Weather Update | మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, నల్గొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ముందుకు విస్తరిస్తున్నాయి. దీనిప్రభావంతో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు తెలిపారు. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాత్రి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు పశ్చిమ-దక్షిణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
ఈనెల 10వతేదీ వరకు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది. నాలుగు రోజులు నగరంలో భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నది.