కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనుకున్న తెలంగాణ ఆగమాగమైపోయింది. అబద్ధపు ప్రచారాలతో గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. ఎరువులు అందుబాటులో లేవు, విత్తనాల కోసం రైతులు క్యూల్లో నిలబడుతున్నారు. పంటకు మద్దతు ధర ఇస్తామని చెప్పి, మార్కెట్ యార్డుల్లో దోపిడీ కొనసాగుతున్నది. రుణమాఫీ చేస్తామని చెప్పి, చివరికి రైతు మెడ మీద అప్పు మోపుతున్నారు. రైతు కన్నీళ్లలో తెలంగాణ భవిష్యత్తు కొట్టుకుపోతున్నది.
యువతకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు కూడా మోసమే. ఇంటికో ఉద్యోగం, ప్రతి యువకుడికి ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాటతప్పింది. నోటిఫికేషన్లు రావడం లేదు. వచ్చినా వాయిదాలు పడుతున్నాయి. పరీక్షల నిర్వహణలో అవినీతి వేళ్లూనుకుపోయింది. పేపర్ లీకుల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో యువత నిరాశలో మునిగిపోయింది. అందుకే నేడు నిరసనలతో తెలంగాణ హోరెత్తుతున్నది. కానీ, ఇవన్నీ కాంగ్రెస్ చెవికెక్కడం లేదు. యువత భవిష్యత్తుతో ఆటలాడటం కాంగ్రెస్కు అలవాటుగా మారిపోయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ కూడా మోసమే. ఎన్నికల సమయంలో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు డ్రామాలు చేస్తున్నది. బీసీలను నమ్మించి గొంతుకోస్తున్న ఈ వైనం క్షమించలేని పాపం.
ప్రజల నిత్యజీవనం కూడా ఇబ్బందులమయం అయిపోయింది. కరెంట్ సమస్యలు మళ్లీ మొదలయ్యాయి. తాగునీటి కోసం గ్రామాలు అల్లాడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో సాధారణ జీవితం నరకమైపోతున్నది. కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రజల బాధలు రోజురోజుకూ పెరుగుతున్నా, కాంగ్రెస్ పాలన మాత్రం నిర్లక్ష్యం, అబద్ధపు మాటలతోనే నడుస్తున్నది.రాష్ట్ర నాయకత్వం దిశారహితంగా మారిపోయింది. ప్రజలకు మార్గం చూపాల్సిన కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పోట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు.
తెలంగాణను ఎటు తీసుకెళ్లాలి? ఏ దారిలో నడపాలి? అన్న విషయమై కాంగ్రెస్కు స్పష్టత లేదు. దాంతో తెలంగాణ విఫల రాష్ట్రంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ మోసపు తాటికొయ్య. మాటలతో మాయ చేసి ఆ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఆ మాయ బహిర్గతమైంది. రైతులు, యువత, బీసీలు, సామాన్యులు అందరూ ఏకమై నేడు తెలంగాణ ఆగమైపోయిందని గొంతెత్తి నినదిస్తున్నారు. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలకు తెలంగాణ బలైపోయిందని ఘోషిస్తున్నారు. ప్రజల ఆశలు తీర్చని పాలన, రైతు-యువత సమస్యలపై పాలకుల నిర్లక్ష్యం, హామీలు అమలు చేయకుండా తప్పించుకోవడం లాంటివన్ని కాంగ్రెస్ వైఫల్యాన్ని సూచిస్తున్నదని చెప్పక తప్పదు. అందుకే కేసీఆర్ మళ్లీ రావాలంటూ తెలంగాణ నినదిస్తున్నది.
– సల్వాజి మాధవరావ్ 90525 63147