కేసీఆర్ చల్లని పాలనలో స్వర్ణయుగాన్ని చూసిన గురుకులాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యపు నీడలో కొడిగట్టిన దీపాలై దీనావస్థకు చేరుకున్నాయి. వెనుకబడిన వర్గాలు, మైనారిటీ, గిరిజన బాలలకు చదువును చేరువ చేసేందుకు ఏర్పాటైన గురుకులాలు నేడు గోస ల నిలయాలుగా మారిపోయాయి. విషజ్వరా లు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో వందలాదిగా విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఏడాది కాలంలోనే విషాహారం తిని వెయ్యిమందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో సగటున నెలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే వందకు పైగా విద్యార్థులు మృత్యుఒడికి చేరారు. కేసీఆర్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే, రేవంత్ పాలనలో అవి నరక కూపాలుగా మారాయి. నాణ్యమైన ఆహారం అందించాలని ఏకంగా విద్యార్థులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రభుత్వంపై ఫిర్యా దు చేసే పరిస్థితి తెచ్చింది రేవంత్ సర్కార్. మౌలిక వసతులు కల్పించకపోవడం, ఉపాధ్యాయులను, వార్డెన్లను నియమించకపోవడం ఒక ఎత్తయితే నాణ్యమైన ఆహారం అందించే విషయమై జాగ్రత్తలు పాటించకపోవడంతో గురుకులాలు గూతకు వచ్చాయి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత మానవ వనరుల అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల సంఖ్యను భారీగా పెంచారు. 2014లో రాష్ట్రం ఏర్పాటు నాటికి కేవలం 294 గురుకులాలు మాత్రమే ఉంటే, పదేండ్లలో వాటి సంఖ్య 1023కు పెంచిన ఘనత కేసీఆర్‌దే. గురుకులాల్లో విద్యార్థుల సంఖ్యను లక్ష నుంచి ఆరున్నర లక్షలకు పెంచి పేదల పిల్లలకు చక్కని వసతి, భోజన సదుపాయంతో పాటుగా నాణ్యమైన విద్యనందించింది కేసీఆర్ ప్రభుత్వం. గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునేది పేద, మధ్యతరగతి పిల్లలే కావడంతో వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకున్నారు.
చదువు కొనలేని పేదలకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి విద్యను గురుకులాల్లో అందించారు. ఒకానొక దశలో అంతర్జాతీయ కార్పొరేట్ విద్యతో ప్రభుత్వ సూళ్లలో చదివే విద్యార్థులు పోటీ పడ్డారు. దీంతో గత పదేండ్లలో గురుకుల విద్యార్థులు అనేక సంచలన విజయాలు సాధించారు. నీట్, ఎంసెట్ సహా జాతీయ ఎంట్రెన్స్ టెస్ట్‌లో గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటారు. అనేక ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో తిరుగులేని ఫలితాలను నమోదు చేశారు. ఇటు చదువు ల్లోనూ, అటు క్రీడలు, సాహసిక అంశాల్లో నూ తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించి ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుపోయారు.
ఇప్పుడు అదంతా గత చరిత్ర. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఒక పథకం ప్రకారమే తెలంగాణలోని గురుకుల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న కక్షతో రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన గుప్పెట్లో పెట్టుకొని గురుకులాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. సరైన వసతులు, భోజన సదుపాయాలు లేకుండా చేస్తూ ఎండబెడుతున్నారు. విషాహారం తిని అనారోగ్యం పాలైన విద్యార్థులు రోజుల తరబడి దవాఖానల్లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతుంటే, గురుకులాల్లో అసలు ఫుడ్ పాయిజనింగ్ జరగడం లేదని నిస్సిగ్గుగా బొంకడం ముఖ్యమంత్రి రేవంత్‌కే చెల్లింది.