కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు స్వయం ప్రకాశితాలు కాదు. వారికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏ విధంగా పోరాడగలుగుతారు? రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనుకున్నా అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ తప్పదు. రాష్ట్ర పార్టీపై పెత్తనమంతా ఢిల్లీ బాసులకే. వారు చెప్పినదానికల్లా తోక ఊపాల్సిందే. ఎంత పెద్ద తోపు అయినా ఢిల్లీకి జీ హుజూర్ అనక తప్పని పరిస్థితి.
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్‌రావు థాక్రే చర్చించారు. వారితో తన భేటీ అధికారికం కాదని ఆ మరుసటి రోజే ఆయన స్పష్టం చేశారు. పొత్తుల గురించి కానీ పార్టీ విలీనం (షర్మిల పార్టీ) గురించి కానీ తన పరిధిలో లేదు, అది తమ అధిష్ఠానం పరిధిలోని అంశమని ఆయన వివరించారు. కాంగ్రెస్ అధిష్ఠానం తరఫున రాష్ర్టానికి ఇంచార్జి అయినప్పటికీ నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉండదన్న దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటింది. అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఇంతవరకు ప్రతిపక్ష నాయకుడిని ఎంపి క చేసుకోలేక పోయింది. ‘మీ పక్షం నాయకుడు ఎవ రో ఖరారు చేసుకోలేని మీరా మాకు చెప్పేది’ అని పాలకపక్షం నిష్ఠూరంగా మాట్లాడుతున్నా సమాధానం చెప్పలేని నిస్సహాయస్థితి కర్ణాటక బీజేపీది. ఇలాంటి ఏ కీలక నిర్ణయమైనా తీసుకునేది ఢిల్లీలో పార్టీ అధినాయకత్వమే.
కొంపల్లిలో జరిగిన బీఆర్ఎస్ పదహారవ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ప్రకటించారు. ఆ వెంటనే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేశా రు. కరీంనగర్ జిల్లాలో 2021, ఆగస్టు 16న దళితబంధు పథకం ప్రకటించారు. ఆ వెంటనే అమలుకు శ్రీకారం చుట్టారు. తాజాగా శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు రోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం ప్రకటించారు. అదే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ విధంగా కొత్త పథకాలను ప్రకటించాలన్నా, అమలు చేయాలన్నా అది ఒక్క బీఆర్ఎస్కు మాత్ర మే సాధ్యం. అదే కాంగ్రెస్సో, బీజేపీయో రాష్ట్రంలో అధికారంలో ఉండి ఉంటే ఇది సాధ్యపడేదా?. ఆ పార్టీల అధిష్ఠానాలు అంగీకరిస్తే తప్ప సాధ్యపడదు. అలాగే అమలు చేయడం వల్ల ఇతర రాష్ర్టాలలో ఎదురయ్యే ఆర్థిక స్థితి సహకరిస్తుందా? లేదా అన్నది చూసుకోవాలి. ఒక రాష్ట్రంలో తీసుకునే నిర్ణయం, ఆ పార్టీ పాలిత రాష్ర్టాలలో సాధ్యాసాధ్యాలపై బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదరాబాదరగా అమలు చేసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి అదే నిజమైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాలలో ఎక్కడైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందా?
కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర కమిటీలు పేరుకే గానీ వారి రిమోట్ కంట్రోల్ ఢిల్లీ చేతిలోనే. ఢిల్లీ పెద్దల ఆదేశాలను తు.చ. తప్పక ఆచరిస్తూ జీ హుజూర్ అనకతప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఢిల్లీకి జీ హుజూర్ అనాల్సిన దుస్థితి నుంచి బయటపడ్డాం. దాదాపు పదేండ్లుగా బీఆర్ఎస్ స్వీయ పాలనలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర నాయకత్వాలు తెలంగాణ రాష్ర్టాన్ని తిరిగి ఢిల్లీ బాదుషాలకు పాదాక్రాంతం చేయడానికి తహతహలాడుతూ పోటీపడుతున్నాయి. ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న నాయకుడు ఆత్మగౌరవాన్ని కూడా లెక్కచేయకుండా చెప్పులు మోసిన వైనం తెలిసిందే.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజం తట్టి మెచ్చుకున్నారు. బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి బం డి సంజయ్ ఒక్కరు చాలని పార్టీ అగ్రనేత అమిత్ షా కితాబిచ్చారు. కానీ రెండు నెలల తిరక్కుండానే బండి సంజయ్‌ని తప్పించి పార్టీ పగ్గాలు కిషన్‌రెడ్డికి అప్పగించారు. పార్టీ కోసం ఇక్కడ చొక్కా చించుకొని పనిచేస్తే సరిపోదు. ఢిల్లీ పెద్దలు తమ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారనడానికి బండి సంజయ్ ఉదంతమే నిదర్శనం. పార్టీలో కొత్త గా చేరిన ఈటల రాజేందర్ అండ్ కో డిమాండ్ మేర కే బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నది బహిరంగ రహస్యమే. ఎన్టీయే-1 హయాంలోనూ ఇదేవిధంగా బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి అవమానకరంగా తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి సీఎంగా పని చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని తెలంగాణ బీజేపీ నేతలు అంతర్గతంగా వ్యతిరేకించినప్పటికీ బీజేపీ అధినాయకత్వం ఖాతరు చేయలేదు. అంతెందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పై ప్రధాని మోదీ, ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా ‘బిడ్డను చంపి తల్లిని బతికించారు’ అంటూ విషం కక్కినా బీజేపీ రాష్ట్ర నాయకులు నోరు మెదపకుండా తాము ఢిల్లీకి గులాంలమని చె ప్పకనే చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర కమి టీ కాకినాడలో ‘ఒక్క ఓటుకు రెండు రాష్ర్టాలు’ అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తీర్మా నం చేసింది. కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ర్టాలను ఏర్పాటు చేసి, తెలంగాణను విస్మరించినా ఢిల్లీ అధినాయకత్వాన్ని ప్రశ్నించలేని కట్టుబానిసలమని తెలంగాణ నాయకులు నిరూపించుకున్నారు.
టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డిని పార్టీ అధిష్ఠా నం నియమించినప్పుడు ఆ పార్టీ సీనియర్లంతా వ్యతిరేకించారు. తమను కాదని టీడీపీ నుంచి అరు వుకు తెచ్చుకున్న వ్యక్తికి పార్టీ పగ్గాలను ఎలా అప్పగిస్తారా? అని ఇక్కడి నేతలు అరిచి గీపెట్టినా అధిష్ఠానం ఖాతరు చేయలేదు. అలాగని రేవంత్‌రెడ్డి ఏమైనా పార్టీకి సర్వాధికారా అంటే అదీ లేదు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికను రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. టీపీసీసీ అధ్యక్షునిగా తాను ఉన్నంతవరకు షర్మిలను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని రేవంత్‌రెడ్డి బాహాటంగానే తేల్చిచెప్పారు. కానీ తీరా జరిగిందేమిటి? కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ద్వారా షర్మిల రాయబారం నెరిపి కాంగ్రెస్ అధిష్ఠానంతో నేరుగా మంతనాలు సాగించింది. రేవంత్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే పార్టీలో షర్మిల చేరిక దాదాపు ఖరారు చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌లో రాష్ట్ర అధ్యక్షుని మాటకు ఏ పాటి విలువ ఉంటుందో ఈ ఉదంతం ఒక్కటి చాలదా?
-వెల్జాల చంద్రశేఖర్
98499 98092