హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ కవల పిల్లలు. కవలల్లో ముందు పుట్టిన వాడు పెద్దవాడని, తరువాత పుట్టినవాడు చిన్నవాడని మన భావన. ధర్మశాస్త్రం ఇందుకు విరుద్ధంగా చెబుతుంది. ముందుగా తయారైన పిండం అంటే పెద్దవాడు, గర్భాశయం వెనక్కి నెట్టివేయబడతాడు. తరువాత తయారైన పిండం అంటే చిన్నవాడు, గర్భాశయ ద్వారానికి సమీపంగా ఉంటాడు. తల్లి ప్రసవించిప్పుడు గర్భద్వారానికి దగ్గరగా ఉన్న చిన్నవాడు ముందు పుడతాడు. పెద్దవాడు తరువాత పుడతాడు. ఆ పద్ధతిలో హిరణ్యాక్షుడు ముందుపుట్టాడు, హిరణ్యకశిపుడు వెనకాల పుట్టాడు. హిరణ్యాక్షుడు చిన్నవాడు, హిరణ్యకశిపుడు పెద్దవాడు.
భూమిని చాపగా చుట్టి లోకాలను పీడిస్తున్న హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి సంహరించాడు. తమ్ముడిని చంపినవాడు తనకు శత్రువు. శత్రు సంహారం సోదరుడిగా తన కర్తవ్యం అని భావించాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ సాక్షాత్కారం పొందాడు. బ్రహ్మ నుంచి దాదాపుగా మరణం లేని వరాన్ని పొందాడు హిరణ్యకశిపుడు. వర గర్వంతో మిడిసిపడ్డాడు. ఇక విష్ణుమూర్తి దొరకడమే తరువాయి తన చేతిలో చచ్చాడన్నమాటే అనుకున్నాడు. ముల్లోకాలు గాలించినా విష్ణువు జాడ కనిపెట్టలేకపోయాడు. పిరికివాడు తనకు దొరకకుండా పారిపోయాడని భావించాడు. అసంతృప్తితో కూడిన ఆనందం లభించింది హిరణ్యకశిపుడికి.
హిరణ్యకశిపుడి శత్రువు అతని కొడుకు ప్రహ్లాదుడి రూపంలో పుట్టుకొచ్చాడు. విష్ణుభక్తి పరాయణుడయ్యాడు తనయుడు. నయానా భయానా లొంగలేదు. శత్రువుపై కోపంతో కొడుకుపై ద్వేషాన్ని పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడి ప్రాణాలు తీయడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయినాయి. చివరికి తన కొడుకును తానే చంప పూనుకున్నాడు.
‘విష్ణువు విష్ణువు అని కలవరిస్తున్నావు. ఎక్కడున్నాడో చూపించు. లేదా నువ్వు నా చేతిలో చచ్చావే!’ అన్నాడు హిరణ్యకశిపుడు. కనపడ్డ విష్ణువును కనబడ్డట్టుగా చంపేయగలనని అనుకున్నాడు.
‘ఇందుగలడందు లేడనుసందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదికి చూచినఅందందే గలడు దానవాగ్రణి వింటే!’ అన్నాడు ప్రహ్లాదుడు.
విష్ణువు సర్వవ్యాపి. అంతటా నిండి ఉన్నవాడు చర్మచక్షువులకు కనబడడు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటే తప్ప విష్ణువు సర్వత్రా వ్యాపించి ఉండలేడు. ప్రహ్లాదుడి జ్ఞానచక్షువులకు విష్ణువు కనబడుతున్నాడు. హిరణ్యకశిపుడు చర్మచక్షువులతో చూస్తున్నాడు. ఆ రాక్షసుడి అజ్ఞానం తొలగిపోవాలంటే విష్ణువు అతని కంటికి కనబడాలి.
‘ఈ స్తంభమునందు ఉన్నాడా’ కొడుకును అడిగాడు తండ్రి. ఉన్నాడన్నాడు కొడుకు. గదతో స్తంభాన్ని పగులకొట్టాడు హిరణ్యకశిపుడు. స్తంభం నుంచి వెలువడ్డాడు ఉగ్ర నరసింహుడు. భయ సంభ్రమాల నుంచి తేరుకోకుండానే పరమపదించాడు హిరణ్యకశిపుడు.
జ్ఞానచక్షువులు కలిగిన వారు అవాఙ్మానస గోచరుడైన పరమాత్మను ప్రహ్లాదుడిలా జీవించి ఉండగానే నిరంతరమూ దర్శిస్తూ ఉండగలరు. తమోగుణ ప్రధానులైనవారు కర్మవశాన అజ్ఞానం నశింపనున్న సమయంలో దైవ దర్శనాన్ని పొందుతారు.
‘మనిషి చేత, జంతువు చేత లేదా అస్త్రశస్ర్తాల వల్ల చావు రాకూడదు. ఇంటా బయటా, రాత్రీ పగలు, నేల మీద, ఆకాశంలో మరణం సంభవించకూడదు’ ఇదీ హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి పొందిన వరం. విష్ణుమూర్తి ఆ నిబంధనలన్నిటికీ లోబడి హిరణ్యకశిపుడిని అంతమొందించాడు. కోరుకున్న వరాల కారణంగానే ఆ దానవేంద్రుడు అంతటి బీభత్సభరిత మరణాన్ని పొందాడు.మనం కోరుకొన్న ప్రకారమే మన జీవితం ఉంటుంది. మరణమూ ఉంటుంది. కాకపోతే మనం కోరుకుని ఉన్నామన్న సంగతి మనకు తెలియదు లేదా మరచిపోయాము అంతే!
వరిగొండ కాంతారావు
94418 86824