తెలంగాణ ఒక విఫల ప్రయోగం కావాలన్నది తెలంగాణ వ్యతిరేకుల స్వప్నం. అందుకోసం వారి అనుంగు అనుచరులను పావులుగా వాడుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. పైగా అదే నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు. తమ విధ్వంసపు ఆలోచనలతో తెలంగాణను ఒక ఫెయిల్యూర్ రాష్ట్రంగా చిత్రీకరించేందుకు పాకులాడుతున్నారు. వారి కోరికలను నిజం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తుండటం ఆందోళనకరం.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధే ఏకైక ఎజెండాగా పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ వస్తే తమ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయోనని భయపడ్డ ఆంధ్రా ప్రజల అపోహలను తొలగించింది. ప్రత్యర్థులు చేసిన విష ప్రచారాలను పటాపంచలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ సాగిన కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అందుకేనేమో దేశ నలుమూలల నుంచి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తింది. ఆ శ్రమ ఫలితంగానే 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండేండ్ల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 సీట్లు సాధించింది. ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ తెలంగాణను దేశంలో అభివృద్ధికి దిక్సూచిగా కేసీఆర్ నిలబెట్టారు.
తెలంగాణపై శీతకన్ను చూపే కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా పలుసార్లు తెలంగాణ రాష్ర్టాభివృద్ధిని పొగిడింది. ఇట్లా విజయవంతంగా దూసుకువెళ్తున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొత్తం అతలాకుతలం చేసింది. చంద్రబాబు శిష్యుడైన రేవంత్‌రెడ్డికి పాలనా పగ్గాలను కాంగ్రెస్ అప్పగించడంతో ఆయన తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి.
ప్రగతిభవన్ ముందున్న సెక్యూరిటీ కంచె తొలగింపుతో ప్రారంభమైన తెలంగాణ విధ్వం సం హైడ్రా పేరిట పేదలు రోడ్డుమీద పడుతున్నా విధ్వంసం ఆగడం లేదు. రైతులకు పంట సహా యం ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోళ్లు ఆల స్యం చేసి వారిని అరిగోస పెట్టింది. అసంఘటితరంగ కార్మికుల పొట్టకొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పింది. ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థులు మరణిస్తున్నారు. కక్షపూరిత రాజకీయ హత్యలు, దాడులు, సోషల్ మీడియా కేసులతో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు భయాందోళనలో బతుకుతున్నది.
తెలంగాణ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరాచికాలాడుతున్నది. ప్రభుత్వ లోగో నుంచి చార్మినార్, కాకతీయుల తోరణాన్ని తీసేయబోయి బొక్కాబోర్లా పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ తల్లిని మార్చింది. ఆ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసింది. ప్రభుత్వ వేదికలపై బతుకమ్మ పాటలు, జానపద గేయాలు మాయమై అశ్లీల పాటలు మార్మోగుతున్నాయి. ఇదంతా చాలదన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కండ్లు తాజాగా సినీ పరిశ్రమపై పడ్డాయి. ఇరువై రోజుల నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. సమస్యలన్నీ పరదా చాటుకుపోయి ఒక్క అంశమే సాగుతున్నది. కోర్టులో తేలాల్సిన ఈ న్యాయపరమైన అంశాన్ని రాజకీయం చేస్తూ రోజుకో కృత్రిమ వివాదంతో తెలంగాణను బద్నాం చేస్తున్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో ‘తెలంగాణకు ఏమైంది, ఎం దుకీ పిచ్చి వైఖరి’ అని దుర్భాషలాడుతున్నారు.
ఇదంతా గమనిస్తుంటే.. సమైక్య రాష్ట్రంలోని తెలంగాణ వ్యతిరేక ఆంధ్రా నాయకుల స్వప్నం ఫలించేటట్టుగానే కన్పిస్తున్నది. పేరుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, చంద్రబాబు శిష్యుడైన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ నాశనానికి కంకణం కట్టుకొని మరీ కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నది.
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సుమారు పదేండ్ల కాలంలో ఒక్కో రంగాన్ని ఎలా బలోపేతం చేసుకుంటూ వచ్చామో అదంతా, ఒక్క ఏడాదిలోనే గం గలో కలిసింది. అసత్యాలు, దుష్ప్రచారాలు నమ్మిన ప్రజలకు వారేం కోల్పోయారో నెమ్మదిగా అర్థమవుతున్నది. కానీ, ఏం లాభం? అభివృద్ధి పథం లో ముందుకుపోవాల్సిన రాష్ట్రం మరో నాలుగేండ్ల లో ఈ విధ్వంసకారుల చేతుల్లో ఎంత నలిగిపోతుందోననే భయం వెంటాడుతూనే ఉన్నది.
– పాశం రఘునందన్ రెడ్డి 72077 70469