ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ప్రస్తుతం ఏం జరుగుతున్నదంటే చిత్ర విచిత్రమైన కేసుల నమోదు ప్రక్రియ జరుగుతున్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినా, ప్రభుత్వాన్ని విమర్శించినా టెర్రరిస్టుల కోసం కాపు కాసినట్టు అర్ధరాత్రి రెండు గంటలకు విమానాశ్రయంలో గుంపులు గుంపులుగా పోలీసులు కాపలా కాసి మరీ అరెస్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేకసార్లు మందలించినా, ఇవేం కేసులని తలంటినా మార్పు రావడం లేదు. రెండు రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి.
టీవీ చర్చలో యాంకర్ నవ్వాడని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాన్వాయ్ కారు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే కారులో ప్రయాణించిన మాజీ ముఖ్యమంత్రి మీద కేసు నమోదు చేశారు. కేసులు పెట్టాలనుకొనే ప్రభుత్వాలకు కారణాలకు కొదువ ఉంటుందా? ప్రభుత్వాలకు చేయడానికి మరో పని లేనట్టు కేసులు పెట్టడమే ప్రధానమైన పనిగా మారింది. ప్రాజెక్టులకు మరమ్మతులు చేద్దామన్నా నిధులు లేవు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించడానికి సైతం డబ్బులు లేవు. ‘నన్ను కోసినా డబ్బులు రావు’ అని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. నిజమే ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాలంటే నిధులు కావాలి, కానీ కేసులు పెట్టడానికి నిధులు అవసరం లేదు కదా? ఎన్ని కేసులైనా పెట్టవచ్చు. అందుకే, ప్రాజెక్టుల మీద కన్నా కేసులపైనే పాలకులు ఎక్కువగా దృష్టిసారించారు.
నిధులు లేవు నిజమే కానీ, నిధులు సమకూర్చుకొనే సామర్థ్యం కూడా లేదనేది ఇంకా నిజం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఖజానాలో కట్టల కట్టలు నిధులుండేవా? తెలంగాణ స్వరూపం ఏమిటి? నిధులు ఎలా సమకూర్చుకోవాలి? తెలంగాణ ప్రాధాన్యాలు ఏమిటని సమీక్షించి, నిపుణుల సలహాలు తీసుకుని కరువు తెలంగాణ, రైతుల ఆత్మహత్యల తెలంగాణను సస్యశ్యామల తెలంగాణగా కేసీఆర్ తీర్చిదిద్దారు. ‘సచివాలయంలో లంకె బిందెలుంటాయనుకున్నాను, లేవు’ అని సీఎం పదవి చేపట్టగానే రేవంత్‌రెడ్డి నిస్సహాయతను వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూరుతాయి? వాటిని ఎలా వ్యయం చేస్తారనే అంశంపై సీఎంకు ఉన్న అవగాహన ఏపాటిదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక షాప్ అయితే గల్లా పెట్టే ఉంటుంది. మోతుబరి వద్ద ఇంట్లో పెద్ద తిజోరి ఉంటుంది. అందులో బోలెడు డబ్బు ఉంటుంది. ప్రభుత్వం వద్ద మోతుబరిలా తిజోరి ఉంటుందని ఆయన అనుకున్నారేమో.
ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చి పెట్టే రియల్ ఎస్టేట్ గొంతు పిసికేశారు. రియల్ ఎస్టేట్ వల్ల ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం లభించడమే కాదు, రియల్ ఎస్టేట్ వల్ల మార్కెట్లో నిధులు ప్రవహిస్తాయి. మంచి ఆదాయం ఉందనుకుంటేనే విదేశాల్లో ఉన్నవారు, వివిధ రాష్ర్టాల్లో ఉన్నవాళ్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు. పెరగడం అటుంచి గతంలో కన్నా ధరలు తగ్గేసరికి రియల్ ఎస్టేట్‌లోకి నిధుల ప్రవాహం నిలిచిపోయింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మీడియా అకాడమీ చైర్మన్ ఓ ఇంటర్వ్యూలో ఒక మంచి మాట చెప్పారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య బదిలీల కారణంగా మా బంధువు ఒకరికి రావలసిన బకాయిల చెల్లింపు నిలిచిపోయింది. రేవంత్‌రెడ్డి సీఎం కాగానే ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లాను. మరుసటి రోజు ఆ వ్యక్తి సంబంధిత ఆఫీస్‌కు వెళ్లగానే చెక్కు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఎంతో వేగంగా పని చేస్తున్నదని అతను వంద మందికి చెబుతారు. ఎంత పాజిటివ్ ప్రభావం ఉంటుందో కదా’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో అవాస్తవమేమీ లేదు. ఒక ఉద్యోగికి రావలసిన బకాయిలు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో స్వయంగా సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఏడాదికి దాదాపు పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఇప్పటికే 2024, 2025లో రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ కింద దాదాపు రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా, కనీసం పది శాతం మందికి కూడా ప్రభుత్వం చెల్లించలేకపోతున్నది. 2024లో 9,700 మంది రిటైర్ అయ్యారు. 2025లో ఇంకా పది వేల మంది రిటైర్ కానున్నారు. వీరికి రూ.5 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మీడియా అకాడమీ చైర్మన్ చెప్పినట్టు ఒక్క ఉద్యోగికి బకాయిలు చెల్లిస్తే కొన్ని వందల మంది ప్రచారం ద్వారా ప్రభుత్వం పట్ల బోలెడు పాజిటివ్ ప్రచారం జరిగితే, పది వేల మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోతే ప్రభుత్వంపై ఎంత తీవ్ర వ్యతిరేకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఫోన్ ట్యాపింగ్ కేసు, కార్ రేస్ కేసులంటూ మీడియాలో ప్రచారంతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం తన ప్రాధాన్యాలను నిర్ణయించుకోలేక పోతున్నది. ఒకవైపు కాళేశ్వరం మరమ్మతులకు నిధులు లేవని చెబుతున్నారు. మరోవైపు రూ.లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటూ హడావుడి చేశారు. ఇప్పుడు మళ్లీ మూసీ ప్రాజెక్టు పేరెత్తడం లేదు. ఎన్నికల సమయంలో రాచకొండ వద్ద కొత్త నగరాన్ని నిర్మిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు రాచకొండను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు ‘ఇందిరమ్మ’ పేరు పెట్టి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఒకవైపు జీతాలు చెల్లించడమే కష్టంగా ఉందని అంటూనే, మరోవైపు తల తాకట్టు పెట్టయినా వచ్చే మూడేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇండ్లు కాకుండా, ఈ ప్రభుత్వం కనీసం 20 ఇందిరమ్మ ఇండ్లు అయినా నిర్మించి, ఆ తర్వాత మూడేండ్లలో 20 లక్షలు నిర్మిస్తామని చెబితే బాగుండు.
పేర్లు మార్చడం, కేసులు పెట్టడం, యూట్యూబ్ బృందాలను ఏర్పాటు చేసుకొని దుష్ప్రచారం చేయడం, బహిరంగ సభల్లో బూతులు తిట్టడం మాత్రమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు. అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా తెలంగాణ ప్రాధాన్యాలు ఏమిటి? కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యం ఏమిటి? అనే దానిపై పాలకులు దృష్టి సారించడం లేదు. ఐదేండ్ల తర్వాత ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు భలే బూతులు తిట్టారు, చక్కగా పేర్లు మార్చారు, కేసులు పెట్టారని జనం మెచ్చుకోరు. ఐదేండ్లలో ఏం చేశారని అడుగుతారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప చెప్పుకోవడానికి ఏముంది?
‘ఇన్నేసి హామీలు ఇస్తున్నారు, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు?’ అని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులను మీడియా ప్రశ్నించింది. కాంగ్రెస్‌లో చాలామంది ఆర్థిక నిపుణులు ఉన్నారని, పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రస్తుత ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అప్పట్లో సెలవిచ్చారు. నేడు ఎప్పుడూ లేని విధంగా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మరి భట్టి చెప్పిన ఆర్థిక నిపుణులు ఏం చేస్తున్నట్టు? వారి సేవలు ఇంకెప్పుడు ఉపయోగించుకుంటారు? కాంగ్రెస్‌కు ఇంకా మిగిలింది మూడేండ్ల కాలమే. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల నామ సంవత్సరమే. ఈ నేపథ్యంలో మిగిలిన రెండేండ్లు కూడా కేసులు, లీకేజీ వార్తలతో కాలం గడుపుతారా? లేక ఏమైనా పనులు చేస్తారా? అన్నది చూడాలి.