Actor Brahmanandam | అక్కినేని సుమంత్ హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. వారాహి అమ్మవారి దివ్య శక్తి, పురాతన నమ్మకాలు, అంతుచిక్కని రహస్యాల నేపథ్యంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ లెజెండరీ నటుడు, ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం గారు ఒక విలక్షణమైన మరియు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ‘బ్రహ్మ’ పాత్రలో కనిపించనున్నారు.
ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చి ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని, ఆయన పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. సుమంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కాలిపు మధు, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.