ఒకప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ విద్య పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల గ్రామాలు, తండాలు, గూడేల్లోని పేద కుటుంబాల్లో సైతం మొదటి తరం ఇంజినీర్లు, డాక్టర్లు తయారయ్యారు. తద్వారా ఎందరో ఉన్నత విద్యనభ్యసించి ఐటీ, సాఫ్ట్వేర్, మెడికల్, ఇంజినీరింగ్ రంగాల్లో రాణించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించి, రాష్ట్ర పురోగతిలో భాగమయ్యారు.
విద్యను పేదలకు చేరువ చేయడానికి గత ప్రభుత్వాలు అనేక మార్గాలు అన్వేషించాయి. అందులో భాగంగా తెలు గుదేశం పార్టీ హయాంలో విద్యార్థుల కోసం అప్పటి సీఎం ఎన్టీఆర్ ఫ్రీ బస్పాస్ ఇచ్చారు, ఆ తర్వాత వచ్చిన సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ హయాంలో సుమారు 1,023 గురుకులాలను ఏర్పాటు చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ నెలకొల్పారు. ఓవర్సీస్ స్కాలర్షిప్తో వివిధ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యను సైతం చేరువ చేశారు.
ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం సుమారు రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను పెండింగ్లో పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరాఘాటంగా కొనసాగిన ఈ పథకాలను శాశ్వతంగా అటకెక్కించాలని రేవంత్ సర్కార్ కుట్రకు తెరలేపింది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పలుమార్లు ప్రగల్భాలు పలికిన రేవంత్ ఇప్పుడు వైఎస్సార్ ఆనవాళ్లకూ ఎసరు పెట్టారు. అందుకే, క్రమక్రమంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బలహీనపరిచి, పూర్తిగా బంద్ చేసే కుట్ర చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మీదనే ఆధారపడి నడిచే ప్రైవేట్ కళాశాలలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. అనేక కళాశాలలు ఇప్పటికే మూతపడ్డాయి. సీఎం రేవంత్ ‘సెటిల్ చేస్తా’ అని కాలేజీ యాజమాన్యాలతో అనడం విడ్డూరం. ‘సెటిల్మెంట్’ అనే పదాన్ని ప్రయోగించడం ద్వారా ఆయన ఉద్దేశం బహిర్గతమైంది. ప్రభుత్వం అసంబద్ధమైన జీవో నెంబర్ 7 తెచ్చింది. ఇందులో భాగంగా ఒకవేళ విద్యార్థులు కళాశాలలకు చెల్లించకపోతే రెవెన్యూ యాక్ట్ ప్రయోగిస్తారట.
ఒకవైపు అద్దెలు కట్టలేక, మరోవైపు సిబ్బందికి వేతనాలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోయి వందలాది కళాశాలలు మూతపడ్డాయి. ఫలితంగా నెలవారీ జీతాలపైనే ఆధారపడి జీవించే బోధన, బోధనేతర సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరోవైపు ఉత్తీర్ణత సాధించినప్పటికీ సర్టిఫికెట్లు రాకపోవడంతో కొందరు విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైతే, మరికొందరు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు.
ఫీజు బకాయిలను నెలకు రూ.200 కోట్ల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇలా దశల వారీగా చెల్లించడమంటే సన్నిహితులకు లేదా కమీషన్లు చెల్లించే వారికి మాత్రమేననే కుట్ర దాగివున్నదని విశదమవుతున్నది. తెలంగాణకు కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక అంతకుముందు పెండింగ్లో ఉన్న రూ.2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఏకకాలంలో చెల్లించి కొత్త రాష్ట్రంలో విద్యారంగానికి కొత్త జీవం పోశారు. కానీ, విద్యారంగంపై ఏమాత్రం అవగాహన లేని రేవంత్రెడ్డి, పెండింగ్ బకాయిలతో సంబంధం లేదన్నట్టుగా వితండవాదం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యారంగాన్ని కాపాడుకోవడానికి సమాజంలోని అన్నివర్గాలు ఏకమై కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు)
– ఏనుగుల రాకేశ్రెడ్డి