విద్యతోనే మెరుగైన సమాజం సాధ్యమవుతుందని మాజీ ప్రధానమంత్రి భారతరత్న పీవీ నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఆనాడు గురుకుల పాఠశాలలకు పునాదివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కృషి చేశారు. 1971లో నల్లగొండ జిల్లా సర్వేల్లో తొలి ప్రభుత్వ గురుకుల పాఠశాలను స్థాపించారు. ఇది దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన తొలి రెసిడెన్షియల్ స్కూల్. పీవీ స్ఫూర్తితో సర్వేల్లో సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి దానం చేసిన సుమారు 44 ఎకరాల భూమిలో ఈ పాఠశాల ఏర్పడింది.
పీవీ హయాంలో సర్వేర్లో గురుకుల పాఠశాల ఏర్పాటు అనంతరం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఆర్ఈఐఎస్) ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించారు. దాంతో తెలంగాణలో సర్వేల్, ఆంధ్రాలో తాడికొండ, రాయసీమలో కొడిగెనహళ్లి వంటి పాఠశాలలు జీవం పోసుకున్నాయి. పేద, గ్రామీణ, వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలకు సమానమైన విద్యను ప్రభుత్వమే అందించాలనే ఆలోచన పీవీది. తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా ఏర్పడిన జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలల ఏర్పాటుకు పీవీ ఆలోచనలే ప్రేరణగా నిలిచాయి. నేడు తెలంగాణలో వేలాది మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదిగారంటే గురుకుల విద్యా సంస్థలు వేసిన బలమైన పునాదే కారణం.
ఆ తర్వాత అంతటి స్థాయిలో గురుకులాలు, ప్రభుత్వ బడుల విద్యా వ్యవస్థను పటిష్టం చేసింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పాఠశాలలో కల్పించాల్సిన వసతులపై దృష్టిసారించడమే కాకుండా.. నిధులు కేటాయించి దశలవారీగా మాడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దే ప్రక్రియ యుద్ధప్రాతిపదికన జరిగింది. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని అసమర్థ పాలన ఇప్పుడు కొనసాగుతున్నది. ప్రభుత్వ బడులను పటిష్టం చేయాల్సిందిపోయి ఏకంగా మూసివేయాలని సీఎం ప్రకటించడం సమాజ వికాసానికి నిజంగా గొడ్డలి పెట్టు లాంటిదే. విద్యను కేవలం బోధనగా కాకుండా సామాజిక సమానత్వం, సాధికారత, పేదరిక నిర్మూలనకు సాధనంగా భావించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి గానీ, ఉన్నవాటిని మూసివేస్తానంటే ఎలా..? విద్యార్థులు లేరన్న సాకుతో రాష్ట్రంలోని దాదాపు 27,000 పాఠశాలల్లో 23,000 పాఠశాలలను మూసివేసి, కేవలం నాలుగు వేల పాఠశాలల ద్వారానే విద్యాబోధన చేస్తానంటే ఇది ఎలా సాధ్యం.
ప్రభుత్వ బడులను మూసివేయడం ద్వారా పేద విద్యార్థులపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను అన్వేషించకుండా పాఠశాలలనే మూసివేయడం సరైన విధానం కాదు. పాఠశాలల మూసివేత వల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ బలహీనపడుతుందని తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నది. ఒకప్పుడు ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్య… ఇలా ముగ్గురు మంత్రులు బాధ్యతలను పర్యవేక్షించి ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేసేవారు. కానీ ఇప్పుడు మూడు శాఖలకు ఒక మంత్రి కూడా లేకపోతే విధానపరమైన నిర్ణయాలు ఎలా జరుగుతాయి. ఏదైతేనేం… సమాజ వికాసానికి ఆయువుపట్టు అయిన సర్కారీ బడులు అనే పచ్చని చెట్లను నరికివేసే పనినే తాము చేపడుతామని భీష్మించుకుని కూర్చుంటే మాత్రం ఈ ప్రభుత్వం తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు.
– సురభి వాణీదేవి