ముందస్తు హెచ్చరిక (డిస్‌క్లెయిమర్): ఈ వ్యాసం గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిల సంయుక్త దర్శకత్వంలోని కుటిల నాటకం గురించే తప్ప, ప్రొఫెసర్ కోదండరాం గురించి కాదు.
నేను రెండున్నరేండ్ల కిందటి వరకు తెలంగాణ జన సమితి బాధ్యుడిగా ఉన్న. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా, ఆ తర్వాత పార్టీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్‌గా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా సేవలందించిన. అయితే, 32 ఏండ్ల కిందటి నుంచే కోదండరాంతో కలిసి పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్సీ)లో పని చేసిన. అంటే, దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఆయన నన్నూ, నేను ఆయననూ అతి దగ్గరగా చూసినం. పరస్పర గౌరవాభిమానాలు ఇప్పటికీ ఉన్నయి.ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ఆయనతో ఆత్మీయ అనుబంధం, సాన్నిహిత్యం లేనివారు, ముఖ్యంగా నిన్నమొన్నటి టీడీపీ, కాంగ్రెస్ నాయకులు లేదా ఆయనతో పాటు ఉండి, ఆయన చెప్పుకొనే ఆదర్శాలను తుంగలో తొక్కి, చెరువు నిండిన సందర్భంలో చేరిన కప్పల వంటి ప్రస్తుత సహచరులు ఈ వ్యాసం చదివి ఎగరకుండా ఉండటానికి. బహుశా కోదండరాం శ్రీమతి తర్వాత ఆయనను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిని నేనేనేమో కూడా. కాబట్టి, ఎగురుడు దుంకుడు నడువవ్!
Professor Kodandaram | రేవంత్ ఏమి చేసినా మెచ్చే, ఏమి చేయకున్నా నచ్చే కొందరు అపర మేధావులు కూడా ఇప్పుడు కోదండరాంపై ప్రేమ ఒలకబోస్తున్నరు. ఉద్యమ సమయంలో జేఏసీ నాయకులు, కార్యకర్తలపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి నేడు వారికి ప్రీతిపాత్రుడు అయిండు. ‘కోదండరాం రాజకీయాలకు పనికిరారు, ఆయన జేఏసీని నడపాలి, మాకు సహకరించాలి’ అని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నపుడు మాట్లాడిన్రు. ఇప్పుడు ఎట్లా పనికి వస్తరో మరి! నిజానికి ఆయన పనికి రారని, రాకూడదని రేవంత్ స్థిరాభిప్రాయం. కాబట్టే ‘లీగల్ ఇష్యూ’లో కొట్టుకుపోవాలని ఆయనకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇచ్చిన్రు. ‘మా సార్‌కు మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నం, అది ఇస్తమంటేనే ఎమ్మెల్సీ తీసుకుంటం’ అని టీజేఎస్ మిత్రుడు ఒకరు ఆమధ్య అన్నరు నాతో. మంత్రి పదవి ఇవ్వాల్సి ఒస్తదనే ‘గవర్నర్ ట్రాప్’ వేసిన్రు రేవంత్. లేకపోతే మొన్ననే వచ్చిన ఎమ్మెల్యే కోటాలో ఇచ్చి ఉండేవారు. ఇంకొక రహస్యం చెప్తా వినండి. ఐదేండ్ల కిందటి ఎన్నికల్లో మహాకూటమి పేరిట టీజేఎస్‌ను ఆరు సీట్ల స్థాయికి కుదించి, అందులో నలుగురిని మోసం చేస్తూ తమ పార్టీ అభ్యర్థులను కూడా రంగంలోకి దించింది కపట కాంగ్రెస్. గాదె ఇన్నయ్య కూడా అట్లా మోసానికి గురై ఓటమి చెందిన్రు. మరో బ్రహ్మ రహస్యం కూడా వినండి. ‘అసలు కూటమిలో టీజేఎస్ వద్దేవద్దు, వారిని బయటకు పంపండి’ అని అప్పటి టీడీపీలో సెకండ్ ఇన్-కమాండ్ స్థాయిలో ఉన్న నాయకునితో రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాయుడు అన్నరు. నేను రాసే అక్షరాల్లో ఒక్కటంటే ఒక్క పొల్లు మాట లేదు. నేను అప్పుడు కీలకమైన స్థానంలో ఉన్నా టీజేఎస్‌లో. విజ్ఞులైన పాఠకులు ఒకటి గమనించాలి. ఇప్పుడు పార్టీ మారిన కదా అని టీజేఎస్‌కు సంబంధించి అంతర్గత, రహస్య విషయాలేమీ రాయను, ఎవరికీ చెప్పను. ఆ గోప్యత పాటించే విలువలు ఉన్నయి నాకు.
అదే సమయంలో, కోదండరాం మరింత అభాసుపాలు కాకుండా చూడాలని నా మనసు నాకు సిన్సియర్‌గా చెప్తున్నది. కపట నాటకాలు, మోసాలు, అణువణువునా నింపుకుని, అడుగడుగునా అదే ఒరవడితో సాగే రేవంత్‌రెడ్డికి అడ్డుకట్ట కూడా వేయాల్సి ఉన్నది.
1885లో ఆంగ్లేయుడు ఏఓ హ్యూమ్‌తో కలిసి తానే కాంగ్రెస్ పార్టీని స్థాపించినట్టు పోజులు కొడుతూ.. మాటకు ముందు, మాటకు తర్వాత ‘కాంగ్రెస్ పార్టీ’ అనే రేవంత్‌రెడ్డి దాన్ని ముంచడానికే కంకణం కట్టుకున్నారనే విషయం కోదండరాం తెలుసుకోవాలి. బీజేపీ, టీడీపీ అజెండాను అమలు చేసే కార్యకర్తగా రేవంత్‌రెడ్డిని గుర్తెరగాలి. పుట్టిమునిగే దాకా పట్టని ఆయన పక్కనున్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ఈ సోయి ఎటూ లేదు కాబట్టి, వారికి చెప్పడం లేదు! నేను ఇదంతా రాయడానికి కారణం కేసీఆర్‌కు కోదండరాంను దగ్గర చేద్దామని కాదు. కోదండరాం చెప్పే, చేసే ప్రత్యామ్నాయ రాజకీయాలు సమాజానికి అవసరం. ఒక బీఆర్ఎస్ బాధ్యుడిగా ఈ మాట చెప్తున్నందుకు మా అధినాయకుడు నొచ్చుకోరు.
‘రాజకీయాలు పరిణతి చెందాలి, గుణాత్మక మార్పు రావాలి’ అని కేసీఆర్ బహిరంగ సభల్లోనే కాదు, ప్రైవేట్ సంభాషణల్లో కూడా నాతో అన్నరు. ‘రిక్లెయిమింగ్ ది రిపబ్లిక్’ను తెలుగులో అనువదించండి అంటూ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, కోదండరాం ఇద్దరూ నాతో అన్న మాటల సారాంశం కూడా అదే. స్థూలంగా కోదండరాం ఒరిజినల్ ఫిలాసఫీ పట్ల నాకు ఆమోదం మాత్రమే కాదు, మక్కువ కూడా ఉన్నది. ఈ వ్యాసం చదువుతున్న రాష్ట్రవ్యాప్త కోదండరాం అభిమానులు, టీజేఎస్ బాధ్యులూ బయటకు ఏమి మాట్లాడినా, లోపల నా మాట నిజమంటరని నాకు తెలుసు.
‘చెప్పులు మోసేవాళ్లు’ అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తూ రేవంత్‌రెడ్డి ఎరుకల జాతిని అవమానించినా కూడా బహుజన నాయకుడు కుర్ర సత్యనారాయణ ఒక విలువైన సూచన చేసిన్రు. రేవంత్‌రెడ్డికి కోదండరాంపై ప్రేమ, గౌరవం ఉంటే రాజ్యసభకు పంపించాలని. నేను సైతం అదే అంటున్న కోదండరాంతోనూ, టీజేఎస్ బాధ్యులతోనూ రేవంత్‌పై ఒత్తిడి తెచ్చి రాజ్యసభకు నామినేట్ అవండి. అందరం హర్షించే విషయమది!
1990వ దశకంలో ఏపీసీఎల్సీ బాధ్యుడిగా ‘ఫ్యాక్ట్ ఫైండింగ్’ పనుల్లో కలిసి తిరుగుతున్నపుడు బాలగోపాల్, కోదండరాం ప్రభృతులతో ‘ప్రజాస్వామ్యంలో పారదర్శకత’ గురించి మాట్లాడుకున్నం. ‘రాజ్యహింస’తో పాటు ‘ప్రైవేట్ హింస’ను కూడా ఖండించాలని బాలగోపాల్ ప్రతిపాదించినప్పుడు మేమిద్దరం ఆయన సహచరులమే. ‘అసలు ఈ పౌర హక్కుల సంఘం ఏమిటి? పౌరులు కాకపోతే హక్కులు ఉండొద్దా?’ అంటూ మానవీయంగా ఆలోచించిన బాలగోపాల్ మానవ హక్కుల వేదికను స్థాపించారు, పౌర హక్కుల వేదిక నుంచి విడివడి! అదిగో, ఆ నేపథ్యం నుంచి వచ్చిన కోదండరాంతో పాటు నేను. కాబట్టి, నాకు విషపూరిత, మోసపూరిత అజెండాలు ఏమీ ఉండవు, నేను రేవంత్‌రెడ్డిని కాదు గనక!
ఈ విషయాలన్నీ యోగా చేస్తున్నప్పుడు ఉండే ఏకాగ్రతతో మననం చేసుకోవాలని ప్రజాస్వామికవాదులను కోరుతున్నా. కేసీఆర్‌పై కోపంతోనో, ఆయన కులంపై ద్వేషంతోనో, బీఆర్ఎస్పై కక్షతోనో వ్యవహరించడం తగదని సూచిస్తున్నా. రేవంత్‌రెడ్డి కేంద్రంగా సాగుతున్న ‘అందర్నీ ముంచే’ యజ్ఞంలో సమిధలు కావొద్దని విన్నవిస్తున్నా.
అసలు ఇందులో మీకు ఏమి ఆసక్తి? అని ప్రథమ పౌరురాలిని రాజ్యాంగ విలువలను ఔదలదాల్చే ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా సగౌరవంగా నిలదీస్తున్నా. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలకు ఉన్న రాజకీయ నేపథ్యం కోదండరాంకు లేదని మీరెందుకు అనుకున్నరు? లేక ‘రాజకీయాలకు పనికిరారు, పనికి రాకుండా చేద్దాం’ అన్న రేవంత్‌రెడ్డి మాట మీకు నచ్చిందా? విషయం కోర్టులో ఉందని తెలిసి కూడా మీరే చెప్పిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఎందుకు బేఖాతరు చేసిన్రు? మోదీకి ఈ విషయం తెలుసా? చెప్పండి ‘గవర్నర్ గారూ? ఇదేనా వ్యవస్థకు మీరు పట్టించే అవస్థ?’
‘నేషన్ వాంట్స్ టు నో’ అని దబాయించడానికి ఏ అర్ణాబ్ గోస్వామి రావాలి? లేక మర్యాద పురుషోత్తముడైన రాముడు ‘అక్షింతలు’ వేస్తే వింటరా? ముగించే ముందు కోదండరాంకు సవినయ సూచన. పోయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు పనిచేయని, చేయం అని తెగేసి చెప్పిన తెలంగాణ వాదులు నేడు మొసలి కన్నీరు కారుస్తున్నరు. జాగ్రత్త సర్. మీ ప్రత్యర్థి శిబిరంలో ఉన్న నా మాట వినకపోతే పోనీ, ఒకసారి యోగేంద్ర యాదవ్‌ను అడగండి.. వాట్ ఈజ్ ది వే ఫార్వర్డ్ అని. హౌ టు రిక్లెయిమ్ డెమోక్రసీ అని! జై తెలంగాణ!!
-శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
90309 97371