మంచి పని చేసినవారిని మెచ్చుకుంటాం, సన్మానిస్తాం, బహుమతులిస్తాం. కానీ, శిక్షించడం జరిగితే? దేశ భవితవ్యం కోసం జనాభా తగ్గించాలని ఐదు దశాబ్దాల కిందట కేంద్రం పిలుపునిచ్చింది. పెరుగుతున్న జీవన వ్యయం, వనరుల పరిమితి దృష్ట్యా అది అనివార్యమని తేల్చిచెప్పింది. అభివృద్ధిలో, చదువులో ఉత్తరాది కన్నా ముందంజలో ఉన్న దక్షిణాది దానిని తు.చ. తప్పక పాటించింది. జనాభాను నియంత్రణలో ఉంచింది. కానీ, అన్నింటా వెనుకబాటుతనంలో ఉండిపోయిన ఉత్తరాది చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే నినాదాన్ని ఒంట బట్టించుకోలేకపోయింది. దాంతో అక్కడ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన పేరిట కేంద్రం ఉత్తరాదికి, ముఖ్యంగా యూపీ, బీహార్ రాష్ర్టాలకు ప్రాతినిధ్యం, అంటే సీట్లు పెంచబోతున్నది. దేశ అభ్యున్నతికి పాటుపడిన దక్షిణాదికి దండన, తోడ్పడని ఉత్తరాదికి అధిక ప్రాతినిధ్యపు సత్కారం కల్పించబోతున్నదన్న మాట. ఇది సుదీర్ఘ పర్యవసానాలకు దారితీస్తుందనేది తెలిసిందే. ‘దక్షణాది మెడ మీద పునర్విభజన కత్తి వేలాడుతున్నది’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన హెచ్చరిక ఈ పరిణామం గురించే. గతంలోనూ ఇదే వ్యవహారంపై ఆయన ‘తమిళనాడుకు చెందిన ఒక్కో జంట 16 మంది పిల్లల్ని కనాలని’ వ్యంగ్యంగా పిలుపునిచ్చారు.
స్టాలిన్ తాజా ప్రకటన మరోసారి ఉత్తర, దక్షిణ తారతమ్యాల చర్చకు తెరలేపింది. నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడుకు జరగబోయే నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఆ మాట అన్నప్పటికీ మొత్తంగా నాలుగు దక్షిణ రాష్ర్టాలకు అది వర్తిస్తుంది. ‘మేమిద్దరం మాకిద్దరు’ అనే సూత్రం చాలావరకు పాటించి దేశ జనాభా నియంత్రణకు దన్నుగా నిలిచిన దక్షిణాదికి ఒరిగిందేమిటి? జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతుండటంతో ఉత్తరాదిలో లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణాదికి అరకొరగా మాత్రమే సీట్లు పెరుగుతాయి. దీని ఫలితంగా పార్లమెంటులో నిర్ణాయక పాత్ర పోషించే అవకాశాన్ని దక్షిణాది కోల్పోతుండటం అసలు కీలకం. అప్పటికి భారత్ జనాభా 142 కోట్లు అవుతుందని భావిస్తున్న 2026లోనే పునర్విభజన జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. దక్షిణాదికి కూడా సీట్లు పెరుగుతాయని ఆయన అంటున్నారు. అయితే, ఇది కంటితుడుపు మాటే. ఎందుకంటే ఈ పెరుగుదల అంతటా ఒకే తీరుగా ఉండదు. పునర్విభజన కసరత్తు ఫలితంగా మొత్తం స్థానాల సంఖ్య 543 నుంచి 848కు పెరుగుతుంది. జన సంఖ్యను బట్టే పునర్విభజన ద్వారా నియోజకవర్గాలను పెంచుతారు. గరిష్ఠంగా లబ్ధి పొందనున్న యూపీలో ప్రస్తుతం 80 స్థానాలుంటే అవి 143కు పెరుగుతాయి. 50 శాతం పైగా స్థానాలు వచ్చిచేరుతాయి. బీహార్ స్థానాలు 40 నుంచి 79కి, అంటే దాదాపు రెట్టింపు పెరుగుతాయి. అదే తమిళనాడులో 39 కాస్తా 49 అవుతాయి. ఇక తెలంగాణలోని 17 స్థానాలు 23కు, ఏపీలోని 25 స్థానాలు 31కి పెరుగుతాయి. దక్షిణాదిలో ఎక్కువగా పెరిగే కర్ణాటకలో స్థానాల సంఖ్య 28 నుంచి 41 అవుతుంది. కేరళ లోక్సభ స్థానాలు యథాతథంగా 20 వద్దే ఉంటాయి.
పైన తెలిపిన కారణాల వల్ల దక్షిణాది రాష్ర్టాలు పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘జనాభా నియంత్రణను పటిష్ఠంగా అమలు చేసినందుకు మా రాష్ర్టాన్ని శిక్షిస్తారా?’ అని తమిళనాడుతో పాటుగా దక్షిణాది రాష్ర్టాలన్నీ మొదటినుంచీ ప్రతిఘటిస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంఘీభావం తెలుపడం గమనార్హం. జనాభా ప్రాతిపదికన పునర్విభజన వద్దని ఆయన అంటున్నారు. ఉత్తర, దక్షిణ విభేదాలకు కారణమయ్యే అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో కీలకమైంది జీడీపీ, పన్ను వాటాల వ్యత్యాసం. అంతిమంగా ఇదంతా సమాఖ్యవాదానికి పెనుసవాలుగా మారబోతున్నది. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పటిదాకా నాలుగుసార్లు పునర్విభజన కమిషన్లు ఏర్పాటైనా ఏమీ జరుగలేదు. అయితే ఈసారి ఎలాగైనా సాధించి తీరాలనే పట్టుదలతో కేంద్ర పాలకపక్షమైన బీజేపీ దూకుడుగా పోతున్నది. ఉత్తరాదిలో బాగా విస్తరించి దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తంటాలు పడుతున్న ఆ పార్టీకి పునర్విభజన లెక్కలు సానుకూలంగా ఉన్నాయనేది గమనార్హం. అయితే దక్షిణాది ప్రాతినిధ్యం తరుగుదల సమస్యను పరిష్కరిస్తామని కేంద్రం చెప్తున్నది. అదెలా? అనేది మాత్రం ఇప్పటిదాకా స్పష్టత రాలేదు.