Mahesh Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రూ.236 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో దర్శకుడిగా బుచ్చిబాబు మరోసారి తన సత్తా చాటారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు, తొలి చిత్రంతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ‘పెద్ది’తో మరో భారీ విజయాన్ని అందుకుని 200 కోట్ల మైలురాయిని చేరుకోవడం విశేషంగా మారింది.
ఈ విజయంతో ఇప్పుడు అందరి దృష్టి బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్ట్‌పై పడింది. ఆయన హ్యాట్రిక్ సినిమా ఏ హీరోతో ఉండబోతోందనే చర్చలు టాలీవుడ్లో జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో బుచ్చిబాబు సినిమా చేయబోతున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుచ్చిబాబును మహేష్ బాబుతో సినిమా గురించి ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తిని రేకెత్తించింది. “మహేష్ బాబుకి ఒక కథ చెప్పారని వింటున్నాం.. నిజమేనా?” అనే ప్రశ్నకు బుచ్చిబాబు నేరుగా సమాధానం ఇవ్వకుండా, “చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. సమయం వచ్చినప్పుడు చెబుతాను” అని అన్నారు.
ఈ సమాధానంతో మహేష్ బాబుతో ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయనే సంకేతాలు ఇచ్చినట్లుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ‘పెద్ది’ సినిమాలో అవయవం కట్ చేసే ఎమోషనల్ ఎలిమెంట్ గురించి ప్రస్తావిస్తూ, “ఆ కొత్త కథలో కూడా అలాంటి అంశం ఉంటుందా?” అని అడగ్గా, “అయ్యో.. అలాంటిదేమీ లేదు. కథలో అవసరం అయితే వస్తుంది” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మహేష్ బాబు చేయబోయే ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు చెప్పిన మాటలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.అలాగే మహేష్ బాబు, బుచ్చిబాబు మధ్య ఇప్పటికే మంచి పరిచయం ఉంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వ విభాగంలో పని చేశారు. ఆ సమయంలో మహేష్‌తో ఏర్పడిన పరిచయం ఇప్పటికీ కొనసాగుతోందని తెలుస్తోంది.