ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండేండ్లు పూర్తయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆరు గ్యారెంటీలలో భాగంగా కార్మిక వర్గానికి ప్రత్యేకంగా సింగరేణికి అనేక హామీలను ఇచ్చారు. రెండేండ్ల పరిపాలనను పరిశీలిస్తే ఓట్లకోసం ఇచ్చిన హామీలు వేరు, గద్దెనెక్కాక అమలు వేరు అన్నట్టుగా అమలుకాని హామీలు ఇచ్చి పరిపాలనలో అమలుకు చోటే లేదన్నట్టుగా స్పష్టమవుతున్నది. ఎన్నికల ప్రణాళికలో ఆరు గ్యారంటీల పేరున సింగరేణికి ఇచ్చిన హామీలు, అవి అటకెక్కిన తీరును పరిశీలిద్దాం.
అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ హామీలు ఇలా ఉన్నాయి. సింగరేణి ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం, సింగరేణి నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తాం, సింగరేణి కాలనీలో ఆధునిక విద్యాలయాలను ఏర్పాటు చేస్తాం, కార్మిక సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు పటిష్ట చర్యలు చేపడతాం, కారుణ్య నియామకాలను సరళీకృతం చేస్తాం, కార్మికుల వేతనాలు, నిర్ణీత సమయంలో సవరించి చెల్లిస్తాం అని పేర్కొన్నారు. కానీ హామీలకు పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ పాలన సాగుతున్నది.
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం 286 బొగ్గుగనుల అమ్మకాలకు పూనుకున్నది. ఇందులో భాగంగా సింగరేణికి చెందిన కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణిపల్లి, కల్యాణిఖని గనులను అమ్మకానికి పెట్టేందుకు చర్యలు చేపట్టింది. బొగ్గు గనుల అమ్మకానికి పెట్టిన వేలం పాటలలో పాల్గొనకుండా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం దూరంగా ఉన్నది.
నాలుగు గనుల అమ్మకానికి వ్యతిరేకంగా 2021 డిసెంబర్ 9 నుంచి కార్మిక సంఘాల ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో 72 గంటలపాటు సమ్మె జరిగింది. ఆనాటి సమ్మెలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి మొత్తం 42 గనులలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఈ రెండేండ్ల కాలంలో గనుల సంఖ్య 32కు తగ్గిపోయింది. నష్టాల్లో ఉన్నాయంటూ మిగిలిన పదింటిని మూసివేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న ఐదేండ్లలో 10 గనులు మూతపడతాయని సంస్థ చైర్మన్ ఎన్ బలరాం ఇది వరకే ప్రకటించారు.
27 ఏండ్లుగా వేల కోట్ల రూపాయల లాభాలతో కార్మికులు సంస్థను నడిపిస్తున్నప్పటికీ కొత్తబావులకు అనుమతి తేవడానికి ప్రభుత్వం ప్రయత్నించలేదు. నేడు సింగరేణికి కన్నతల్లి లాంటి ఇల్లందు, మణుగూరు, శ్రీరాంపూర్, కొత్తగూడెం, రామగుండం, మందమర్రి ఏరియాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణకు అనుమతించబోమని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా బొగ్గుగనుల వేలం వేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల బాటలోనే గనుల ప్రైవేటీకరణకు ఆదేశాలు ఇచ్చింది. ఇది సంస్థ మనుగడకు ఉరితాడు లాంటిది.
కాంగ్రెస్ రెండో గ్యారెంటీగా సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తామన్న హామీకి పూర్తి విరుద్ధంగా రాజకీయ జోక్యం మరింతగా పెరిగింది. రోజువారీ కంపెనీ నిర్వహణలోనూ మంత్రులు, ఆ పార్టీ నేతల జోక్యం పెరిగింది. సింగరేణి సంస్థను కార్మిక వర్గం కష్టపడి లాభాల బాటలో నడుపుతూ గత 27 ఏండ్ల నుంచి బోనస్ చెల్లిస్తున్నది.
గతంలో సింగరేణి బోనస్‌పై ముఖ్యమంత్రులు ప్రకటన మాత్రమే చేసేవారు. కానీ 2025 నవంబర్‌లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బోనస్ ప్రకటన కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈవెంట్‌లాగా ఏర్పాటు చేసింది. రాజకీయ జోక్యాన్ని లేకుండా చేస్తామన్న హామీ మరిచి చిన్న విషయాలలోనూ జోక్యం చేసుకునేలా సింగరేణిని రాజకీయ నిలయంగా మార్చుకున్నది.
హస్తం పార్టీ మూడో హామీగా సింగరేణి కాలనీల్లో ఆధునిక విద్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నది. దీనిపై ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ రెండేండ్ల కాలంలో పాఠశాలలు ఏర్పాటు చేయలేదు, ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. వసతి గృహాల భవనాలు లేకపోవడంతో పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొన్నది. ఆధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దడం అటుంచితే ఉన్న పాఠశాలలు మూతపడకుండా కాపాడలేని స్థితిలో రెండేండ్లుగా కాంగ్రెస్ పాలన నడుస్తున్నది.
నాలుగో హామీ అయిన కార్మిక సంక్షేమం, భద్రత, అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టిందేమీ లేకపోగా బొగ్గు గనుల్లో కనీస రక్షణ చర్యలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగాయి. మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి, గోదావరిఖనిలో ప్రమాదాలు పెర కార్మికుల మరణాలు ఇందుకు ఉదాహరణలు. సింగరేణి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల నిధులను తీసుకోవడమే తప్ప సింగరేణి ప్రాంతంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.
ఐదో గ్యారంటీగా కారుణ్య నియామకాలను సరళతరం చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. గతంలో గుండె, ఊపిరితిత్తులు, మోకాళ్ల నొప్పులు, పక్షవాతం, బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక జబ్బులతో విధులు నిర్వహించలేని కార్మికులు రెండేండ్ల సర్వీస్ వదులుకొని ఉద్యోగానికి రాజీనామా చేస్తే వారసులకు ఉద్యోగం ఇచ్చేవారు. ఈ రెండేండ్ల కాలంలో ఉద్యోగాలు ఇవ్వకపోగా దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారిని అన్‌ఫిట్ చేయకుండా వీధుల్లోకి నెట్టారు.
దీంతో రెండేండ్ల క్రితం 42 వేల మంది ఉద్యోగులు ఉండగా ఆ సంఖ్య 39 వేలకు తగ్గింది. ప్రభుత్వ ఉద్దేశం కార్మికుల సంఖ్యను కుదించడమే. మరో 5 వేల మంది కార్మికులను ఇంటికి పంపించే కుట్ర చేస్తున్నారు. కారుణ్య నియామకాలు అందని ద్రాక్షగా మార్చుతున్నారు. సింగరేణిని పరిశ్రమగా కాకుండా వ్యాపార సంస్థగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. సింగరేణికి కొత్త బావులు నిర్వహించుకోవడం కష్టమైన పనికాదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాటలు చెప్పడం మానుకుని, హామీల అమలు కోసం, సింగరేణి సంస్థ ద్వారానే బొగ్గు గనులను తీసేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలి.
వ్యాసకర్త: జీఎల్బీకేఎస్, ఐఎఫ్టీయూ జనరల్ సెక్రెటరీ
-జే సీతారామయ్య ,94907 00954