ఒకప్పటి ఉద్యమాల తెలంగాణ ఇప్పుడు ఉజ్వల తెలంగాణగా మారింది. అసలు తెలంగాణ ఏర్పాటు సాధ్యమేనా అనేఅనుమానాల నుంచి ‘ఇదీ తెలంగాణ’ అంటే అనేవిధంగా ఆదర్శంగా తయారైంది. 60 ఏండ్ల నాటి కల నిజమై అప్పుడే దశాబ్దంలోకి అడుగుపెట్టింది. సర్వతోముఖాభివృద్ధితో దూసుకుపోతున్న తెలంగాణను చూసినవారంతా నాటి ఉద్యమంలోమేమున్నామంటే మేమున్నామని చెప్పుకొంటున్నారు. కానీ వారిలో చాలామంది తెలంగాణ సాధ్యమైతదని, అద్భుత ప్రగతిని సాధిస్తుందని ఏ మాత్రం ఊహించలే. ఒక్కడంటే ఒక్కడే తెలంగాణ వస్తది. అది బంగారు తెలంగాణగా మారుతదని నమ్మిండు. ఆ ఒక్కడే బక్క పలచని… ఉక్కు సంకల్పం కలిగిన వ్యక్తి కేసీఆర్.
మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎన్నో అనుమానాలు, ఎన్నెన్నో అపోహలు. తొలిదశలో కానిది, ఇప్పుడైతదా అని పెదవి విరుపులు. అయితే తొలిదశ ఉద్యమాన్ని చూసినవారికి ఈ అనుమానం రావటాన్ని తప్పుబట్టలేం. ఎందుకంటే ఆ ఉద్యమం జరిగిన స్థాయి అలాంటిది. ఎంతోమంది ఉద్ధండులు ఆ ఉద్యమం లో పాల్గొన్నారు. మొత్తం తెలంగాణ సమాజమే ఆ ఉద్యమం వెంట నడిచింది. ఎంతోమంది విద్యార్థులు అమరులయ్యా రు. నాటి ఉద్యమం ధాటికి ఇక తెలంగాణ వచ్చుడే అన్నట్టు పరిస్థితులు కనిపించాయి. కానీ అప్పటి ఆంధ్రా లాబీ, పొలిటకల్ పవర్ ముందు ఉద్యమం ఓడిపోయింది. ఆ ప్రభావంతో మళ్లీ తెలంగాణ మాట ఎత్తాలన్నా, ఆ నినాదం తీసుకోవాలన్నా ధైర్యం చేయలేని పరిస్థితి.
అక్కడొక్కరు, ఇక్కడొక్కరు తెలంగాణ కోసం పోరాడటమే తప్ప రాష్ట్రం వస్తదని నమ్మినవారు లేరు. అలాంటి సమయంలో కేసీఆర్ ‘నేను తెస్తాను తెలంగాణ’ అంటూ ముందుకు వచ్చిండు. తెలంగాణ కోసం ఏకంగా ఓ పార్టీనే పెట్టిండు. ఆయన ప్రకటన చూసి చాలామంది జోకులు వేసిన్రు. కానీ కేసీఆర్‌కు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయకముందే రోజుల తరబడి ఉద్యమ పంథా కోసం మేధోమథనం చేసిండు.
తొలిదశ ఉద్యమంలో జరిగిన పొరపాట్లను ఈసారి పునరావృతం కావొద్దని తలచిండు. నాటి ఉద్యమంలో తెలంగా ణ కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నది. కానీ దాన్ని నడిపించే సరై న నాయకత్వం లేకుండే. ఈ లోటును కేసీఆర్ గుర్తించిండు. రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ సాధ్యమైతదనే నిర్ణయానికి వచ్చాకే టీఆర్ఎస్ను మొదలుపెట్టిండు. కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిండో అప్పుడు మళ్లోసారి తెలంగాణ వాదం తెరపైకి వచ్చింది. అంతవరకు ఓకే. కానీ నిజంగా మాట్లాడుకుంటే తెలంగాణ సాధ్యమైతదని నమ్మిన వాళ్లెంతమంది?
కచ్చితంగా చెప్పుకోవాలంటే కేసీఆర్ ఒక్కరే. ఆ ఒక్కడు మాత్రమే నిద్రలోంచి లేపి అడిగినా సరే తెలంగాణ సాధ్యమేనంటుండే. కానీ చాలామందికి అనుమానాలుండే. ముఖ్యం గా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ అనేది జరిగే పని కాదన్నది వాళ్ల అభిప్రాయం. పైగా తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులకు కావాల్సిన రాజకీయ, మీడియా, ఆర్థిక బలం పుష్కలంగానే ఉన్నది. ఇక మన దేశం ప్రజాస్వామ్యం. ఇక్కడ పొలిటికల్ నంబర్ గేమ్‌దే కీలక పాత్ర. కనీసం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువున్నా తెలంగాణను అడుగగలం. కానీ రాజకీయ లెక్కలుచూసినా సరే… ఆంధ్రా, రాయలసీమనే బలంగా ఉన్నది. అందుకే చాలామందికి తెలంగాణ వస్తదన్న నమ్మకం లేకుండే. మరి కేసీఆర్‌కు ఎందుకంత గట్టి నమ్మకమంటే. వీరులకుండే లక్షణమే అది. మిగతా వారి కన్నా భిన్నంగా ఆలోచించటమే కేసీఆర్ ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయ పార్టీ పెట్టిన వెంటనే తెలంగాణ వచ్చేస్తదని ఆయనేమీ భావించలే. తెలంగాణ విషయంలో కేసీఆర్ తొందరపడలేదు. ఓ మూడు, నాలుగేండ్లు ప్రయత్నం చేసి రాకపోతే మరోదారి అనుకోలేదు. ‘కేసీఆర్ చచ్చుడో… తెలంగాణ వచ్చుడో’ అనే ముందుకు కదిలిండు. ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండని ప్రజలతోనే అన్నారు. గతంలో ఏ నాయకుడు కూడా ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. లక్ష్యంపై ఎంత స్పష్టత ఉంటే ఇలాంటి ప్రకటన చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడప లేదు. ఆనాటి ఉద్యమంలో ఎన్నెన్ని సంఘటనలు జరిగాయో అందరికి తెలిసిందే. ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురైనా సరే ఉద్యమ ఆకాంక్షను మాత్రం సజీవంగా ఉంచిండు కేసీఆర్. ఆ క్రమంలోనే ఆయన వేచి చూసిన సమయం రానే వచ్చింది. అదే 2009 డిసెంబర్ నాటి తెలంగాణ ప్రకటన. అగో అప్పటి దాకా తెలంగాణ రానే రాదనుకున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురైన సందర్భమది. తెలంగాణ ప్రకటన నిజంగానే వచ్చిందా అంటూ గిల్లుకొని మరి చూసుకున్నారు. ఐతే రాదనుకున్న తెలంగాణ ప్రకటన చూసి సీమాంధ్ర నాయకులు కుట్రలు స్టార్ట్ చేసిన్రు. అగో గప్పుడు ఒక్కటైంది మొత్తం తెలంగాణ సమాజం.
ఉన్నోళ్లు, లేనోళ్లు, ఆ పార్టీ, ఈ పార్టీ, చిన్నోళ్లు, పెద్దోళ్లు మొత్తం సబ్బండ వర్గాలు ఒక్కటైనయి. ఎట్ల తెలంగాణ రాదో చూస్తామని బరిగీసి కొట్లాడతామంటూ కేసీఆర్‌కు వెయ్యి ఏనుగుల బలం తెచ్చిపెట్టినయ్. అప్పటి దాకా తెలంగాణ వస్తదని నమ్మిన ఒక్కడంటే ఒక్కడు కేసీఆర్ మాత్రమే. ఆ నమ్మకంతో చేసిన పోరాటంతో మొత్తం తెలంగాణ సమాజమే తెలంగాణ కచ్చితంగా వచ్చి తీరుతుందని నమ్మటం షురూ చేసింది. అంటే ఎంత మార్పో చూడండి. తాను ఒక్కడు మాత్రమే నమ్మిన తెలంగాణ రాష్ట్ర కాంక్షను కోట్లాది మందితో జై తెలంగాణ అనిపించటమంటే మామూలు విషయమా. మలిదశ తెలంగాణ ఉద్యమం కర్త, కర్మ, క్రియ అన్ని కూడా కేసీఆరే. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ కాకుండా ఇంకెవరైనా ఉద్యమ నాయకుడై ఉంటే తెలంగాణ రాకపోయేదన్నది అక్షరసత్యం. కేసీఆర్ ఒక సంకల్పం తీసుకుంటే దాని మీద ఎంత గొప్పగా పనిచేస్తారో తెలిపిన సంఘటనే తెలంగాణ ఉద్యమం.
గుప్పెడు మందితో ప్రారంభమై కోట్లాది మంది నినాదంగా తెలంగాణ మారిందంటే అది కేసీఆర్ ఘనతే. ఆధునిక భారతదేశం చూసిన అత్యద్భుతమైన ఓ పోరాటం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ఉద్యమం. 2009 వరకు అతడే ఒక సైన్యం. ఆ తర్వాత కేసీఆర్ అంటే మొత్తం తెలంగాణ. అట్ల ఎంతోమంది జీవితకాలంలో కూడా సాధ్యం కాని లక్ష్యం కేసీఆర్‌కు సాకారమైంది.
ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత కూడా కేసీఆర్ సంతృప్తి చెందలే. పునర్నిర్మాణ బాధ్యత కూడా భుజాన వేసుకున్నారు. తెలంగాణ వస్తే ఏ సమస్యలు వస్తాయని అప్పట్లో చాలా మంది చెప్పిన్రో వాటన్నింటిని సవాల్ గా తీసుకొని పరిష్కరిస్తున్నారు. తెలంగాణ అసాధ్యమంటే ఏ విధంగా సాధించారో, పునర్నిర్మాణ ప్రక్రియలోనూ అసాధ్యమన్న చాలా విషయాలను సాధించి చూపిస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థాయిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం కాకపోయి ఉంటే కచ్చితంగా ఇప్పుడు చూస్తున్న ఉజ్వల తెలంగాణను మనం చూసేవాళ్లం కాదు. దేశంలో తెలంగాణ నంబర్‌వన్ కావటం గ్యారెంటీ అని నమ్ముతున్న వ్యక్తి కేసీఆర్ మాత్రమే. అందుకే మరోసారి ప్రజలు ఆయనకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
-రచ్చ దినేష్
8978740475