రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థుల కలలు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి. ఫీజు బకాయిలు ఉన్నాయనే సాకుతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు. దీంతో చదువు పూర్తయినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు, పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు చదువు మానేయాల్సి వస్తున్నది. మరోవైపు కాలేజీలకు నిధులు రాకపోవడంతో అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదు. ఇది విద్యా నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్, పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన దాదాపు 2,500కు పైగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి చదువుకుంటున్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధుల చెల్లింపును పూర్తిగా నిలిపివేసింది. దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా నిధులు బకాయిలు ఉన్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపింది. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, లా వంటి కోర్సులు పేదలకు అందుబాటులో లేని సమయంలో, ఈ పథకం అండగా నిలిచింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎంతోమందిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దింది. కానీ నేడు అదే పథకానికి గ్రహణం పట్టింది.
రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం బలిపీఠంపై పెట్టింది. పదివేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. స్కాలర్షిప్ నిధులను ప్రతినెలా జాప్యం చేయకుండా ‘గ్రీన్ ఛానల్’ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇంజినీరింగ్ కాలేజీల్లో పెంచిన 3035 శాతం ఫీజులను ప్రభుత్వమే భరించాలి. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తామని, బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలయ్యాయి.
ఇక నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ట్రస్ట్, సీఎస్ఆర్ నిధులతో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ప్రత్యేక కమిటీని నియమించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇప్పటికీ నివేదికపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రభుత్వ బకాయిల కారణంగా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్నాయి. ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమని యాజమాన్యాలు స్పష్టం చేయడంతో విద్యార్థులు పీజీ అడ్మిషన్లు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. అందుకోసం జీవో 7ను విడుదల చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి కాలేజీల ట్యూషన్ ఫీజులను విద్యార్థులకే చెల్లిస్తామని ఆ జీవోలో పేర్కొన్నది.
విద్యార్థులకు చెల్లించిన తర్వాతే కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేయాలని షరతు విధించింది. కానీ ఎప్పుడు చెల్లిస్తారో కచ్చితమైన టైమ్‌లైన్ మాత్రం అందులో పేర్కొనలేదు. రాష్ట్రంలో ట్యూషన్ ఫీజుల కోసం ఏటా 12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరందరికి ప్రభుత్వం రూ.2,400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు గతంలో ఆధార్ ధ్రువీకరణ చేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరయ్యేది.
కొత్త విధానం ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు 20 శాతం మంది ఆధార్‌లో పేరు సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్న తప్పులను అడ్డుపెట్టుకొని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరం చేయడం దారుణం. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రభుత్వం ఫీజుల స్కీమ్‌పై గందరగోళానికి గురిచేస్తున్నది. మరోవైపు ప్రభుత్వ బకాయిల కారణంగా కాలేజీలు విద్యార్థులపై జులుం ప్రదర్శిస్తున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు కాలేజీల నడుమ పేద విద్యార్థులు నలిగిపోతున్నారు.
-ఇస్కా రాజేశ్‌బాబు ,96520 39780