‘రైతులెవరూ అధైర్యపడొద్దు. వర్షాలకు తడిసిన ప్రతీ గింజను కొంటం. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తం. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా మద్దతు ధర చెల్లించి మరీ పండిన ప్రతీ గింజ కొంటం’.. ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కార్ చేతులెత్తేసిన సందర్భంలో అన్నదాతలకు నాటి సీఎం కేసీఆర్ ఇచ్చిన అభయమిది. కానీ, నేడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది?
పండిన ధాన్యాన్ని కొనే దిక్కు లేక అన్నదాతలు కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారు. పగలనక, రాత్రనక కొనుగోలు కేంద్రాల్లో కనురెప్ప వాల్చకుండా కావలి కాస్తున్నారు. ప్రజా ప్రభుత్వమని గప్పాలు కొట్టే కాంగ్రెస్ పాలనలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటే లేదు. ఇప్పటికే ఏర్పాటైన కేంద్రాల్లో కొనుగోళ్ల ఊసే లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి రావడం దారుణం.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువైన నాటినుంచీ కర్షకులు కష్టాల కడలిలో ఈదుతున్నారు. తెలంగాణలో పంట సాగుచేసుకునే పరిస్థితులు లేకుండా చేసింది రేవంత్ ప్రభుత్వం. దుక్కి దున్నిన నాటినుంచీ పంట కోత వరకు కర్షకులకు అన్నీ కష్టాలే. కాంగ్రెస్ వచ్చిన దగ్గర్నుంచి నకిలీ విత్తనాల బెడద ఎక్కువైంది. నిరుడు సాగునీళ్లు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయి. ఈసారి వర్షాలు బాగా కురవడంతో రైతన్నలు ముందుగానే సాగు పనులు మొదలుపెట్టగా నకిలీ విత్తనాలు వారికి శాపంగా మారాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా యూరియా కొరత వేధించింది. సకాలంలో ఎరువులందక పంట సరిగ్గా ఎదగలేదు. ఎలాగోలా అన్నింటిని తట్టుకొని పంట తీసిన రైతన్నను ఇప్పుడు కొనుగోళ్ల సమస్య వెంటాడుతున్నది. పండించిన ధాన్యాన్ని పట్టుకొని రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతు సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్ ఆది నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పంట చేతికొస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ సీజన్లో మొత్తం 8,332 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సివిల్ సప్లయ్ ప్రకటించగా, ఇప్పటివరకు 7,300 కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేయడం ఈ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇవి కూడా కాగితంపై కనిపిస్తున్న లెక్కలే. క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు కానీ, వాటిలో కనీస సౌకర్యాలు లేవు, కొనుగోళ్లు సాగవు. ధాన్యం తడిసిందని, తేమ ఉందని, రంగు మారిందని, నాణ్యత లేదని, తాలు ఉందని చెప్తూ కొనుగోలు కేంద్రాల్లో రైతులను అరిగోస పెడుతున్నారు. ఈ వానకాలం సీజన్లో రాష్ట్రంలో 65.96 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, సుమారు 159 లక్షల టన్నుల ధాన్యం పండుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో నుంచి సగమే, అంటే 80 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది.
అయితే, రాష్ట్రంలో సెప్టెంబర్ నెల చివరి వారం నుంచే కోతలు షురూ అయ్యాయి. అక్టోబర్, నవంబర్ మాసాల్లో కోతలు జోరందుకున్నాయి. నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ నాట్లు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం.. అక్టోబర్‌లో 6.89 లక్షల టన్నులు, నవంబర్‌లో 32.95 లక్షల టన్నులు, డిసెంబర్లో 27.03 లక్షల టన్నులు, జనవరిలో 8.12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు కేవలం 15 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయడం రేవంత్ సర్కార్‌కు రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నది. ఇందులోనూ అత్యధికంగా 8 లక్షల టన్నులు దొడ్డు వడ్లు కావడం గమనార్హం.
కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన దిక్కుమాలిన బోనస్.. కాదు కాదు, బోగస్ పథకం రైతుల పాలిట శాపంగా మారింది. బోనస్‌ను ఎగ్గొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నాల కొనుగోలును నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. బోనస్‌ను తప్పించుకునేందుకు సన్నాల రైతులను సర్కార్ కష్టపెడుతుండటంతో వారు దళారులకు వడ్లను అమ్ముకోవాల్సి వస్తున్నది. దానివల్ల కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. ఇప్పటికే గతేడాదికి సంబంధించి బోనస్ బకాయిలు రూ.1,161 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందులో వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా ఖమ్మం రైతులకే రూ.64.41 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కరీంనగర్ జిల్లా రైతులకు రూ.62.6 కోట్లు చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా 4.09 లక్షల మంది రైతులు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో కొనుగోలు చేసిన, చేయాల్సిన సన్నాలకు చెల్లంచాల్సిన బోనస్ అదనం.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలు ఎన్నడూ ఇలాంటి కష్టాలను చూడలేదు. కేసీఆర్ సర్కార్ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడంతో రైతన్నలు రైతు రాజ్యాన్ని చూశారు. ఉమ్మడి ఏపీలో మన అన్నదాతలు పడిన కష్టాలను ఒక రైతుగా కండ్లారా చూసిన కేసీఆర్ స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో మేధోమథనం చేసి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించారు. ఎవుసానికి ఉచితంగా 24 గంటల కరెంట్, రైతుబంధు పెట్టుబడి సాయం, రైతుబీమా, రైతు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు వేదికలు, పుష్కలంగా సాగునీరు… ఇలా అనేక కార్యక్రమాలతో తెలంగాణలో పదేండ్లపాటు వ్యవసాయం వర్ధిల్లింది. 2014 నుంచి 2023 వరకు రూ.1.59 లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ సర్కార్ నిర్మించింది. రూ.5,249 కోట్లతో సుమారు 40 వేల చెరువులను పునరుద్ధరించింది. కేసీఆర్ సర్కార్ అమలు చేసిన పథకాల ఫలితంగా 2014లో రాష్ట్రంలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం.. 2023 నాటికి 2.20 కోట్ల ఎకరాలకు ఎగబాకింది. 2014-15లో 68 లక్షల టన్నులు మాత్రమే ఉన్న ధాన్యం ఉత్పత్తి.. 2022-23 నాటికి 2.70 కోట్ల టన్నులకు చేరుకుంది. దాంతో తెలంగాణ అన్నపూర్ణగా మారింది. పుట్లకు పుట్లు వడ్లు పండినా కేసీఆర్ సర్కార్ ప్రతీ గింజను కొనుగోలు చేసింది. సకాలంలో అన్నదాతలకు చెల్లింపులు చేసింది. కానీ, నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పథకాలను అమలు చేయకపోగా, పండించిన పంటనూ కొనడం లేదు. అందుకే మరోసారి రైతు సంక్షేమ రాజ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ అన్నదాతల తరఫున రోడ్డెక్కింది. కొనుగోలు కేంద్రాల బాటపట్టి, అన్నదాతలకు అండగా నిలుస్తున్నది. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజను కొనుగోలు చేసేదాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ పోరు కొనసాగుతుంది. రేవంత్‌రెడ్డి సర్కార్ మెడలు వంచేదాకా రైతు ఉద్యమం ఆగదు.
(వ్యాసకర్త: అధ్యక్షులు, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా)
– కాసర్ల నాగేందర్‌రెడ్డి