నడిమంత్రపు పాలకులు తమ అధికారం శాశ్వతం అనుకున్నట్టుగానే తాము చేపట్టిన నిర్మాణాలు చిరకాలం ఉంటాయని భ్రమ పడతారు, భ్రమ పెడతారు. ఇందుకు మేడారంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన గద్దెల నిర్మాణం దీనికి ఉదాహరణ. ప్రభుత్వం ఆర్భాటంగా, అట్టహాసంతో చేపట్టిన పనులు పైన పటారం, లోన లొటారంలా మిగిలిపోయాయి. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో పునరుద్ధరణ పనుల పేరిట చేపట్టిన పనుల నాణ్యత నాసిరకంగా ఉందని చెప్పడానికి గద్దెల దుస్థితి అద్దం పడుతున్నది. వెయ్యేండ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పునరుద్ధరణ పనులు చేపడుతున్నామంటూ పునాదిరాయి వేసిన రోజు చెప్పిన ముఖ్యమంత్రి.. ఎక్కడికక్కడ ఊడిపడుతున్న శిలల గురించి ఏమంటారు? మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయిన ఈ పనులకు రూ.101 కోట్ల ప్రజాధనం హారతి కర్పూరంలా కరిగిపోయింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, ఆ శాఖ పరిధిలోని ఇంజినీర్ల ప్రణాళికలతో జరగాల్సిన పనులు ఓ మంత్రికి చెందిన ప్రైవేట్ కంపెనీ వ్యవహారంగా సాగడం ఏమిటి? ఆ కంపెనీ యజమాని అయిన మంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో 11 సార్లు వెళ్లి జరిపిన పరిశీలనలు సాధించింది పూజ్యం. ఈ ఘనకార్యానికి ముఖ్యమంత్రి చేసిన దిశానిర్దేశం ఏపాటిది? గిరిజన దేవతల గద్దెల శిలలపై వారి సంస్కృతికి సంబంధం లేని చిహ్నాలను చెక్కారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ వైఖరిని చరిత్రకారులు తప్పుబట్టారు. వెయ్యేండ్లు ఉంటాయంటూ పాలకులు ఊదరగొట్టిన గద్దెలు కనీసం వెయ్యి గంటలు కూడా నిలువలేదు. గద్దెల ప్రాంగణం ఫ్లోరింగ్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేయాల్సిన ఈ పనులు చివరికి మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోవడం విచారకరం.
అటు మేడారం జాతర నిర్వహణలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రెండేండ్లకోసారి జరిగే జాతరకు ముందస్తుగానే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ గాడితప్పిన పాలనలో సమీక్షలు, ప్రణాళికలు ఆశించడం అత్యాశే అవుతుంది. ఆలస్యంగా మేల్కొన్న పాలకులు సరైన రవాణా సౌకర్యం కూడా కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. రాకపోకలకు కూడా ఏర్పాట్లు చేయలేని పాలక పెద్దలు, పునరుద్ధరణ పనుల పేరిట హడావుడి, పబ్లిసిటీ స్టంట్స్‌తో సరిపెట్టారు. జాతర పనులు దక్కించుకోవడానికి ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన కుమ్ములాటలు బజారుకెక్కడం మనం చూశాం. ఆ తర్వాత ఇద్దరు మంత్రులు కలిసి ఒక అవగాహనకు వచ్చి, కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాము చెప్పుకోవడం, విభేదాలు సమసిపోయాయని చెప్పుకొనిరావడం విడ్డూరం.
ఒకరికి వంక పెట్టడం సులభమే. కానీ మెరుగైన రీతిలో పనులు చేసి చూపడం ముఖ్యం. ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు, మహోన్నతమైన ఆలయాలు, భవంతులు నిర్మించిన పాలనాదక్షులపై అవాకులు, చెవాకులు పేలడం, బట్టకాల్చి మీద వేసిన పాలకులు అందులో వెయ్యోవంతు అయినా తాము చేసి చూపాలి. అద్భుతమైన ప్రాజెక్టుగా మన్ననలు అందుకున్న కాళేశ్వరంపై కూలేశరం అని అడ్డగోలుగా మాట్లాడిన నేతలకు ఒక ఆలయంలో గద్దెలు కూడా నిర్మించడం కూడా చేతకాలేదు. తల్లుల గద్దెల నుంచి శిలలు రోజుల వ్యవధిలోనే ఊడిపడటం కాంగ్రెస్ ప్రభుత్వ పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఎస్ఎల్బీసీ మీదా ఇదే గొప్పలు చెప్పి ఆఖరికి కుప్పకూల్చారు టన్నెల్. ఘనమైన ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు, కనీసం దేవాలయ ప్రాంగణంలో గద్దెలైనా నిర్మించలేని అసమర్థతను కాంగ్రెస్ పాలకులు చాటుకున్నారు. దీనిపై సీఎం, మంత్రులు మాట్లాడటం లేదు. అధికారులను ముందుకు తోసి అర్థం లేని మాటలు చెప్పిస్తున్నారు. జాతర వైఫల్యాల వెనుక ఎవరి బాధ్యత ఎంత? ఎవరికెంత ముట్టింది? అనేది ఎవరు నిగ్గు తేల్చాలి? ఏ కమిషన్లు విచారించాలి? వనదేవతలుగా నీరాజనాలందుకునే తల్లులకు జరిగిన అపచారానికి ఎవరు జవాబు చెప్తారు?