కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార. దేశంలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా లోపాలు తలెత్తడం సహజం. వాటిని సరిదిద్దుతూ ముందుకువెళ్లాలి. తద్వారా సాగు, తాగునీటి ఫలాలు అందుతాయి. ప్రపంచంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఇలాగే జరుగుతున్నది. ప్రాజెక్టులు ప్రారంభించిన పదేండ్లలోపు మరమ్మతులకు గురవడం సాధారణ విషయం. చిన్న సర్దుబాట్ల నుంచి గణనీయమైన మరమ్మతులు రావడం సహజమే. నేల కోత, నిర్మాణ, కాలక్రమేణా తలెత్తే సమస్యల కారణంగా ఈ మరమ్మతులు అవసరమవుతాయి.
తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు తప్ప మరో మార్గం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో ఒక పియర్ (పిల్లర్) కుంగిన విషయాన్ని నాటి ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు అప్పటి ప్రతిపక్షాలు వాడుకున్నాయి. ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేయాలి. కానీ, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తూ ప్రజల ప్రయోజనాలతో ఆటలాడుతున్నది.
మేడిగడ్డ పిల్లర్ కుంగింది. కానీ సుందిళ్ల, అన్నారం, బాగానే ఉన్నాయి కదా, వాటిని నింపి రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని సాగునీటిరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ లోపాన్ని కారణంగా చూపెట్టి నీటిని ఎత్తిపోయకుండా 18 నెలలుగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ ఏడాది ఎండాకాలంలో తాగు, సాగునీటి కష్టాలు తలెత్తాయి. చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిల్లర్ కుంగుబాటుకు సరైన కారణాలు తెలుసుకోకుండానే మధ్యంతర నివేదిక ఇచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పూర్తి నివేదిక ఇవ్వడానికి తీవ్ర కాలయాపన చేసింది. ఇటీవల ఎన్డీఎస్ఏ నివేదికలోనూ ఎక్కడా బ్యారేజీలు పనికిరావని లేదు. కానీ, ప్రభుత్వమే అలా ప్రచారం చేస్తున్నదనే ఆరోపణలు వినవస్తున్నాయి. కాళేశ్వరంపై ఎన్నికల వేళ ఒక వర్గం చేసిన విష ప్రచారాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నది.
కాళేశ్వరం విషయంలో ఒక రకంగా, ఇతర ప్రాజెక్టుల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తూ జాతీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయనే విమర్శ ఉన్నది. ఎందుకంటే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగినప్పుడు, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని చూస్తే ఇది స్పష్టమవుతుంది. మేడిగడ్డ నిర్మాణం లోపభూయిష్టమని, డిజైన్లు సరిగ్గా లేవని, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కూడా కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ, సుంకిశాల రిటైనింగ్ వాల్ ప్రమాదాలపై ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించడం లేదని పౌర సమాజం ప్రశ్నిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయాలను కమిషన్ కోరినప్పుడు.. ఎన్డీఎస్ఏ నివేదిక త్వరగా వచ్చేలా, ఈ లోగా దెబ్బతిన్న పియర్కు మరమ్మతులు చేసి, రైతులకు సాగు నీరు ఇవ్వాలని తెలంగాణ వికాస సమితితోపాటు మరికొంత మంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విన్నవించారు. ఆ అభ్యర్థనలను పరిశీలించినట్టే కనిపించడం లేదు.
2020-2023 వరకు ప్రతి యాసంగి సీజన్లో లోయర్ మానేరు డ్యాం దిగువన ఉన్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు స్టేజీ-1, స్టేజీ- 2 ఆయకట్టు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి భరోసానిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు కాకతీయ కాలువ నిండుకుండలా కనిపించడం రైతుల అనుభవంలో ఉన్నది. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు మీదుగా కాళేశ్వరం నీళ్లు లోయర్ మానేరును దాటుకొని వందలాది కిలోమీటర్లు పరుగులు పెట్టాయి.
దాని ఫలితంగానే వరి ఉత్పత్తిలో గత రికార్డులను తెలంగాణ అధిగమించింది. కానీ, కాళేశ్వరంపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ సర్కార్ ఆ ప్రాజెక్టుతో పని లేకుండానే ఎస్సారెస్పీ స్టేజీ- 1, స్టేజీ- 2 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇస్తామని చెప్పి పంటలు చేతికొచ్చే ముందు చేతులెత్తేసింది. ప్రభుత్వమే ప్రజల పక్షాన చొరవ తీసుకొని సత్వరమే మరమ్మతులు పూర్తిచేసి రాబోయే సీజన్లోనైనా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలి.
ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం భూ సాంకేతిక, భూ భౌతిక పరిశోధనలు చేసేందుకు కనీసం రెండేండ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత నివేదిక రూపొందించేందుకు ఆరు నెలలు, అనంతరం మరమ్మతులు చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. ఈ లెక్కన రాబోయే మూడేండ్ల పాటు కాళేశ్వరం నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. పరిశోధనలు, నివేదిక, మరమ్మతులకు ఎంత సమయం పడుతుందనే విషయమై ప్రభుత్వానికి ఒక అంచనా ఉన్నదా? ఉద్దేశపూర్వకంగానే మూడేండ్ల పాటు తెలంగాణను ఎండబెట్టాలని సర్కారు నిర్ణయించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఆరున్నర దశాబ్దాల పాటు గోదావరి జలాలను సముద్రంపాలు, ఆంధ్రాపాలు చేసినట్టుగానే.. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం గోదావరి నీటిని వారికే మలపదలుచుకున్నట్టు కనిపిస్తున్నది. కాళేశ్వ రంలోని మూడు బ్యారేజీల నిర్మాణ పనులు 2016లో ప్రారంభమై 2019లో పూర్తయ్యా యి. అంటే బ్యారేజీల నిర్మాణానికి పట్టిన కాలం మూడేండ్లు. కానీ, మూడు పిల్లర్లను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఐదేండ్ల సమయం తీసుకుంటుండటం హాస్యాస్పదం.
-తెలంగాణ వికాస సమితి డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్