CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా విలువలతో కూడిన రాజకీయాల గురించి చక్కగా ప్రసంగించారు. అక్కడికే పరిమితం కాకుండా ఎంతోకొంత అమలుకు సైతం ప్రయత్నిస్తే అభినందనీయం. కానీ అలాంటి ప్రయత్నం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఒక రోజు రెండు సమావేశాలు ఉంటే ఒక సమావేశంలో రాజకీయాల్లో విలువల ఆవశ్యకత గురించి మాట్లాడి, మరో సమావేశంలో లాగుల్లో తొండలు విడుస్తామని ప్రత్యర్థి పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడితే ఇక విలువలు ఏం పాటిస్తున్నట్టు?
రాజకీయాల్లో సిద్ధాంతపరమైన భావజాలం కనిపించడం లేదని, పదవుల కోసమే పార్టీలు మారుతున్నారని మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చెప్పినట్టు రాజకీయాల్లో విలువలు లేని మాట వాస్తవం. పదవుల కోసమే పార్టీలు మారుతున్నారని ఆయన చెప్పింది అక్షర సత్యం. కానీ, ఒక వైపు తామే ఆ తప్పుడు పనులు చేస్తూ విలువలు లేవని ఆవేదన చెందడమే అసలు రాజకీయం. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక ప్రజాప్రతినిధులను చేర్చుకోవడంలో కొత్త రికార్డులు సృష్టించారు. అనేక రాష్ర్టాల్లో రాత్రికి రాత్రే పార్టీలను చీల్చి తమ పార్టీని అధికారంలో కూర్చోబెట్టారు. ప్రభుత్వం, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా పనిచేయాలనే ఉద్దేశంతో పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని నియమిస్తారు. ప్రభుత్వాలను మార్చేసిన నరేంద్రమోదీ లాంటి వారు సైతం పీఏసీ చైర్మన్‌గా తమ వారిని నియమించే సాహసం చేయలేకపోయారు. కానీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ శాసనసభ్యుడు గాంధీని తమ పార్టీలో చేర్చుకుని పీఏసీ చైర్మన్‌ను చేసింది. అధిష్ఠానం వద్ద దీనిని తమ విజయంగా చూపించుకున్నారు.
1995లో ఎన్టీఆర్‌ను దించి చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తరువాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎంగా అదే తొలి అధికారిక కార్యక్రమం. అక్కడ చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు పడి పోతున్నాయని, విలువలతో కూడిన రాజకీయాల కోసం పని చేయాలని సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. నమ్మిన ఎన్టీఆర్‌కు పొడిచిన పోటు ఇంకా పచ్చిగా ఉండగానే బాబు మాత్రం నిర్మొహమాటంగా రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడారు.
సరిగ్గా రేవంత్‌రెడ్డి కూడా అదే విధంగా రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరో రాసి ఇచ్చిన ఉపన్యాసాలు కాకుండా సొంతంగా మాట్లాడేవారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ నుంచి అబద్ధాలు కోరుకుంటున్నారని, రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడన్నట్టు తాము అబద్ధాలు మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. సీఎం కాబట్టి ఇప్పుడు అధికారులు రాసిచ్చే ఉపన్యాసాల ప్రభావం వల్ల రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుతున్నారు. విలువల గురించి మాట్లాడాలన్న ఉబలాటం మంచిదే కానీ, అదే సమయంలో ఎంతో కొంత విలువలు పాటించడం కూడా అవసరం. ఒక వైపు విలువలకు తిలోదకాలు ఇస్తూ మరో వైపు విలువలు పడిపోతున్నాయని ఆవేదన చూపించడం వల్ల ఏం ప్రయోజనం?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని రేవంత్ అప్పట్లో ఆవేదన వ్యక్తంచేశారు. కానీ, ఇప్పుడు సూర్యాపేట నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పాల్వాయి రజనీకుమారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా నియమించారు. 2004 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అంతకు ముందు ఆమె సూర్యాపేట మున్సిపల్ కమిషనర్. అప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పినా వెళ్లకుండా ఓడిపోయినా ఆమె టీడీపీలో చురుగ్గా పనిచేశారు. రేవంత్‌రెడ్డి దాదాపు అదే సమయంలో టీడీపీలోకి వచ్చారు. సీఎం కాగానే ఆమెకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అవకాశం కల్పించారు. అప్పుడేమో సర్వీస్ కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. ఇప్పుడు ఆయన అదే పనిచేస్తున్నారు.
రాజకీయాల్లో అమ్మడం, కొనడం, అమ్ముడు పోవడం సర్వ సాధారణం కానీ, ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి నగదుతో వెళ్లి పట్టుబడిన ఘనత దేశంలో మొదటిసారి రేవంత్‌కే దక్కింది. పార్టీ మార్పిడి నిరోధక చట్టం ఉన్నా శాసన సభ్యులు యథేచ్ఛగా పార్టీలు మారుతున్నారు. అలా మారిన వారికి పదవులు వస్తున్నా, తాము పార్టీ మారినట్టు చెప్తున్నా ఏమీ కానప్పుడు ఖర్చు గురించి మాట జారితే ఏమవుతుంది.
మనిషి తాను ఏదైతే కాదో అది చెప్పడానికి ప్రయత్నిస్తాడని అంటాడు ఓషో. విలువలు ఏమాత్రం లేని, పాటించని రాజకీయ వ్యాపారంలో రాజకీయ నాయకులు విలువల గురించి ఎక్కువగా మాట్లాడుతారు. బిల్వమంగళుడిని నిండా ముంచేసిన తరువాత చింతామణి సుభాషితాలు చెప్పినట్టు విలువలకు తిలోదకాలు ఇచ్చి కేవలం ఉపన్యాసాల్లో మాత్రమే విలువలు మిగిలితే ఏం ప్రయోజనం!
– బుద్దా మురళి