‘మనం చెదిరిపోయిన్నాడు మళ్లీ పాత తెలంగాణ వస్తది. బతుకులు ఆగమైతయి. మోసపోతే గోసపడుతం. చెప్పటం నా బాధ్యత. ఒకసారి దెబ్బతింటే..! ఉన్న కూర్పు చెడిపోతే తెలంగాణ సమా
జానికి మంచిది కాదు’ చేతికి అందివచ్చిన పంట చెడిపోతున్న వేళ రైతు ఆవేదన లాంటిది ఇది. ఎన్నికల నాట జనం పరపర బుద్ధులు పసిగట్టి కేసీఆర్ చేసిన హితబోధ. నిండా 18 నెలల పొద్దు గడవ
లేదు. కండ్లముందర తెలంగాణ సత్తెనాశనమైంది. ఈనగాచి నకల పాలైంది. పద్నాలుగేండ్లు బాపు బరిగీసి కొట్లాడిన కొట్లాట.. చావు నోట్లో తలపెట్టి పట్టుకొచ్చిన ప్రతిఫలం.. విశ్వకర్మ తీరు పదేండ్లు
మస్తిష సారం తీసి కూర్చిన కూర్పు పాడి రాకుండపోయింది. ఇప్పుడిక బాధపడి చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాంగ్రెస్ స్వభావమే మోసం. అది తేలిపోయింది, తేటతెల్లమైంది.
ఏనాటి రాతో… ఏలినాటి శనో..! ‘మంది మాటలిని మారుమానం బోతే మళ్లొచ్చేసరికి ఇల్లు ఆగమయ్యే’ అన్నట్టు ఏంది మనకీ గోస. ఒక ఓటేసిన పాపానికి ఎవడి జాగీరనీ? నీళ్లను మళ్లిస్తున్నరు. కాళేశ్వరాన్ని పండబెట్టి, తెలంగాణను ఎండబెట్టి, నదులను వరుసబెట్టి సాగనంపుతున్నరు? పొరుగు రాష్ట్రం సీఎం చంద్రబాబు గోదావరి నీళ్లు మళ్లించి లేని చోట బనకచర్ల కడుతానంటే.. ‘సరే కూర్చొని మాట్లాడుకుందాం రండీ’ అని రెడ్‌కార్పెట్ పరిచిండు. ఇక్కడైతే బాగుండదు. బయటపడుతదని ఢిల్లీలో వేదిక పెట్టుకున్నరు. బాబే షెడ్యూల్, ఎజెండా ఖరారుచేస్తే.. బనకచర్ల అంటే బాయికాట్ అని రేవంత్ రియాక్షన్ ఉత్తరం రాసి తెలంగాణ ప్రజలను నమ్మించిండు. అదేరోజు రాత్రికల్లా పరుగు పరుగున ఢిల్లీకి వెళ్లిపోయిండు. చంద్రబాబు కనుసన్నల్లో వేసిన సాంకేతిక కమిటీకి రేవంత్‌రెడ్డి కమిట్మెంట్ ఇచ్చివచ్చిండు. నెల రోజుల్లో కమిటీ రిపోర్టు ఇస్తుంది. కమిటీ రిపోర్టుకు ఒప్పుకుంటామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు ఆయనే చెప్పకనే చెప్తున్నాడు.
జనిగెలు బర్రె నెత్తురు పీల్చినట్టు… గోదావరి నీళ్లను పీల్చి పిప్పిచేసే ప్రాజెక్టు బనకచర్ల. మన వాటా గోదావరి నీళ్లను రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఎత్తిపోసి రాయలసీమను తడిపే ప్రాజెక్టు. అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు కంటే పెద్దది. 100 రోజులకు పైగా నీళ్లు మళ్లించి 200 టీఎంసీలు గుంజేస్తారట. 2026 కల్లా పూర్తిచేసి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు మళ్లిస్తామని ఆంధ్ర నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీలో అధికారికంగా ప్రకటించారు. నిన్నా మొన్నటిదాకా వరద నీళ్లే తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు, ఆయన మంత్రివర్గం కేంద్రం భేటీ తర్వాత ‘మా వాటా నీటిని తీసుకుంటం’ అని వెన్ను విరుచుకొని ప్రకటించింది. కానీ, మన సీఎం రేవంత్ మాత్రం కేంద్ర జల్‌శక్తి శాఖ భేటీలో బనకచర్ల మీద చర్చే జరగలేదని చెప్పి తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా వంచించిండు.
పిల్లనిచ్చిన పాపానికి గురువు ఒక్క ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిస్తే.. ఓటేసిన పాపానికి శిష్యుడు యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని కుళ్లబొడుస్తున్నడు. వీళ్ల వెన్నుపోటు జల రాజకీయాలతో తెలంగాణలో మళ్లీ ఎన్ని బలిదానాలు జరుగుతాయో?
ఇకడో సందర్భం గుర్తుచేయాలి. ఈ వారం నడిమిట్లనే (జూలై 16 నుంచి) ఉత్తరాయనం ముగిసి దక్షిణాయనం జొరబడ్డది. ఖగోళ లెకల ప్రకారం సంక్రాంతి పండుగ నాటినుంచి మొదలై ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు (జూలై 15) ఉత్తరాయనం, అకడినుంచి మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి వరకు(జనవరి 14) దక్షిణాయనం. దక్షిణాయనంలో సూర్యకాంతి ప్రభావం స్వల్పమే. ఫలితంగా మనుషుల్లో రోగ నిరోధక శక్తి క్షీణదశలో ఉంటుంది. సరిగ్గా పుషరకాలం కింద ఇదే మాసంలో గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాంసృతిక విప్లవ పునాది పడ్డది. మిషన్ కాకతీయ ప్రణాళికలకు అంకురార్పణ సమయం. ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాసాగర్‌రావు లాంటి జలరంగ నిపుణుల మేధోమథనం ఊపందుకున్నది. రాత్రింబవళ్లు చర్చలు. రోజుల తరబడి భేటీలు.
ఆ ఒత్తిడిలో ఒకసారి కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత అయింది. అగ్గొ… అప్పుడు లేచాయి గోతికాడి నకలు. కాలేయం పోయిందని ఒకడు.. కిడ్నీలని ఇంకోడు.. ఆనాటి నుంచి మొదలై ఈనాటి దినపొద్దు వరకు కోరని చావు లేదు. కానీ, కేసీఆర్ మునిపంటి వెనుక ఆ బాధను దిగమింగుకున్నడు. చంద్రబాబుతో పాటు ఆంధ్ర సంతతి విధ్వంసం చేసిపోయిన ఒక్కొక్క రంగాన్ని నిలబెట్టుకుంటా వచ్చారు. కాళేశ్వరం కట్టి నీళ్లు వదిలితే.. కృష్ణా నది బేసిన్లో ఉన్న మా ఊరు సూర్యాపేట జిల్లా కర్విరాల కొత్తగూడెంలో మత్తడి దుంకింది. పెద్దగుట్ట, చిన్న గుట్ట కింది భూములు పారినయి.
అయనం అంటే ప్రయాణం. భూమి తన చుట్టూ తాను తిరగడం. హరీశ్‌రావుకు అయనంతో పోటీపడటం అంటే ఇష్టం. మాటు ప్రయాణం.. చాటు ప్రయాణం చేసేటోడు కాదు. కారు ముందు సీట్ల తాను కూర్చుంటే.. వెనుక సీట్లలో జలరంగ నిపుణులో.. ప్రాజెక్టు నిష్ణాతులో… అడపా దడపా జర్నలిస్టులో ఆయనతో సాగిపోయేది. అది ఆయన ైస్టెల్. అట్లా కాళేశ్వరం నుంచి కల్వకుర్తి వరకు ఎన్నోసార్లు హరీశ్‌రావుతో కలిసి ప్రయాణం చేసిన అనుభవం నాది. విసుగు, విరామం లేని నిత్య ప్రయాణం. తెల్లవారు ఝాము 2 గంటల వరకు కాళేశ్వరం పనులను పర్యవేక్షించి, మళ్లీ ఉదయం పదిన్నర వరకు కేఎల్ఐ పంపుహౌజ్‌ల వద్ద ఇంజినీర్లతో సమీక్షలు జరిపిన రోజులు కోకొల్లలు. కాళేశ్వరంలో మండ్రగబ్బలు, విషపు తుట్టెల సంచారం. కేఎల్ఐ వద్ద ఎర్ర తేళ్లు, రక్త పెంజర్లు ఎన్నిసార్లు ప్రమాదం తప్పిందో లెక్కే లేదు. బురద భూముల్లో జారిపడబోతూ నిలదొక్కుకున్న సందర్భాలు అతి దగ్గరినుంచి చూశాను. నాకు తెలిసి ఇంట్లో భార్యకు కూడా చెప్పుకొని ఉండరు.
మాది నల్లమల అని చెప్పుకునే వాళ్లు పాలమూరు జిల్లా నల్లమల సానువు గ్రామాల్లో ఏం పాముల సంచారం ఎక్కువ ఉంటుందో చెప్పగలరా? ఇప్పుడు కొంత నయమే గానీ పదేండ్ల కింద పాలమూరు ప్రాంతంలో పాముకాటుతో ఎంతమంది ప్రజలు చనిపోయారో తెలుసునా?
చంద్రబాబు దొడ్డిదారిన నీళ్లు మళ్లించి బనకచర్ల కడుతుంటే..! మన రేవంత్ రెడ్డి కొలువు కూటం మీదికి వచ్చిన్నాడే కాళేశ్వరం ప్రాజెక్టు మీదికి కాలకూటం వదిలిండు. నెర్రెబాసిన పిల్లర్ పర్రెలకు పుర్రె పెట్టి చూసి ఇగ ఇది పనికిరాని ప్రాజెక్టు అని ప్రకటన చేసిండు. ప్రాజెక్టు మీద కమిషన్ వేసిండు. పరిగెత్తే గోదావరికి నడకనేర్పిన విశిష్టున్ని పిలిచి ప్రాసిక్యూషన్ చేసిండు. మౌన మునిలా.. గంభీరంగా వశిష్ఠ మహాబుషి తీరు కమిషన్ ముందుకు వచ్చిన కేసీఆర్‌ను, ఆయన్ను అనుసరిస్తూ విషణ్ణ వదనంలో నిలబడిన హరీశ్‌రావును చూస్తున్నప్పుడు 8వ తరగతిలో అనుకుంటా మా గోరంట్ల బడి తెలుగు సారు లక్ష్మణాచార్యులు రాగం ఎత్తి చదివి బట్టి పట్టించిన ‘విపది ధైర్యమథాభ్యుదయే క్షమా..’ భరృ్తహరి నీతి శతకంలోని సుభాషితం మదికొచ్చింది.
మహాత్ముల ప్రవర్తన ఎలాంటి సమయంలో ఎలా ఉంటుందో చెప్పే సుభాషితం. విపతాలంలో ధైర్యం, అభ్యుదయంలో క్షమాగుణం, జంకు లేకుండా చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పగలగటం, రణరంగంలో ఉన్నప్పుడు మొకవోని ఆత్మవిశ్వాసంతో ఉండటం ప్రకృతిసిద్ధ మహాత్ములకే సాధ్యమని సుభాషితం సారాంశం. అన్ని గుణాలున్నందుకే తెలంగాణ జన జాతులకు కేసీఆర్ బాపు అయ్యిండు. జీవితకాల లక్ష్యాన్ని పుష్కరకాలంలో సాధించి నిలబెట్టిండు.
గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యాం కట్టేటప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మూడు రాత్రుళ్లు ప్రాజెక్టు దగ్గర పడున్నారట. దీన్నొక అద్భుత క్రతువుగా నేటికీ చెప్పుకుంటారు. అక్కడి మీడియా అయితే ఆ రోజుల్లో మోదీని ఆకాశానికెత్తింది. నిద్ర లేని రాత్రులు లెక్కలేనన్ని గడిపి, గోదావరి నీళ్లను 600 మీటర్లు ఎత్తిపోసి, బీడుబడ్డ భూముల మీదికి నీళ్లు మలిపిన కేసీఆర్ జల సంకల్పాన్ని ఏమని పొగడాలి. ఆయనకు ఎందుకీ నిందలు. తెలంగాణలో కాకుండా మరే ప్రాంతంలో చేసినా వెయ్యేండ్ల కీర్తి పొందేవారు.
చెడగొట్టడం ఎంత పని? దీనికి కాలమానం, కొలమానం ఏముంటుంది. కడివెడు తేనెల నీటి చుక వేసినంత సులువు. కానీ పువ్వు పువ్వు నుంచి పుప్పొడి తోడి మకరందాన్ని మధువుగా మలిచే తేనెటీగకే ఆ కష్టం తెలుసు. తెలంగాణ ఉద్యమంలో పాత్రే లేనివాళ్లు.. ఇప్పటికీ ‘జై తెలంగాణ’ అనని వాళ్లు తెలంగాణ భవిష్యత్తును కూలదోస్తున్నరు.
చట్టసభల తీర్మానం లేకుండా ఏకపక్షంగా హోటల్ గదుల్లో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నరు. పొరుగు రాష్ర్టాలకు నీళ్లను మళ్లిస్తున్నరు. కాసింత చూసీ చూడనట్టు ఉంటే నదు లు దారి మళ్లిపోతున్నయి. ఇంకా మనం ఆదమరిచి ఉంటే సరిహద్దులు చెరిగిపోతయి. సమైక్యవాదం ముందుకొస్తది. తెలంగాణ ప్రజల్లారా ఔర్ ఏక్ ధక్కా ఆసన్నమైనది. మన కోసం.. తడి తప్పిన మన పంట భూముల కోసం.. సజీ వ జలధారల కోసం.. సకల జీవరాశుల గమ నం కోసం.. మళ్లీ పిట్ట వాలిన చెట్టు ఆనవాళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు