ఎవరు జర్నలిస్టులో తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జర్నలిస్టుల సంఘాలను కోరారు. జర్నలిస్టుల సంఘాలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నప్పుడు ఎవరు జర్నలిస్టులో తేల్చే బాధ్యత ఏ రాజకీయ పార్టీ జర్నలిస్టు సంఘానికి అప్పగిస్తున్నారో ఆయన స్పష్టత ఇస్తే బాగుండేది. మిత్రపక్ష జర్నలిస్టు సంఘానికా?సొంత పార్టీ సంఘానికా? బీజేపీ, బీఆర్ఎస్ సంఘానికా? ఏ పార్టీ సంఘానికి ఈ బాధ్యత అప్పగిస్తున్నారు.
గతంలో సీపీఐ, సీపీఎం పార్టీలకే జర్నలిస్టుల సంఘాలుండేవి. ఇప్పుడు కాంగ్రెస్‌తో సహా ప్రతి రాజకీయ పక్షానికి సంఘాలున్నాయి. అయితే ఎవరు జర్నలిస్టో మీడియా యాక్ట్ స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించే సంఘం మీడియా చట్టం కన్నా శక్తివంతమైనదా? ఈ అంశం హైడ్రా కూల్చివేతల నుంచి మొదలైంది. పైసా పైసా కూడబెట్టుకొని స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే కూల్చివేసినప్పుడు బాధితుల స్పం దన తీవ్రంగానే ఉంటుంది. బాధితులంటే తడి గుడ్డతో గొంతులు కోసే ముదుర్లు కాదు. మం చి చేస్తే కాళ్లమీద పడతారు. తమ గూడు కూల్చివేస్తే బూతులు తిడతారు. ఆ బూతులు సాధారణంగా ప్రధాన మీడియా చూపించదు. యూట్యూబ్‌కు అవే పెద్ద మసాలా? ఆ బూతులు చూపుతూ వ్యూవర్షిప్ పెంచుకుంటాయి.
యూట్యూబ్ ఛానల్స్ అన్ని రాజకీయ పక్షాలకున్నాయి. ఇది మిగిలిన అందరికన్నా రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. పీసీసీ అధ్యక్షుని గా ఉన్నప్పుడు యూట్యూబ్‌ల బృందాన్ని నిర్వహించారు. పోలీసులు ఆ కార్యాలయం మీద దాడి కూడా చేశారు. యూట్యూబ్‌ల ద్వారా కాంగ్రెస్‌లో సీనియర్ల మీద బురదజల్లుతున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. సీఎం రేంత్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆయనను ప్రజలు బూతులు తిడుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ఆ బూతులను యథాతథంగా ప్రసారం చేస్తున్నాయి. యూట్యూబ్స్‌లో యథాతథంగా ప్రసారం చేయడంపై సీఎం కోరుకుంటున్నట్టు చర్చ జరగడం మంచిదే. మంచి, చెడు, గౌరవ ప్రదమైన భాష గురించి తెలియని గ్రామీణుడు అలా మాట్లాడటాన్ని మనం తప్పుపడుతున్నాం, తప్పుబట్టాలి కూడా. అది ముమ్మాటికీ తప్పే. ఆ బాధితుడి మాటలను అంతగా వ్యతిరేకిస్తున్న మనం ముఖ్యమంత్రి వంటి అత్యున్నతమైన పదవిలో ఉండి ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్న మాటల మీద మరి చర్చ అవసరం లేదా?
కవితకు బెయిల్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్‌రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడటాన్ని చివరికి సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా తీసుకొని ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు. రేవంత్‌రెడ్డి మాటల మీద సుప్రీంకోర్టులో చర్చ జరిగితే బాగానే ఉండేది. రేవంత్‌రెడ్డి క్షమాపణతో ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా, సొంత, అధికార, పార్టీ యూ ట్యూబ్స్ టీమ్స్ ఉన్నా, మీడియా అండగా నిలిచినా వీటిని మించిన ప్రచారం బూతు మాటల యూట్యూబ్స్కు లభిస్తున్నది. దానితో రేవంత్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. బాధితుల బూతు లు, వాటిని యూట్యూబ్‌లో యథాతథంగా ప్రసారం చేయడం వ్యతిరేకించాల్సిందే. దీనిపై చర్యలు తీసుకోవాలిసిందే. మరి అంతకుమిం చి బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులపై ఏ చర్చ వద్దా? ఏ చర్య వద్దా?
‘నన్నేమైనా అనండి భరిస్తాను కానీ, తెలంగాణను అవమానిస్తే పాతి పెడతాను’ అని సీఎంగా ఉన్నప్పుడు వరంగల్‌లో కేసీఆర్ అంటే జాతీయస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు నిండు సభలో బట్టలూడదీసి కొడతాను, చెడ్డిలో తొండలు వదులుతానని మీడియాను సీఎం హెచ్చరిస్తున్నారు. బట్టలూడదీసి కొట్టే అధికారం సీఎంకు ఏ చట్టం ద్వారా సం క్రమించిందో చెప్తే తెలుసుకుందాం. టీడీపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్‌రెడ్డి బూతులు మానలేదు. సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పి న తర్వాత మాట తీరు మారుతుందనుకుంటే మరింత అసహనం పెరిగిపోయింది. తనకు వ్యతిరేకంగా రాశారని గతం లో అనేకసార్లు మీడియాను మీరు డీఎన్ఏ పరీక్ష చేయించుకోండి అని రేవంత్‌రెడ్డి తిట్టా రు. తెల ంగాణను అవమానిస్తే పాతరేస్తా అన్న మాటల్లో తప్పు కనిపించినవారికి డీఎన్ఏ పరీ క్ష చేయించుకోండి అనే తిట్టు మాత్రం మురిసిపోయేట్టు చేసింది. ఎవరు జర్నలిస్టో చట్టం స్పష్టమైన నిర్వచనం చెప్పిన తర్వాత సంఘాలు అంతకుమించి నిర్వచనం ఇస్తాయా?
ఎవరు జర్నలిస్టో తేల్చే అధికారం సంఘాలకు ఉంటుందా? ప్రభుత్వం ఇచ్చే సౌకర్యా లు, ప్రకటనలు, అక్రిడేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో ఎవరికివ్వాలో, ఎవరికివ్వవద్దో తేల్చే అవకాశం సంఘాల చేతిలో ఉండవచ్చు. ప్రభుత్వ సౌకర్యాలు కోరుకోకుండా ఉండేవారిని ఏం చేయగలరు. మీడియానా? మీడియా కాదా? అని కాదు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడే యూట్యూబ్స్ మీద, నాయకుల మీద ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అయితే, మన వ్యవస్థల్లో పెద్దలకు ఒకవైపే కనిపిస్తుంది. అధికార పక్షం వైపు చూపు పని చేయదు.
ప్రతిపక్ష నాయకుడు స్ట్రెచర్ మీదినుంచి మార్చురీకి వెళ్లాలా? సీఎం స్థాయి వాళ్లే ఇలాంటి అనాగరిక భాష మాట్లాడితే బాధితులు ఎలా మా ట్లాడుతారు. సంఘాలు రాజకీయ పార్టీల అనుబంధ విభాగాలు. ఇక మీడియా రాజకీయ అనుబంధం తర్వాత తన ప్రాధాన్యం కోల్పోయింది.
రాహుల్ గాంధీని పప్పు అని ప్రచారం చేయడానికి బీజేపీలో ఒక పెద్ద వ్యవస్థనే ఉన్న ది. ఇన్ని వేల యూట్యూబ్స్ ఛానల్స్‌లో రాహుల్‌గాంధీని ట్రోల్ చేస్తుంటే ఎలా భరిస్తున్నారో అని సివిల్స్ కోచింగ్ ఇచ్చే వికాస్ దివ్యకృతి ఓ ఉపన్యాసంలో ఆశ్చర్యపోయారు. తాను యూట్యూబ్ గుంపు ద్వారా ప్రత్యర్థులను ట్రోల్చేసి, సీఎం అయ్యాక తనను ట్రోల్ చేస్తుంటే రేవంత్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, బాధ్యత లేని యూట్యూబర్స్ భాషను మించి బూతులు తిడుతున్నారు. రాహుల్, రేవంత్ పరిణతికి మధ్య తేడా ఇది.
2004లో బాబు ఓడిపోయాక, ఆయనను అవమానించవద్దని రాహుల్ బహిరంగంగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ గాయపడితే సీఎంగా రేవంత్ వెళ్లి పరామర్శించారు. కొంత ఆశ్చర్యం వేసిం ది. అయితే, రాహుల్ వెళ్లమంటే వెళ్లాను, లేకపోతే నేనెందుకు వెళ్తానని రేవంత్‌రెడ్డి స్వయం గా ప్రకటించిన తర్వాత ఓహో దీనివెనుక రాహుల్ ఉన్నారా అని అప్పుడు తెలిసింది. మాట్లాడేప్పుడు తాను సీఎంను అని రేవంత్ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆ భాష వల్ల సీఎంకు నష్టం లేకపోవచ్చు కానీ, తెలంగాణకు నష్టం.
– బుద్దా మురళి