ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందనే గోబెల్స్ సిద్ధాంతాన్ని తెలంగాణలో అధికార కాంగ్రెస్ తూచా తప్పకుండా పాటిస్తున్నది. పదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నాటి నుంచి నేటి వరకు అదే సిద్ధాంతాన్ని నమ్ముకుని పబ్బం గడుపుకుంటున్నది. కానీ ఆ సిద్ధాంతం ఎల్లకాలం పనిచేయదు. అబద్ధాలు వారిని ఎంతోకాలం కాపాడవు. అయినా కానీ అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డర్ లాగా అదేపనిగా పాత సూత్రాన్ని నమ్ముకున్నది. నిండా మునగనున్నది.
బీఆర్ఎస్ హయాంలో ప్రతి విషయంలోనూ కాంగ్రెస్, బీజేపీ ఫేక్ ప్రచారాలను నమ్ముకుని ప్రభుత్వంపై బురదజల్లుతూ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో బీఆర్ఎస్పై గోబెల్స్‌ను మించిన అసత్య ప్రచారాలను పదే పదే వల్లె వేయడంతో అదే నిజమని జనం, యువత నమ్మడం ప్రారంభించారు. తీరా వాటిని బీఆర్ఎస్ తిప్పికొట్టే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది. ఇందుకు రైతు రుణమాఫీనే తొలి వేదిక అయింది. హరీశ్‌రావు సవాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని దేవుళ్లపై ఒట్లు వేసి ఆగస్టు 15, 2024 లోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని ప్రమాణాలు చేసి తీరా మాట తప్పారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు దారాదత్తం చేస్తూ నిర్ణయాలు జరగటం, దాన్ని బహిరంగ సభలో కేసీఆర్ నిలదీయటంతో ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
రైతు రుణమాఫీ ఎగవేత, 6 గ్యారెంటీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోవడం, రాష్ట్ర రాజధానిలో హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చడం, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు రావడం, యూరియా కొరత, వరద బాధితులకు సాయపడడంలో ఇబ్బందులు.. ఇలా పాలన అనుభవం లేని రేవంత్‌రెడ్డి వల్ల ఇన్ని సమస్యలు తెలంగాణను చుట్టుముట్టాయి. పాలకుల తప్పులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ నిద్రలేకుండా చేస్తున్నందున కక్ష సాధింపులో భాగంగానే బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు పిలిపించారు. హరీశ్‌రావు, కేటీఆర్‌పై అక్రమ కేసుల పేరిట వేధిస్తున్నరు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు పేరుతో విచారణలకు పిలిచి రాక్షసానందం పొందుతున్నారు.
సింగరేణి (నైనీ) టెండర్ల విషయంలో సీఎం, పలువురు మంత్రుల మధ్య వివాదం చెలరేగింది. తన బావమరిదికి టెండర్లు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని, టెండర్లు తమకే కావాలని కొందరు అమాత్యులు పట్టుబట్టడంతో వారి మధ్య వివాదం ముదిరి చినికి చినికి గాలివాన అయ్యింది. టెండర్లలో తీవ్రమైన అవినీతి జరిగిందని హరీశ్‌రావు ఆధారాలు సహా బయటపెట్టడంతో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి బురదలో కూరుకుపోవడంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు, కేటీఆర్‌కు రెండు రోజుల వ్యవధిలోనే నోటీసులు పంపి విచారించింది. ఈ దుందుడుకు చర్యతో ప్రభుత్వం ఏ స్థాయిలో డైవర్షన్ రాజకీయాలను నమ్ముకున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్తిదే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తమ అవినీతి మరకలను తుడుచుకునేందుకు హరీశ్‌రావు, కేటీఆర్‌ను విచారణ పేరిట వేధింపులకు గురిచేసి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. హరీశ్‌రావు, కేటీఆర్‌ల గొంతు నొక్కాలని రేవంత్ సర్కార్ ఎన్ని రకాలుగా కేసులు పెట్టి వేధించినా.. వారు మాత్రం తగ్గేదేలే అంటూ కాంగ్రెస్ అవినీతిని, అసమర్ధ పాలనను ఆధారాలతో ప్రజల ముందు ఎండగడుతూనే ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రతిపక్షాలను వేధించడం తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడం గాని, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించడం గాని చేసిన పాపాన పోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన కొన్ని మీడియా సంస్థలను, నిరుద్యోగులను, యువతను కూడా కాంగ్రెస్ సర్కార్ వేధిస్తున్నది. పోలీస్ కేసులు పెడుతూ నిర్బంధాలకు గురిచేస్తున్నది.
బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తీవ్రస్థాయిలో వ్యక్తిగత జీవితాలపై బురద జల్లడం పనిగా పెట్టుకున్నది. లీకుల పేరిట వారి అనుకూల మీడియాలో కల్పిత కథనాలు వండి వార్చుతున్నది. ఏపీ సీఎం చంద్రబాబుకు బాకాలు ఊదే కొన్ని ఆస్థాన మీడియా సంస్థలు పనిగట్టుకుని బీఆర్ఎస్ నాయకత్వంపై కల్పిత కథనాలను నిస్సిగ్గుగా రాస్తున్నాయి. తెల్లవారితే నీతులు చెప్పే ఓ మీడియా అధినేత విలువలు మరిచి బాబు, రేవంత్‌కు బానిసగా మారి కేసీఆర్‌పై, తెలంగాణపై ఇటీవల తన ద్వేషాన్నంతా వెళ్లగక్కారు.
కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధ్ధే పరమావధిగా, రాజకీయ కక్షలకు తావులేకుండా ముందుకు సాగారు. కానీ నేడు ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతిలో మునిగిపోవడమే కాకుండా, తెలంగాణ పేరును దేశవ్యాప్తంగా మసకబార్చుతున్నారు. బీఆర్ఎస్లో ఉద్యమ పోరాట స్ఫూర్తి ఆరిపోని జ్వాలలా ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. ఆ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణకు ఇసుమంత ఆపద వచ్చినా, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగినా కేసీఆర్, గులాబీ సైనికులు చూస్తూ ఊరుకుంటారని అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ నేతల మూర్ఖత్వం, అజ్ఞానమే అవుతుంది. జై తెలంగాణ
-తెలంగాణ విజయ్ ,94919 98702