రాజకీయ రాక్షస క్రీడకు రైతన్న బలయ్యాడు. అధికార దాహం అన్నదాతకు ద్రోహం తలపెట్టింది. సాగు సాయానికి సంకటం వచ్చిపడింది. రైతుబంధు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఆగమేఘాల మీద ప్రకటించింది కాదు. ఏదో లబ్ధికోసం తెచ్చింది అసలే కాదు. తొలివిడతా కాదు, మలివిడతా కాదు. పన్నెండో విడత పంటసాయం విడుదలకు ఎన్నికల కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. ఆరేండ్ల నుంచి ఇస్తున్నదే. ఎప్పటిలాగే ఇచ్చేయొచ్చు. కానీ, ఫిర్యాదులతో లేని వివాదం రాజేయడంతో వెనుకకు పోయింది. నిజానికి నిన్నటిదాకా రైతుబంధు అనేది ఎన్నికల అంశం కానే కాదు. బహుశా సీఎం కేసీఆర్ ప్రభుత్వ విజయ పరంపరలో అదొక అంశంగా ఉండి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కట్టుకున్న పుణ్యమాని అది చర్చాంశమైంది. సాగుకు అవసరమైన సమస్త సరంజామా సమకూర్చి చివరికి పంట పెట్టుబడిని కూడా అందించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన మాట వాస్తవం. ఎవరెన్ని చెప్పినా రైతుబంధును తెచ్చింది, ఇచ్చింది కేసీఆర్ అనేది చరిత్రలో శిలాక్షరం. రేపు ఈ అంశమే పార్టీల మధ్య తేడాలను అంచనా వేసేందుకు గీటురాయి అయినా కావచ్చు. ఇది ఎవరూ కాదనలేని సత్యం.
పదేండ్లపాటు అధికారానికి దూరమై అర్రులు చాస్తున్న కాంగ్రెస్ ఎన్నికల వేళ వెయ్యని ఎత్తులు లేవు, పన్నని కుట్రలు లేవు. సీమాంధ్ర పార్టీలతో అప్రకటిత ఒప్పందాలు మొదలుకొని తెలంగాణ ద్రోహులతో చేతులు కలపడం దాకా దేన్నీ వదిలిపెట్టడం లేదు. బట్టకాల్చి మీదేసే బూటకపు ప్రచారంలో రాటుదేలి పోయింది. బురదజల్లుడు రాజకీయంలో మునిగితేలుతున్నది. తనకు లేని బలం ఉన్నట్టుగా ఊదరగొడుతున్నది. ఇవన్నీ ఎన్నికల వేళ మామూలే అని సరిపెట్టుకున్నా వ్యవసాయం విషయంలో మాత్రం కాంగ్రెస్ తన మనసులోని మాటను బయటపెట్టుకుంటున్నది. మూడు గంటల కరెంటు చాలనే దగ్గర అది మొదలైంది. రైతుబంధు దుబారా అనేదాకా పోయింది. ఇప్పుడిప్పుడే నిమ్మలమైతున్న రైతు బతుకులు ఆగమాగం చేస్తామని కాంగ్రెస్ చెప్పకనే చెప్తున్నది. వ్యవసాయం దండుగన్న గురువు శుశ్రూషలో తరించిన శిష్యపరమాణువు సారథ్యం వహిస్తున్న పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం?
రైతుబంధు మహా అయితే నాలుగురోజులు ఆలస్యమవుతుంది. కానీ, కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే గోస తప్పదు. అసలుకే ఎసరు రావచ్చు. మాయమాటలు చెప్పి, అధికారం చేజిక్కిన తర్వాత చెయ్యివ్వడం కాంగ్రెస్‌కు షరా మామూలేనని కర్ణాటక పరిణామాలు వందోసారి రుజువు చేస్తున్నాయి. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ రైతులను కండ్లల్ల పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నారు. సాగుబడిలో, దిగుబడిలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలబెట్టారు. ఎంత చేసినా ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని ఆరాట పడుతున్నారు. మంచోళ్లు ఎవరో, తమను ముంచేది ఎవరో రైతులకు తెలియదా?