Congress-BJP | దేశంలో కాంగ్రెస్, బీజేపీ బద్ధశత్రువుల్లా కనిపిస్తాయి. కానీ, రాష్ట్రం లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ వాలకమే అందుకు కారణం. ప్రధాని మోదీని ఆయన ఆకాశానికెత్తేశారు. ‘బడే భాయ్’ అని అభివర్ణించారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు, ఇండియా కూటమి అనే అతుకుల బొంతను కుట్టేందుకు కాంగ్రెస్ నానా తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలో మోదీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని రేవంత్ కోరడంలో ఆంతర్యం ఏమిటి? అంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ దేశంలో పతా లేకుండా పోయి బీజేపీ మళ్లీ గెలవాలని, మోదీ మళ్లీ ప్రధాని కావాలనేది ఆయన ఆకాంక్షగా మనం అర్థం చేసుకోవాల్నా? మరి పాపం రాహుల్‌గాంధీ ఏమైపోవాలి?
కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధించాలనుకునే నరేంద్ర మోదీని ఆకాశానికెత్తడం రేవంత్‌కు, ఆయన పార్టీకి ఎలా లాభిస్తుందో తెలియదు. లేక రేవంత్ తన ప్రస్తుత పార్టీ ప్రయోజనాలకతీతంగా మోదీతో స్నేహాన్ని కోరుకుంటున్నారా? ఆయన మరో ఏక్నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ అవుతారని విపక్షాలు విమర్శించడం మనం చూస్తున్నాం. రేవంత్ తీరుతెన్నులను గమనించేవారికి ఇందులో ఏదీ అసాధ్యమని అనిపించదు. మోదీ దోస్తు అదానీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే రేవంత్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెడితే తప్పేమిటని దబాయిస్తున్నారు. ఇక మోదీ, షా పెట్టుబడులతో వస్తే ఆహ్వానిస్తామని అనడం రేవంత్‌కే చెల్లింది. కాం గ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ పొడ గిట్టదు. పొద్దున లేస్తే కారు పార్టీపై నోరు పారేసుకోందే మనసుకు పట్టదు. ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు అభిమానం ఎక్కువ. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల శాతంలో తేడా రెండు శాతమే ఉండటం ఇందుకు నిదర్శనం. ప్రజల హృదయాల నుంచి బీఆర్ఎస్ను తుడిచేయాలన్న అక్కసుతో రెండు ఢిల్లీ పార్టీలు చీకటి ఒప్పందం ఏదైనా చేసుకున్నాయా? అనే సందేహాలు తలెత్తడం సహజం.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నోరంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ మాడల్‌కు ఓ బ్రాండ్ వ్యాల్యూ వచ్చింది. ఈ మాడల్‌ను అధ్యయనం చేసేందుకు కేంద్రంతో పాటు పలు రాష్ర్టాలు, ఇతర దేశాలు సైతం బృందాలను పంపించడం తెలిసిందే. తెలంగాణతో పోలిస్తే ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఓ విఫల మాడల్ అని రాజకీయ విశ్లేషకులు తేల్చారు. కానీ, గుజరాత్ మాడల్‌ను అనుసరిస్తామని సీఎం రేవంత్ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు వేసిన ధూపమని అనుకోవాలా? తర్వాత కూడా ఈ ధోరణిని రేవంత్ సమర్థించుకోవడం హాస్యాస్పదం. గుజరాత్ తరహాలో తెలంగాణకూ భారీ ప్రాజెక్టులు మంజూరు చేయమని కోరినట్టు చెప్పడం మరీ విడ్డూరం. ప్రధాని మోదీకి తెలంగాణ మీదున్న ప్రేమ ఏపాటిదో తెలియంది కాదు. అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మీదే ఆయన ఎన్నో సందర్భాల్లో విషం చిమ్మారు. అలాంటి వ్యక్తి నుంచి తెలంగాణకు వరాలు సాధిస్తానని అనుకోవడం అత్యాశే.