రాష్ట్రంలో వాతావరణం మారింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా డిసెంబరు నెలలో చలి వణికిస్తున్నది. అటవీ ప్రాంతాల్లోనే కాదు, నగరాల్లోనూ అదే పరిస్థితి. రాజకీయ వాతావరణమూ ఇదే తీరులో ఉంది. కాంగ్రెస్ పార్టీకైతే వెన్నులో వణుకు మొదలైంది. క్షేత్రస్థాయి ఫలితాలు ప్రతికూలంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. ఏ ఎన్నికలైనా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. పంచాయతీ ఎన్నికలైతే మరీనూ. ప్రభుత్వం ఏం చేసింది, ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉందన్నది అక్కడే తేటతెల్లమవుతుంది.
లబ్ధిదారులుగా మారామా, లేదా కేవలం ఓటర్లుగానే మిగిలిపోయామా? అన్నది ప్రజలు విస్పష్టంగా చెప్పేస్తారు. ఒక్క పార్టీపైనే కాదు, ప్రజాప్రతినిధులపైనా వ్యతిరేకత ఉనట్టు పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ఇంత మార్పా? కారణాలు అనూహ్యమైనవేమీ కావు. వేసిన మొదటి అడుగే తప్పుటడుగు కావడంతో హెచ్చరికలు వస్తునే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అమలు చేయలేకపోవడమే ఆ తొలి తప్పటడుగు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం పల్లెలే. మార్పు తీసుకొస్తామని హామీ ఇస్తే నమ్మి గ్రామీణులు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్తవి కూడా అమలు చేస్తారని బలంగా నమ్మారు. కానీ, వాస్తవంలో అంతా ఉల్టా పల్టా అయింది. దానికి ప్రతిఫలమే ఇది. నెరవేరిన ఉద్యమ ఆకాంక్షలకు నిదర్శనాలుగా బీఆర్ఎస్ పాలనలో పల్లెలు నిలిచాయి. ముఖ్యంగా సాగునీటి వసతితో పొలాలు పచ్చదనాన్ని పరచుకున్నాయి. సకాలంలో రైతుబంధు అంది పెట్టుబడులకు ఇబ్బందులు తొలగిపోయాయి. పండించిన పంటకు తగిన ధర లభించి రైతుల చేతిలో నాలుగు డబ్బులు ఉండేవి. అన్నింటికన్నా ముఖ్యంగా రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏమి చేసిందని అడిగితే.. ‘ఇదీ’ అని గట్టిగా చెప్పలేని స్థితి.
రైతుబంధు పెంపు మాట లేదు. కౌలు రైతులకు, కూలీలకు ఇస్తామన్న రూ.12 వేల సాయం ఏమైందో తెలియదు. పత్తి, వరి పంటలకు మద్దతు ధరలు, మార్కెటింగ్‌లో తిప్పలు ఎక్కువయ్యాయి. మంచి చేసిన వారిని వద్దనుకున్నామా అన్న అంతర్మథనం జనంలో కనిపిస్తున్నది. అందుకే మళ్లీ ‘మార్పు’ అవకాశం ఎప్పుడు వస్తుందా అని పల్లె ప్రజలు ఎదురుచూశారు. స్థానిక ఎన్నికలు రాగానే ఓటు ద్వారా తమ మార్క్ మార్పు చూపించారు.
సాధారణంగా ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ, ఈ సారి కాంగ్రెస్‌కు అలాంటి వాతావరణం ఏర్పడలేదు. ప్రభుత్వానికి ఇంకా మూడేండ్ల కాలపరిమితి ఉన్నా సర్కారు నుంచి ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి ఒక్కొక్క గ్రామం, తండా దూరం జరుగుతున్నవి. ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ఒక్కటే అన్న అభిప్రాయం క్రమేణా బలపడుతున్నది. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ మొదలుకొని గిరిజన మంత్రి సీతక్క ఇలాకాలోని ఆదివాసీ గూడేల వరకు ఒక్కటే ఫలితం. చాలా చోట్ల బీఆర్ఎస్ ఆధిక్యం సాధించగా, మరికొన్ని చోట్ల నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు వచ్చాయి.
పార్టీ పటిష్ఠంగా లేకున్నా, నాయకుల బలంతో అభ్యర్థులు గెలిచిన సంఘటనలు లెక్కలేనన్ని. కానీ, ఇప్పుడు ఆ వాతావరణం కనిపించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనే కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా నాయకులు ఈ విధంగా నష్టపోయారా? లేదా నాయకుల వల్లనే అధికార పార్టీకి నష్టం జరిగిందా? అన్నదానికి సమాధానం చెప్పలేం. కారణమెవరు? కారకులెవరు? అని తేల్చిచెప్పలేం. హామీలు అమలు చేయలేని ప్రభు త్వం, సమస్యలు పరిష్కరించలేని నాయకుల కారణంగా కాంగ్రెస్‌కు ప్రజానీకం క్రమేణా దూరమవుతున్నారన్నది వాస్తవం.
రెండేండ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందంటే.. జవాబు ఇవ్వలేని సంకటస్థితి కార్యకర్తలది. ఏమని చెప్పి ప్రచారం చేస్తారు? ప్రజల్ని ఎలా ఒప్పిస్తారు? ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలు గ్రామీణులకు ఏం మేలు చేస్తాయి? సదస్సులు, ఇంకేవో పెద్ద మాటలు చెప్తే ప్రజల దైనందిన జీవిత సమస్యలు తీరుతయా? పోనీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారా? అంటే అదీ లేదు. మరి ఏమి చూసి ఓట్లేస్తారు?
ఎప్పుడూ సమస్యలుగా భావించని అంశాలు కూడా పెద్ద సమస్యలుగా మారడం ఈ ప్రభుత్వం ప్రత్యేకత. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలు చెల్లించడంలో విఫలం కావడమే ఇందుకు ఉదాహరణ. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టడానికే సొమ్ము సరిపోవడం లేదని చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రజలు ఎంతకాలమని నమ్ముతారు? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతవరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ విద్యార్థులు గ్రామీణ ప్రజలు కారా? తమకు నష్టం జరిగిందన్న బాధ వారిలో ఉండదా?
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ సమఉజ్జీగా నిలిచింది. దీంతో బీఆర్ఎస్ పని అయిపోయిందని, కేసీఆర్ ప్రాభవం తగ్గిందన్న విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దాలంటే మరో ఉద్యమం అవసరమని ఈ ఎన్నికలు తెలియజెప్పాయి. మళ్లీ కదన రంగంలోకి దూకాలంటూ కేసీఆర్‌కు పిలుపునిచ్చాయి ఈ ఎన్నికల ఫలితాలు. ప్రజల తీర్పును పార్టీలు శిరసావహించాల్సిందే. అందుకే కాంగ్రెస్‌కు పట్టంగడుతూ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన జనాదేశాన్ని కేసీఆర్ అంగీకరించారు. ప్రభుత్వాన్ని నడపడంలో ఉన్న ఇబ్బందులు తెలుసు కాబట్టే, వారే చక్కదిద్దుకుంటారులే అన్న ఉద్దేశంతో ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. రెండు సంవత్సరాలు గడిచినా సహనం వహించి, మౌనం పాటించారు. విమర్శలు చేసే ముందు కొత్త ప్రభుత్వానికి ఒక సంవత్సరమైనా గడువు ఇవ్వాలన్న సంప్రదాయాన్ని అనుసరించారు. ఇక ఆ అవసరం లేదని పంచాయతీ ఎన్నికలు సందేశమిచ్చాయి. గాడితప్పిన తెలంగాణ బండిని తిరిగి దారిలో పెట్టడం కోసం ఆయన మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఏర్పడింది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
-గోసుల శ్రీనివాస్ యాదవ్ ,98498 16817