Singareni | తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, బతుకులు చీకటిమయమవుతాయన్న వెక్కిరింపులకు దీటైన సమాధానమిస్తూ విద్యుత్తు రంగంలో విప్లవం సృష్టించారు సీఎం కేసీఆర్. రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే కరెంటు కష్టాలను తీర్చారు. ఇందులో కీలక పాత్ర పోషించిన సంస్థ ‘సింగరేణి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ(జైపూర్)’. రాష్ట్ర అవసరాలకు 12 శాతం విద్యుత్తును సమకూరుస్తున్న ఈ సంస్థ థర్మల్ పద్ధతిలోనే కాక సోలార్ పద్ధతిలోనూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ అభివృద్ధిలో తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నది.
దశాబ్దాల స్వరాష్ట్ర సాధన ఉద్యమం వివిధ దశలు దాటుకొని మలిదశ ఉద్యమంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు దగ్గరవుతున్న రోజులవి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ఏకమై పిడికిలి బిగించి పోరాడుతున్న రోజులు. తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడి కొనసాగిస్తున్న ఉద్యమ ఉద్ధృతికి ఢిల్లీ పెద్దలు తలొగ్గి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు పూనుకున్న వేళ నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎగతాళి మాటలు నేటికీ గుర్తు. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదన్న ఆంధ్ర అహంకారపు మాటలకు మరో అడుగు ముందుకేసి తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, మీ బతుకులు చీకటిమయమే అంటూ వెక్కిరించిన వైనం. అవును, అప్పటికీ గ్రామాల్లో కరెంటు కోతలు భాగ్యనగరంలో పవర్ హాలిడేల పరిస్థితి. దీనితో ఎట్లా నా తెలంగాణ భవిష్యత్తు అన్న పరేషాన్లో తెలంగాణ ప్రజానీకం. ఏం మంత్రం వేశారో ఏమో తెలియదు, రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడవక ముందే కరెంటు కష్టాలు రూపుమాపారు తెలంగాణ బాపు కేసీఆర్. అనతికాలంలోనే కలలో కూడా ఊహించని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ప్రకటనతో సంచలనం సృష్టించారు. నాటి నుంచి నేటి వరకు పల్లెల్లో, పట్టణాల్లో రెప్పపాటు కాలం కూడా కరెంటు కోత లేకుండా తెలంగాణను యావత్ భారతావనికి టార్చ్‌బేరర్‌గా మార్చిన కేసీఆర్ సంకల్పంలో తనదైన పాత్ర పోషిస్తున్నది సింగరేణి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ(జైపూర్). 2016 సెప్టెంబర్ నెలలో ఈ సంస్థ ప్రారంభమైంది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఆంధ్రా ప్రాంతానికి, తెలంగాణకు భిన్నమైన పరిస్థితులు. కాలువ కింది పారకంలో ఆంధ్రాలో లక్షలాది ఎకరాలు పంట పండుతుండగా తెలంగాణ ప్రాంతంలో నూటికి 90 శాతం బోరుబావులు కరెంటు బావుల కింద సాగయ్యేవి. కరెంటు ఉంటే కానీ పంట పండని పరిస్థితి. అందునా రైతులు ఎక్కువగా సాగుచేసే వరికి సాగునీరు అందించేందుకు కరెంటే కీలకం. వానకాలం ఏదోలా గట్టెక్కినా యాసంగిలో రైతన్నలకు నానా తిప్పలు తప్పేవి కావు.
ఇగ ఊళ్లల్లో పొద్దున ఆరింటికి పోయిన కరెంటు మల్ల మాపటీల ఆరు దాటినంక వస్తే అదే అదృష్టం. రాజధాని హైదరాబాద్ నగరంలో పరిశ్రమలదీ అదే పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రం చివరి రోజుల్లో ఏకంగా వారంలో నాలుగు రోజులకు పైగా పవర్ హాలిడే. ఎన్నో పరిశ్రమలు మూతపడి వేలాది మందికి ఉపాధిని దూరం చేశాయి.
ఇక ఎట్టకేలకు ఆరు దశాబ్దాల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరి స్వరాష్ట్ర సాధన చేరువైతున్న వేళ నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం వస్తుందని సంబురపడగానే కాదు కరెంటు లేక చీకటి తెలంగాణగా మారుతుందంటూ చేసిన ఎకిలి ప్రకటన యావత్తు తెలంగాణను ఆలోచనలోకి నెట్టాయి. కానీ రాష్ట్ర అవతరణ అనంతరం ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ అద్భుతాన్ని సృష్టించారు. ఆరు నెలలు తిరగకుండానే కరెంటు కోతలు లేని తెలంగాణను సాధించారు. పవర్ హాలిడేలకే హాలిడే. ఎవరూ ఊహించని విధంగా వ్యవసాయానికి సైతం 24 గంటల ఉచిత విద్యుత్తు ప్రకటన చేసి అమలు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కరెంటు కష్టాలు అంటూ ఎటకారం చేస్తున్న నాడే ఏముంది ఛత్తీస్‌గఢ్ నుంచి రెండు పుల్లలేసి కరెంటు పట్టుకు రావచ్చంటూ నాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చేసిన ప్రకటన రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఒక మాయ లాగా ఎవరూ ఊహించనివిధంగా సుసాధ్యం చేసి చూపించారు. ఇతర రాష్ర్టాల నుంచి ముందస్తు ప్రణాళికలతో రాష్ర్టానికి అవసరం మేర విద్యుత్తు కొనుగోలు చేశారు. భవిష్యత్తు ప్రణాళికలుగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే కొత్త విద్యుత్తు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు ద్వారా విద్యుత్తు విషయంలో దేశానికే ఒక దిక్సూచిలా తెలంగాణను తీర్చిదిద్దారు.
తెలంగాణ ప్రజానీకానికి కరెంటు కష్టాలను దూరం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంలో సింగరేణి సైతం తన పాత్ర పోషిస్తున్నది. 2010లోనే ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పునాదులు పడ్డా మందకొడిగా సాగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రత్యేక దృష్టిపెట్టి పనులు వేగవంతం చేశారు. 2016 సెప్టెంబర్‌లో 1200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) ప్రారంభమైంది. 2016 నుంచి విద్యుత్తు ఉత్పత్తి ద్వారా సింగరేణి సంస్థకు ఏటా రూ.500 కోట్లకు పైగా లాభాలు ఆర్జిస్తూ పర్యావరణహిత విద్యుత్తు ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందుతున్నది జైపూర్ పవర్ ప్లాంట్. దేశవ్యాప్తంగా ఉన్న 250కి పైగా థర్మల్ పవర్ ప్లాంట్లలో నంబర్‌వన్ స్థానంలో నిలుస్తూ వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నది. ఇప్పటికే 1200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కెపాసిటీతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు వినియోగంలో 12 శాతంపైగా సమకూరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. దీనిద్వారా ఎస్టీపీపీ కెపాసిటీ 2000 మెగావాట్లకు చేరుకోనున్నది.
ప్రారంభం నాటినుంచి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో మొదటి స్థానంలో నిలుస్తూ.. రాష్ట్ర అవసరాలకు 12 శాతం విద్యుత్తును సమకూరుస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ అవార్డులు సాధిస్తూ.. దేశంలోని 250 పైగా విద్యుత్తు ఉత్పత్తి సంస్థల్లో అగ్రస్థానంలో కొనసాగుతూ… థర్మల్ విధానంలోనే కాక సోలార్ విధానంలోనూ మరింత విద్యుత్తును రాష్ట్ర అవసరాలకు సమకూర్చేలా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నది తల్లి సింగరేణి.
– ప్రదీప్‌రావు ఎరబెల్లి 99660 89696