ఎవరు అడ్డమొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని, బుల్డోజర్ ఎక్కించి మరీ దూసుకువెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మూసీ మురుగు నీరు వల్ల చుట్టుపక్కల నివాసితులకు పలు సమస్యలున్నాయనే మాట నిజమే. అందుకే, ఏ పార్టీ కూడా మూసీ నది శుద్ధిని వ్యతిరేకించడం లేదు. కానీ, ఆ పేరుతో పేదల ఇండ్లను కూల్చవద్దని అన్ని పార్టీలు అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదట మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్ల కూల్చివేత మొదలైన విషయం అందరూ చూసిందే! అది బెడిసికొట్టడంతో ప్రక్షాళన అనే మాట ఎత్తుకున్నారు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్టు కేవలం మూసీ పరీవాహక ప్రాంత ప్రజల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తుండటం విడ్డూరం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా, మూసీల పేరిట స్వప్రయోజనాలను ఆశిస్తున్నారనడంలో సందేహం లేదు. అందుకోసమే ఆయ న డైవర్షన్ పాలిటిక్స్‌ను పావుగా వాడుకుంటున్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ మధ్య ప్రభుత్వాలకు ఇవి ఒక ఆయుధంలా పనిచేస్తున్నాయి. ఏదో ఒక సమస్యను లేవనెత్తి, దాన్ని భూతద్దంలో చూపించి మీడియాను, ప్రజల దృష్టిని అటువైపు మళ్లించడమే ప్రభుత్వాల లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే… వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేసి తీరుతామని ప్రజలకు ఇచ్చిన హామీలను మూడు వందల రోజులైనా నెరవేర్చలేదు. రుణమాఫీ అట్టర్‌ఫ్లాప్ అయింది. డిసెంబర్ 9 నాటికి రైతుల ఖాతాల్లో రూ.13 వేల కోట్లు జమ చేస్తామని కొత్త వాయిదా ఇచ్చారు. సోనియాగాంధీ పుట్టినరోజు తెలంగాణ ప్రజల ఆశల వాయిదాకు వారధిగా పనికి వస్తున్నది. కనీసం ఆ రోజైనా రుణమాఫీ డబ్బు రైతు ఖాతాల్లో వేయకపోతే సోనియమ్మ కూడా నారాజ్ అయ్యే అవకాశం ఉన్నది.
ఇదిలా ఉంటే రైతు భరోసాకు అతీగతీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్, కల్యాణలక్ష్మి లాంటి సామాన్య జన ఆర్థిక వెసులుబాటు దస్ర్తాలు కదలడం లేదు. రాష్ట్ర ఆదాయానికి మించిన హామీలు ఇవ్వడంతో జనం ముందు ప్రభుత్వానికి తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఏదో డ్రామా ఆడాలని హైడ్రాను తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ భూములను కబ్జా నుంచి రక్షించేందుకు కంకణం కట్టుకున్నామన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, కోర్టు మొట్టికాయలు వేయడంతో అది చల్లబడింది. ఆ తర్వాత మూసీ అంశం ముందుకువచ్చింది. ఇక్కడా జనం తిరగబడటంతో ప్రభుత్వం తోక ముడువక తప్పలేదు. నిజానికి ఈ రెండు ప్రాజెక్టులకు ప్రణాళిక అంటూ ఏదీ లేదు. ఏదో హంగామా చేయాలి. హల్చల్తో అందరి దృష్టి మళ్లించాలి. అదే ప్రభుత్వ అసలు లక్ష్యం. వీటివల్ల అటెన్షన్ డైవర్షన్ అనేది ప్రభుత్వం పాక్షికంగా సాధించిందనే అనాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ అంశానికి తెరదీయడంతో అన్ని రాజకీయ పక్షాలు కొన్నిరోజుల పాటు దాని చుట్టే తిరిగాయి. అయితే, ఇప్పుడు విపక్షాలు వదిలివేసినా సీఎం మాత్రం పాదయాత్రలు చేస్తూ మూసీని వదలడం లేదు. సీఎంగా తన మొదటి పుట్టినరోజు నాడు ఎక్కువ సమయాన్ని మూసీ ప్రాంతంలో గడిపి ఆ అంశం జోరును తగ్గకుండా జాగ్రత్త పడ్డారు.
2025, జనవరిలో లక్షల మందితో మూసీ పాదయాత్ర చేస్తానని సీం రేవంత్ ప్రకటించారు. అంతమందితో పాదయాత్ర ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అయినా ఇదేం దండి సత్యాగ్రహం కాదు, తెలంగాణ ఉద్యమం అసలే కాదు. మూసీలో మురిగు అలాగే ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు. నిజానికి మూసీ మురికి ఈ మధ్య తలెత్తిన సమస్య కాదు. సుదీ ర్ఘ కాంగ్రెస్ పాలనలో, ఎన్టీఆర్, చంద్రబాబు జమానాలోనూ మూసీ మురికిగానే ఉన్నది. పరిశ్రమలన్నీ ఏండ్ల తరబడి రసాయన వ్యర్థా లు చాటుమాటుగా మూసీలోకి వదిలివేస్తున్నా ప్రభుత్వాలు కండ్లు, ముక్కు మూసుకున్నాయి.
గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీనే తొలిసారిగా మూసీ ప్రక్షాళన కోసం నడుం బిగించింది. నల్గొండ రైతులకు శుభ్రమైన సాగునీటిని అందించేందుకు మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.3,800 కోట్లతో 32 శుద్ధి కేం ద్రాలకు శ్రీకారం చుట్టింది. వాటిలో 8 కేంద్రాల నిర్మా ణపనులు చివరి దశకు చేరుకున్నాయి. నిజానికి ఇదే ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో చేపడితే సమస్య కొంతవరకు తీరిపోయేది. కానీ, సీఎం రేవంత్ ఈ విషయాన్ని పక్కనబెట్టి ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైందనడమే శుద్ధ అబ ద్ధం. పైగా అడ్డొచ్చినవారిని రాయికట్టి నీటిలో ముంచుతానని, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముం దున్నదనడం సీఎం స్థాయిని తగ్గించడమే. కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని నోటికొచ్చింది మాట్లాడటం వల్ల ప్రజల్లో రేవంత్‌రెడ్డిపై గౌర వం తగ్గిపోతున్నది. అందుకేనేమో, ప్రజలు రాయలేని భాషలో ఆయనను తిడుతున్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీల మాటేమోగానీ, మిగతా నాలుగేండ్లలో ఎన్నికల ఖర్చులు రాబట్టుకోవాలి. అధిష్ఠానం ధనదాహం తీర్చాలి. రాష్ట్ర ఆదాయం నెలవారీ ఖర్చులకే సరిపోవడం లేదు. ఏదైనా కోట్లు కుమ్మరించే ప్రణాళిక కావాలి. అందుకు ప్రైవేటు భాగస్వామ్యంతో భారీ ప్రాజెక్టును రచించాలి. దానికి మూసీ సుందరీకరణ ప్రణాళిక బాగా పనికొస్తుంది. అందు లో భాగంగానే రివర్ బెడ్ అని ముద్రవేసి ఇండ్లు కూల్చడం మొదలైంది. వ్యతిరేకత రావడంతో నిర్వా సితులను ఏదోరకంగా ఖాళీ చేయించి నదికి రెండువైపులా విదేశీ కంపెనీలతో భారీ నిర్మాణాలు చేపడితే కోరిన అవసరాలు తీరే అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వ పెద్దలు సియోల్ వెళ్లి, నదికి ఇరువైపులా వ్యాపార సముదాయాలను ఎలా నిర్మించారో చూసివచ్చారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వేల కోట్ల నిర్మాణాల ఒప్పందాలు చేసుకోవచ్చు. కమీషన్లకు కొదువ ఉండదు. అందుకే, ఇచ్చిన హామీల కన్నా, మూసీ సుందరీకరణనే ఇప్పుడు రేవంత్ అసలైన లక్ష్యం. అందుకే అడ్డమొస్తే ఎంతటివారినైనా బుల్డోజర్లతో తొక్కిస్తానని ఆయన బెదిరిస్తున్నారు.
– నర్సన్ బద్రి 94401 28169