధంగా, బీఆర్ఎస్ తర్వాత 2023లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ఖర్చు చేస్తున్నది గాని, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చేస్తున్నది గాని ‘తమ జేబు నుంచి’ కాదు గదా. తమ జేబు నుంచి ఖర్చు చేయటం లేదని వారిని నిందించటం లేదిక్కడ. మొదటనే అనుకున్నట్టు అది వీలయ్యేది కాదు కూడా. కానీ, ప్రభుత్వంలో ఉన్న వారిగా బడ్జెట్లు తమ అధీనంలో ఉంటాయి గనుక, వాటిని ఎట్లా ఖర్చు చేయాలనే నిర్ణయం మాత్రం తమది అయినందున, ఏ విధంగా చేస్తున్నారన్నది ప్రశ్న.
‘తన జేబులో నుంచి ఇస్తున్నాడా?’ అని కేసీఆర్ విషయమై సూటిగా అడిగినవారు, ఆరు గ్యారెంటీలకు రేవంత్రెడ్డి ఇచ్చేది మాత్రం తన జేబులో నుంచా? మరి మూడు బడ్జెట్లయినా ఎందుకు ఇవ్వటం లేదు? అని అంతే సూటిగా అడుగుతారా? వాస్తవానికి కేసీఆర్ తమ మొదటి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా అనేకం అమలు పరిచారు. అవేవీ చిన్నచిన్నవి కావు. కానీ ఆరు గ్యారెంటీలంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చి, గెలిచాక అమలు పరచటంలేదు. ఈ అనుభవాల దృష్ట్యా ‘తన జేబులో నుంచి ఇస్తున్నాడా?’ అనే ప్రశ్నను ప్రజలు వేయవలసింది ఆ ఇద్దరిలో ఎవరికి?
వాస్తవానికి పాలకులలో ఎవరేమిటి అన్నది ప్రజలకు చిరకాలంగా ఉన్న అనుభవం. పొలిటికల్ ఎకానమీ అనేది వారికి ఎవరో ఒక శాస్త్రం వలె విడమర్చి చెప్పవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. వారు మొదట నెహ్రూతో ఆరంభించి ఇందిరాగాంధీ వరకు చెప్పుకొన్నా రు. తర్వాత ఆర్థిక సంస్కరణలతో సంక్షేమాలు క్రమంగా చెదిరిపోవటాన్ని చూశారు. అవే అనుభవాలు వారికి ఇక్కడ ఎన్టీఆర్, చంద్రబాబుతో మొదలై ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొనసాగుతున్నాయి. అటువంటప్పుడు వారి ఆ లోచనలోకి ఈ ప్రశ్నలు ఎట్లా వచ్చినట్టు? ఏదీ అకారణంగా జరగదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. వాస్తవాలను చూడకుండా, గత అనుభవాలతో నిమిత్తం లేకుండా, ముందూవెనుక ఆలోచన చేయకుండా, తోచినట్టల్లా మాట్లాడేవారు కొందరు ఎప్పుడూ ఉంటారు. తాము కో రుకున్నదల్లా జరగకపోతే వారట్లా మాట్లాడటం ఇంకా ఎక్కువవుతుంది. మామూలుగానైతే వారి సంఖ్య ఎక్కువ ఉండదు. వారి మాటలకు తక్కిన సమాజం ఎక్కువ విలువ ఇవ్వదు. కాగా, 2023 ఎన్నికల సమయంలో జరిగిందేమిటి?
కేసీఆర్ వ్యతిరేక ప్రచారానికి కలిసి వస్తుందనే ఏ మాటకోసమైనా అన్వేషిస్తుండిన వారికి, కొందరిలో గల అసంతృప్తి అనువుగా దొరికింది. అది కూడా ఒక ప్రచార సాధనమైంది. కేసీఆర్ ఇచ్చిన వాటి గురించి మాట్లాడుతూ, ‘తన జేబులో నుంచి ఇచ్చాడా?’ అని, ఇవ్వనివాటి గురించి ‘ఎందుకియ్యడు, తన జేబులో నుంచి ఇచ్చేదున్నదా?’ అని ప్రచారం వ్యాపింపజేశారు. అది మొదలు పెట్టిన కాంగ్రెస్ వారికి సోకాల్డ్ మేధావుల బృందాలు కొన్ని, కేసీఆర్ తాము కోరుకున్నట్టు జీతాలు పెంచలేదంటూ, ఉద్యోగాలు ఇవ్వలేదంటూ, మరేదో చేయలేదంటూ అసంతృప్తితో కొన్ని వర్గాలు, మాజీ వీరవిప్లవకారులు కొందరు, కాంగ్రెస్ నుంచి ఒకటి రెండు టికెట్లు ఆశిస్తుండిన రంగు వెలిసిన కమ్యూనిస్టు పార్టీలు కొన్ని తోడయ్యాయి. ఇదంతా ఒకెత్తు కాగా, కాంగ్రెస్ వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పెద్ద నడమంత్రపు ఆకర్షణగా మారాయి. దానితో కేసీఆర్ అనేకం చేసినట్టు అంగీకరించేవారు కూడా తమ సహజమైన వెనుకబాటుతనం మూలంగా, రేవంత్రెడ్డి ‘తన జేబులో నుంచి’ ఇంకా చాలా ఇవ్వనున్నట్టు నమ్మారు!
కాంగ్రెస్ ప్రభుత్వ మూడు బడ్జెట్ల తర్వాత పరిస్థితి ఏమిటి? అపూర్వమైన అట్టహాసంతో గాంధీ కుటుంబ సభ్యుల సంతకాలతో ఊరూరా, ఇంటింటికీ తిరిగి అందజేసిన ఆరు గ్యారెంటీల బాండ్ పత్రాల్లోని 13 అంశాల్లో ఒకటీ అరా తప్ప ఏవీ అమలుకాలేదు. అందుకు అసెంబ్లీలో మొదటి సమావేశాల్లోనే చట్టబద్ధత ఇస్తామన్నా గానీ, ఇవ్వలేదు. వీరు వారని గాక గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతీ సామాజికవర్గం కాంగెస్ చేతిలో మోసపోతున్నది.
పాత పథకాలు అనేకం ఆగిపోతాయి లేదా కుంటుపడతాయి. కానీ ప్రశ్నలకు జవాబులు రావు. ఎప్పుడు పిలిచినా రెక్కలు కట్టుకు వాలతానని, తెలంగాణ వారికి తాను ఢిల్లీలో ప్రతినిధినని డాంబికాలు పలికిన యువరాజు, ప్రజలకు ఎక్కడ దొరికిపోతానో అన్నట్టు, పోలీసు భద్రత మధ్య ఎక్కడికో వచ్చి అంతలోనే అదృశ్యమవుతున్నారు. కేసీఆర్ ఇచ్చినవన్నీ తన జేబులో నుంచి ఇవ్వలేదన్నది సరే. రేవంత్రెడ్డి కూడా ఆరు గ్యారెంటీలు తన జేబులో నుంచి ఇవ్వనక్కరలేదు గదా! కేసీఆర్ ఇచ్చింది సర్కార్ సొమ్ము మాత్రమే అయినప్పుడు, అదే సర్కార్ సొమ్ము ఇప్పుడేమవుతున్నట్టు? జేబులో నుంచి ఇవ్వటమనే ప్రచారం 2023లో మొదలుపెట్టిన అసంతృప్తివాదులు, కాంగ్రెస్ ప్రచారానికి జెండాలూపిన మేధావులు, మాజీ విప్లవకారులు, సీట్ల బిచ్చమెత్తుకునే కమ్యూనిస్టు పార్టీలు, నానాజాతి సంఘాల వాళ్లు ఇప్పుడెక్కడున్నట్టు? వారి మౌనం ఎందుకు? ఇప్పటికీ విషయం బోధపడకనా? అద్దంలో ముఖం చూసుకోలేకనా?
– టంకశాల అశోక్