తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి, సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ రెండున్నరేండ్లు గడిచినా హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివిధ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపి నాలుగు అంశాలపై నిర్ణయం తీసుకున్నది. ఇది ఉద్యోగుల విజయం. ఈ సర్కార్ మూడుసార్లు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇదీ అనుమానమే.
2023 జూలై నుంచి పీఆర్సీ అమల్లోకి రావాలి. కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేసి ఎన్నికల నేపథ్యంలో ఆరు నెలలు ఆలస్యం జరుగుతుందని భావించి 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు పీఆర్సీ అమలు చేయలేదు. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇవ్వటానికి సెప్టెంబర్ వరకు గడువు పొడిగించింది. ఉద్యోగులు, పెన్షనర్ల తీవ్ర ఆందోళన కారణంగా నివేదిక త్వరగా ఇవ్వాలని పీఆర్సీ కమిషన్‌ను సర్కార్ ఆదేశించింది.
జూన్ రెండు లోపు నివేదిక వస్తుందని, ఆరు నెలల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం చెప్తున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, అప్పులపై చేస్తున్న ప్రచారం, పడిపోయిన రాబడి వల్ల, రాష్ట్రం దివాలా దిశగా అడుగులు వేస్తున్నదని ముఖ్యమంత్రి పదే పదే వల్లెవేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి పీఆర్సీ నివేదిక ఫిట్మెంట్ రికమండేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం తో అదనంగా ఆర్థిక భారం, విద్య, వైద్యం కోసం చేసే ఖర్చులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన ఫిట్మెంట్ కావాలని ఉద్యోగులు కోరుతున్నారు. 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగులకు రావలసిన పెన్షన్ ప్రయోజనాలు, వారు దాచుకున్న సొమ్ము తిరిగి చెల్లించటం లేదు. ప్రభుత్వ వైఖరితో దాదాపు 30 వేల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మానసిక ఒత్తిడి కారణంగా ఇప్పటికే 90 మంది మరణించారు. వేలాది మంది న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల తర్వాత వంద రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది.
ఉద్యోగుల బకాయిలు చెల్లించటం సర్వసాధారణం. కానీ కాంగ్రెస్ సర్కార్ తాము మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పటం ప్రచార ఆర్భాటమే. రూ.14 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఇస్తే మిగతా మొత్తం ఎప్పడు ఇస్తుంది? రిటైరైన ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఒకేసారి చెల్లించాలని పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. ప్రతి నెలా రూ.700 కోట్లు విడుదల చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పినా కేవలం రూ.300 కోట్లు దాటడంలేదు. ఈ విషయంలో ప్రభుత్వ వాదన నిజమైతే ఆ లెక్కలు తక్షణం బయటపెట్టాలి.
ఉద్యోగుల హెల్త్‌కార్డ్స్ వ్యవహారం అంతులేని కథగా మారింది. రెండు నెలల క్రితం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అమలు జరగలేదు, కనీసం విధివిధానాలు రూపొందించలేదు. వైద్య చికిత్సల్లో పరిమితి లేకుండా ఉండాలని, అన్ని కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయాలని, అవుట్‌పేషెంట్ సౌకర్యం కల్పించాలని, వెల్నెస్ సెంటర్లలో మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులు కోరుతున్నారు. చివరికి కంట్రిబ్యూషన్ చెల్లిస్తామని ఉద్యోగులు ముందుకు వచ్చినా ఒక్క అడుగైనా ముందుకు పడలేదు.
పెండింగ్ మెడికల్ బిల్లులు అన్నీ చెల్లించామని ప్రభుత్వం ప్రకటించటం దారుణం. అన్ని జిల్లా వైద్య అధికారి కార్యాలయాల్లో వేలాది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునర్నిర్మించామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో కాని, జిల్లా స్థాయిలో కాని ఒక్క సమావేశమైనా నిర్వహించలేదు. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోలేదు, కనీసం పరిశీలిస్తామని కూడా చెప్పలేదు. దేశంలోనే అత్యధిక డీఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం తెలంగాణ కావటం విచారించతగ్గది.
2023 జూలై 1 నుంచి రావలసిన 5 విడుతల కరువు భత్యం ఇప్పటివరకు విడుదల చేయలేదు. కొత్తగా డీఏల విడుదలను పీఆర్సీతో ముడిపెట్టి వాయిదా వేయటానికి రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. పీఆర్సీలో డీఏ విలీనం చేయాలనే సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. చర్చల్లో డీఏ విషయాన్ని ప్రభుత్వం పక్కకు పెట్టటం, పీఆర్సీతో ముడిపెట్టటం ఉద్యోగులకు తీరని నష్టం చేకూర్చుతుంది. పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ తేదీలో తేడా వస్తే జరిగే నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఉద్యోగుల కోసం నిరంతరం పనిచేస్తున్న సంఘాల నాయకత్వంపై అపనమ్మకం ఏర్పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు 12 పీఆర్సీలు ఉద్యోగ సంఘాల వీరోచిత పోరాటాల ద్వారా సాకారమైనవే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు పీఆర్సీల్లో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. రేవంత్ సర్కార్ కూడా అదే తరహాలో ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతూ వస్తున్నారు. కానీ రెండున్నరేండ్ల తర్వాత ఎంతో కొంత ఇస్తే చాలు అనే పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు.. ఇది విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలి.
(వ్యాసకర్త: స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
– దేవీప్రసాద్