ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల రెండవ తేదీన వేసిన సూటి ప్రశ్నలకు ప్రధానమంత్రి మోదీ నుంచి కనీసం ఒక్క సమాధానమైనా రాకపోవటంపై వారం రోజులు గడిచిన తర్వాత కూడా ప్రజలలో చర్చ జరుగుతున్నది. జవాబులు లేకపోవటానికి కారణం ఏమిటన్నదానిపై మొదట రకరకాల ఊహాగానాలు సాగాయి. బీజేపీ వారు కొన్ని వాదనలు ఏవో ముందుకుతెచ్చి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. కాని చివరకు, ప్రధాని వద్ద అసలు అందుకు జవాబులు లేవని, కనుకనే ఏమీ చెప్పలేదని, మునుముందు అయినా చెప్పలేరు కూడానని అందరికీ అర్థమవుతున్నది.
జకీయ దురంధరుడు, మహావక్త అని పేరు తెచ్చుకున్న నరేంద్ర మోదీ గత ఎనిమిదేండ్లలో తన విధానాలు, పరిపాలన, రాజకీయాల గురించి అనేకానేక తీవ్రమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ప్రతిపక్షాల నుంచి, ఇతర విమర్శకుల నుంచి. వాటిలో తను స్వయంగానో, తన మంత్రులో, పార్టీ ప్రతినిధులో కొన్నింటికి జవాబులిచ్చారు. కొన్నింటికి ఇవ్వలేదు. కొన్నింటిపై పొసగని వాదనలేవో చేశారు. కాని, నిండు మొహంపై అరచేతితో బలంగా చరిస్తే దిగ్భ్రాంతి పడినట్లు నిలిచిపోయిన ఇటువంటి సందర్భం గత ఎనిమిదేండ్లలో మరొకటి కనిపించదు. దీన్ని మోదీ తన జీవితంలో మరిచిపోలేరు.
కేసీఆర్ ప్రశ్నల శక్తి ఎక్కడున్నది? వాటిలో రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలనే సమగ్ర దృష్టి ఉన్నది. అందులో తక్షణ అంశాలతో పాటు దీర్ఘకాలిక విషయాలున్నాయి. రొటీన్ పద్ధతి రాజకీయ విమర్శలు గాక, నికరమైన సమస్యల ప్రస్తావన ఉంది. స్పష్టమైన వైఫల్యాలను దృష్టికి తేవటం ఉన్నది. ఇదంతా టీఆర్ఎస్ అధినేత ఏ విధంగా చేశారు? తన ప్రశ్నలతో పాటు ఇది కూడా మనం గమనించి, గ్రహించవలసిన విషయమే. ఒక వ్యక్తి తన ప్రశ్నలను స్థిరమైన విగ్రహం, స్థిరచిత్తం, స్థిరమైన వాగ్ధారతో వేయటం- ఆ ప్రశ్నల వెనుక గల ఆలోచనా శుద్ధికి, చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. అదంతా ఆ రోజున కేసీఆర్ తీరులో కనిపించింది. తనపట్ల వ్యతిరేకతను పెంచుకున్నవారికి ఇందులో అతిశయోక్తి తోచవచ్చు గాని, నాటి ప్రసంగపు వీడియోను నిర్వికారంగా గమనించినట్లయితే ఈ మాటతో ఏకీభవించవలసి ఉంటుంది. విషయమేమంటే, ఇటువంటి తీరువల్ల కేసీఆర్ ప్రశ్నలకు అదనపు బలం చేకూరింది. చివరిది తన భాషాపటిమ. ఉత్తరాది వారు సైతం ఆశ్చర్యపోగల పటిమ అది. వీటన్నిటి జమిలి ప్రభావమే శ్రోతలపై పడింది. కేసీఆర్ గురించి చివరన యశ్వం త్ సిన్హా చేసిన ప్రశంసకు కారణం ఆయనకు తన మద్దతు అవసరం కావటం వల్లనేనని భావిస్తే పొరపాటవుతుంది. సంకుచిత అభిప్రాయమవుతుంది. ఆయనకు కేసీఆర్ పట్ల విస్తృతమైన అవగాహన కలగటమే అందుకు కారణమనేందుకు సందేహించనక్కరలేదు.
ఇపుడు కేసీఆర్ ప్రశ్నల్లో కొన్నింటిని మాత్రమే చూద్దాం. ఆయనను ఇంతకాలం విమర్శించిన సినిక్స్లో సైతం పలువురు ప్రశంసిస్తున్న ఆ ప్రశ్నలు, వాటి వైవిధ్యత, సూటిదనం ఎటువంటివి? అదానీ కంపెనీకి టెండర్తో పనిలేకుండా విద్యుత్ కేంద్రం కట్టబెట్టేటట్లు శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణకు మోదీ జవాబెందుకు ఇవ్వటం లేదు? మన దేశంలోని బొగ్గును కాదని, అదానీ కంపెనీ దిగుమతి చేసుకునే విదేశీ బొగ్గును కొనితీరాలంటూ మన విద్యుత్ సంస్థలపై ఒత్తిడి చేయటం ఎందుకు? లక్షల కోట్ల బ్యాంకు ధనంతో పారిపోయిన బీజేపీ మిత్రులను ఎందువల్ల పట్టి తేరు? రూపాయి విలువ ఇంత వేగంగా ఎందుకు పతనమవుతున్నది? విదేశాల్లోని నల్లధనం రప్పించటం, అందరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేయటం మాట ఏమైంది? మోదీ పార్టీ మతతత్వ చర్యల వల్ల అంతర్జాతీయంగా ఎంత అప్రతిష్ఠ కలిగినా ఏమీ చేయరెందుకు? చైనా కొత్తగా ఆక్రమించిన భూ భాగాల మాటేమిటి? ఇటువంటివి అంతర్జాతీయంగా భారతదేశ ప్రయోజనాలు, ప్రతిష్ఠకు సంబంధించిన విషయాలు. వీటిలో ఒకటి రెండు కేసీఆర్ రెండవ తేదీ ప్రసంగంలో గాక అంతకుముందు ప్రస్తావించి ఉండవచ్చు గాక. కానీ, ఈ సందర్భంలో అవి కూడా ప్రజల మనసులోకి వస్తున్న జవాబు లేని ప్రశ్నలవుతున్నాయి. మోదీ వద్ద జవాబులు ఉండి ఇవ్వకపోవటం కాదు, ఆయన వద్ద అవి లేవసలు.
అభివృద్ధి, సంక్షేమం విషయాలకు వస్తే, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయగలమన్న ప్రకటన ఏమైనట్లు? మేక్ ఇన్ ఇండియా అనే అట్టహాసపు లక్ష్యం ఎందువల్ల విఫలమైంది? ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ సృష్టించగలమనే మాట ఎందుకు ముందుకు కదలటం లేదు? చైనా 16 ట్రిలియన్ డాలర్లకు దూసుకుపోగా మనం కేవలం మూడు ట్రిలియన్ల వద్ద ఎందుకు ఆగాము? గ్యాస్ సిలిండర్ ధర ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా ఎందుకు పెంచారు? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? చరిత్రలోనే ఎపుడూ లేనంత నిరుద్యోగ స్థితి ఎందుకు ? 2022 కల్లా అందరికీ ఇండ్లు ఏమైంది? అన్ని అభివృద్ధి సూచీలలో మన దేశం.. మోదీ పాలన ఎనిమిదేండ్లలోనూ వరుసగా పతనమవుతున్నది ఎందువల్ల? ఇవే విషయాలు ఆయన పదవ తేదీన తిరిగి ప్రస్తావించారు.
వీటితోపాటు ఇతర ప్రశ్నలకు ఆ మరునాడు మూడవ తేదీన ఇదే హైదరాబాద్ నగరంలో చేయనున్న ప్రసంగంలో సమాధానం ఇవ్వాలని ప్రధానమంత్రిని కేసీఆర్ సూటిగా సవాలు చేశారు. ఒకటికి నాలుగుసార్లు. కాని మరునాడు మోదీ కంచుకంఠం నుంచి జవాబులకు బదులు నిశ్శబ్దం ప్రతిధ్వనించి అందరినీ నిరాశపరిచింది. తనవద్ద సమాధానాలే లేనపుడు ఆయన అంతకన్న ఏమి చేయగలరు గనుక.
ఇదే హైదరాబాద్ నగరంలో చేయనున్న ప్రసంగంలో సమాధానం ఇవ్వాలని ప్రధానమంత్రిని కేసీఆర్ సూటిగా సవాలు చేశారు. ఒకటికి నాలుగుసార్లు. కాని మరునాడు మోదీ కంచుకంఠం నుంచి జవాబులకు బదులు నిశ్శబ్దం ప్రతిధ్వనించి అందరినీ నిరాశపరిచింది. తనవద్ద సమాధానాలే లేనపుడు ఆయన అంతకన్న ఏమి చేయగలరు గనుక.
– టంకశాల అశోక్