నీళ్లు, నిధులు, నియామకాల్లోనే కాకుండా ఇతర అంశాల్లో, శాఖల్లో ఏ సమస్య వచ్చినా, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, రాష్ట్రంలో అధికారంలో చెలాయించిన కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు కానీ అస్సలు పట్టించుకోలేదు. ఆ నాయకుల అన్యాయ పాలన, అక్రమాలు, తెలంగాణ ప్రజల మీద వ్యతిరేకత కొనసాగాయి. ఆంధ్రా నేతల పాలనలో అవినీతి రాజ్యమేలింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆపలేదు. హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం (అసందర్భపు పెండ్లి) చేసిన నెహ్రూ ఆ తర్వాత ఆరేండ్లు ప్రధాన మంత్రిగా ఉండి కూడా ఈ అన్యాయాలను పట్టించుకోలేదు. తర్వాత ఇందిరాగాంధీ హయాంలో తెలంగాణ నాయకులు ఫిర్యాదులు చేస్తే కుమార్ లలిత్, వశిష్ఠ భార్గవ కమిటీలు వేసి చేతులు దులుపుకొన్నారు.
1969లో ఏడాదిపాటు సుదీర్ఘంగా జరిగిన ఉద్యమం తర్వాత కూడా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణను పట్టించుకోలేదు. పైగా 1964లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో కాసు బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శాంతియుతంగా ఊరేగింపు చేస్తుండగా కాసు బ్రహ్మానందరెడ్డి పోలీసు కాల్పులు జరిపించి ప్యారడైజ్ రోడ్డు మీద రక్తపుటేరులు పారించారు. అంతకుముందు కూడా ఆంధ్ర, రాయలసీమ నుంచి నేరస్థులను రప్పించి రోడ్ల మీద పబ్లిక్‌గా వందల మంది అమాయకులను చంపించి, గుడిసెలు తగలబెట్టించి, ఆ నేరాలను ఉద్యమకారులకు ఆపాదించి వందల మంది తెలంగాణ యువతను జైళ్లల్లో బంధించారు.
ఇక తర్వాత రాజీవ్‌గాంధీ హయాంలో ఆరేండ్లు తెలంగాణ ప్రాంతం ఆంధ్రా పాలకుల ఏలుబడిలో మరింత నష్టాలు చవిచూసింది. దాదాపు 43 ఏండ్లు ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకుల నిర్లక్ష్యంతో రాష్ట్ర నాయకులు ఈ ప్రాంత ప్రజలకు నరకం చూపించారు. అందరు ప్రాంతేతర ముఖ్యమంత్రులు వివక్ష చూపినా, వారిలో నలుగురు మాత్రం క్రూరత్వంతో తెలంగాణ ప్రజలను హిం సించారు. తెలంగాణకు సంజీవరెడ్డి ప్రమాణం చేసిన రక్షణలు కల్పించకుండా, ప్రాజెక్టులు మూలన పడేసి, అన్యాయాలకు రాజమార్గం కల్పించారు.
కాసు బ్రహ్మానందరెడ్డి వందల మంది ఉద్యమకారులను, సామాన్య ప్రజలను కూడా చంపించారు. ఇక సెటిలర్ అయిన జలగం వెంగళరావు పాలనలో ఉద్యోగాలు పూర్తిగా ఆంధ్రులకు ధారాదత్తం చేసి, పోలీసు బలగాలతో నిరసనకారులను అణచివేశారు. పైగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేస్తే, హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా తగలబెట్టి వెళ్తానని శపథం చేశారు. ఇక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెలంగాణ జలవనరుల దోపిడీకి పాల్పడ్డారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి డబ్బు మూటలు పంపించి, చాలా విజయవంతంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డుకున్నారు.
తెలుగుదేశం నాయకుడు చంద్రబాబునాయుడు సొంత మామనే వెన్నుపోటు పొడిచి, అధికారం లాక్కున్న వ్యక్తి. ఇక తనకు పరాయివారైన తెలంగాణ ప్రజల మీద జాలి తలుస్తారా? అప్పుడే కాదు 30 ఏండ్ల తర్వాత ఇప్పటికి కూడా తెలంగాణకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకి. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ‘పకోడీలు బ్రహ్మాండంగా చేసేవాడికి అవి చెయ్యటమే వస్తుంది.
ప్రసాదం, పులిహోర చేయటం రాదు!’ అలాగే కుట్రపూరితంగా వెన్నుపోటుతో మామను వంచించి, ఎమ్మెల్యేలను కొని, కుటుంబాన్ని భయపెట్టి గద్దెనెక్కిన బాబు.. ఈరోజు వరకు అవే విధానాలు పాటిస్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత అవినీతి తప్ప చంద్రబాబు ఆలోచనలు ఇంకో విషయం మీద ఉండవు. కేవలం ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏండ్లు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేండ్లు, మొత్తం 14 ఏండ్లు మాత్రమే అధికారంలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు దేశంలోని రాజకీయ నాయకులందరిలో అత్యంత ధనవంతుడు ఎలా అయ్యారు?
30 ఏండ్లుగా పార్టీని ఎలా నిలుపు కొంటున్నారు? ఆలోచించాల్సిన విషయం కదా! చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ యువకులపై నక్సలైట్లు అనే ముద్రవేసి చంపించటం, తన వర్గంలోని ధనవంతులతో హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ దవాఖానలు తెరిపించి, ఇక్కడి ప్రజలను దోచుకున్నారు. చంద్రబాబు ఎక్కడ పరిపాలన చేస్తే అక్కడ ధనవంతులు కుబేరులుగా మారటం, బీదవారు కుచేలులుగా మారటం తెలంగాణలో చూశాం, ఇప్పుడు ఆంధ్రా ప్రజలు అనుభవిస్తున్నారు.
ఇక 1983 నుంచి 2014 వరకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేసిన అన్యాయాలను నేరాలు-ఘోరాలు శీర్షికతో ఏండ్ల తరబడి అచ్చువేయవచ్చు. తెలంగాణ నాయకులు కేంద్రానికి ఫిర్యాదులు చేసీ చేసీ అలసిపోయి, న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. కానీ బాబు గారు పెద్ద దార్శనికుడు కదా! అప్పటికే తెలంగాణ కోర్టులన్నీ కింది స్థాయి నుంచి, న్యాయమూర్తి స్థాయి వరకు ఆంధ్ర, రాయలసీమ వారితో నిండిపోయాయి. నిజానికి విలీన సమయంలో ఇక్కడి హైకోర్టును అలాగే ఉంచి, మిగతా రెండు ప్రాంతాలకు రెండు శాఖలను ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.
కానీ అతి తెలివి ఆంధ్రా నాయకులు తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు, వారితో కొట్లాడి గుంటూరులో హైకోర్ట్ శాఖను ఏర్పర్చుకున్నారు. కానీ ఇక్కడ అలా చేయకుండా గుంటూరు శాఖను కూడా మూసివేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల వారీ నియామకాలు ఎట్లా ఉన్నాయో గమనిస్తే, వారి అన్యాయ పాలన విజయవంతంగా ఎలా నడిచిందో తెలుస్తుంది. పై పట్టికను చూడండి.
న్యాయ వ్యవస్థలోనే ఇంత అక్రమ నియామకాలు జరిగితే, ఇంక మిగతా వ్యవస్థలు ఎలా ఉంటాయి? కొన్ని ఫిర్యాదులు విని ఎన్టీ రామారావు తన హయాంలో ఉద్యోగాల గురించిన సమాచారం సంగ్రహంగా కావాలని గిర్గ్లానీ అనే ఐఏఎస్ అధికారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. తెలంగాణ వారికి జరిగిన అన్యాయాలను ఆయన ఎంతో శ్రద్ధగా కష్టపడి బయటకు తీసి నివేదిక తయారు చేశారు. కానీ తెలంగాణ దురదృష్టం ఏమిటంటే, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే సరికి మామగారిని దించేసి అల్లుడు గారు ముఖ్యమంత్రి పీఠమెక్కారు! ఆ తర్వాత ఏం జరిగింది? ఎంతో సంగ్రహంగా ఉన్న నివేదిక చెత్తబుట్ట పాలయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర- రెండు ప్రాంతాలకు జరిగిన అన్యాయం ఏమిటంటే సంపన్న తెలంగాణ దోపిడీకి గురయింది. 1956 నుంచి 2014 వరకు ఎక్కువ కాలం వారే అధికారంలో ఉన్నప్పటికీ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అనాథల్లాగానే మిగిలాయి. అవినీతి ద్వారా దోచుకున్న సంపాదన ఆ రెండు ప్రాంతాల నాయకుల వ్యక్తిగత సంపద అయిపోయింది. కరువుసీమ రాయలసీమలో రెండెకరాలు మాత్రమే ఉన్న నాయకుడు కూడా రెండు వందల మంది శాసనసభ్యుల్ని శాసించగలిగిన సంపన్నుడయ్యారు.
1956 నుంచి తెలంగాణలో మితంగా, తాము విలాసవంత జీవితాన్ని గడిపే నాయకులుగా ఎదిగిన ఈ వలస పాలకులు తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడ్డాయని నివేదికలు పంపి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ నిధులు కూడా మెక్కారు. 1956 నుంచి 1991 వరకు రూ.21 కోట్ల మిగులు ఉంటే దానిని మార్చివేసి రూ.52 కోట్ల లోటుగా చూపించారు. రూ.120 కోట్ల సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో వెనుకబాటు ప్రాంతంగా మారితే, 1941లో ఆంధ్రుల సోదరులు తమిళులు సూచించిన పోలవరం ప్రాజెక్టు నేటికీ పూర్తి కానేలేదు. హైదరాబాద్‌ను తమ నాయకులే అభివృద్ధి చేశారని చెప్పుకొంటూ కొమ్ముకాసే ఆంధ్రా ప్రజలు కొందరు, ఆ నాయకులే తమ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? అనే విషయం ఆలోచించరు, నిలదీయరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి, తాము బాగుపడ్డారు వలస పాలకులు.
– కనకదుర్గ దంటు