రేవంత్‌రెడ్డి రాజకీయ ఎదుగుదల తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. 2007 నుంచి పదేండ్ల పాటు ఆయన అదే పార్టీలో కొనసాగుతూ వివిధ పదవులు చేపట్టారు. తెలంగాణ వచ్చాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ తరఫున కొడంగల్‌లో నిలబడి గెలిచారు. అసెంబ్లీలో అదే పార్టీకి ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2015 మే నెలలో కూలదోసేందుకు ఎమ్మెల్సీ కొనుగోలు అభియోగంపై ఆయన అరెస్టు అయ్యారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరిగిందనడానికి ఆడియో సాక్ష్యాలు దొరికాయి. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య సంబంధాలు బాగా లేవు. ఈ కేసు నేపథ్యంలో ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే క్షేమం కాదని చంద్రబాబు ఆలోచించి రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి పంపారు.
రేవంత్, చంద్రబాబుల మధ్య ఉన్న గురుశిష్యుల బంధం వారి వ్యక్తిగతానికే పరిమితం కావాలి. అంతేతప్ప, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించకూడదు. అయితే రెండు తెలుగు రాష్ర్టాలు తన చేతిలోనే ఉన్నాయన్నట్టు చంద్రబాబు సరళి కనిపిస్తున్నది. జూలై 6న ఫూలే భవన్‌కు వచ్చిన బాబుకు దక్కిన స్వాగతం చూస్తే.. ఓ ప్రైవేటు కంపెనీ బాస్ సందర్శనకు వస్తే ఉద్యోగులంతా వినమ్రతను ప్రదర్శించినట్టుంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం మామూలు విషయమే. అదీ మరో పార్టీకి చెందినవారైతే సాధారణంగా పట్టించుకోరు. రాష్ట్ర పునర్విభజన చట్టం, 2014లో మిగిలిపోయిన అంశాల గురించి చర్చించేందుకేనని చంద్రబాబు చెప్పి మరీ హైదరాబాద్‌కు వచ్చారు.
నిజానికి, ఆ అంశాల గురించి తేల్చుకునేందుకు రెండు రాష్ర్టాల అధికారులు చాలు. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు తొలిసారిగా జూలై 5న హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీ, గజమాల, టీడీపీ వర్గాల హంగామా తెలంగాణ ప్రజలను ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ వీధుల్లో మళ్లీ ‘జై టీడీపీ, జై జై బాబు’ నినాదాలు ఏమిటని స్థానికులు విసుక్కున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే మామూలుగానే వచ్చిపోవచ్చు. కానీ, ‘శిష్యుని పాలనలో తెలంగాణలో తన లెవల్ చూడండి’ అన్నట్టు విపక్షాలకు, తెలంగాణవాదులకు సవాలు విసిరినట్టుగా ఆయన ధోరణి కనబడింది.
తెలంగాణపై చంద్రబాబు పెత్తనాన్ని రుజువు చేసే సంఘటన మరొకటి ఈ నెల 20న జరిగింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద వంద అడుగుల ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు సీఎం రేవంత్ అనుమతి ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలని ఎన్టీఆర్ నాలెడ్జి సెంటర్ భావించింది. అందులో తప్పేం లేదు. అయితే, ఆ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడమే మింగుడుపడని విషయం. ఎన్టీఆర్ లిటరరీ కమిటీ, ఆయన కుమారుడు మోహనకృష్ణ, మంత్రి తుమ్మల తదితరులు సీఎంను కలిసి స్థలం కావాలని కోరగా.. అందుకు రేవంత్ అంగీకరించారు. ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ కాకుండా మరెవరున్నా ఇందుకు ఒప్పుకొనేవారు కాదు. ఈ నిర్ణయం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం. చంద్రబాబు పంపారు, రేవంత్ జీ హుజూర్ అన్నారు అన్నట్టు ఉంది ఈ తతంగమంతా.
అసలు తెలంగాణతో ఎన్టీఆర్‌కు సంబంధమేంటి? ఆయన విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం ఎందుకు ఇవ్వాలి? రాష్ట్రం ఒక వ్యక్తిది కాదు. ఈ విషయంలో మిగతా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ పెద్దల అభిప్రాయమేమిటి? అనేది బహిరంగ చర్చకు రావాలి. ఉమ్మడి ఏపీ సీఎంగా ఎన్టీఆర్ తెలంగాణ కోసం ప్రత్యేకంగా చేసిన మేలు ఏమీ లేదు. ‘తెలంగాణ ప్రజలు మా కన్నా తక్కువే’ అనే భావన, ఆంధ్రా పెత్తనం ఆయనలోనూ ఉండేది. ట్యాంక్‌బండ్ వద్ద విగ్రహాల ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగింది. 34 విగ్రహాల్లో 10 మంది కూడా తెలంగాణకు చెందినవారు లేరు. విగ్రహాల ఎంపిక సందర్భంగా మరి కొందరు తెలంగాణవారి పేర్లను సూచిస్తే ఎన్టీఆర్ తిరస్కరించారని జయశంకర్ సార్ ఓ పుస్తకంలో రాసినట్టు తెలుస్తున్నది.
ఇప్పటికే ఖమ్మంలోని లక్కవరం చెరువు వద్ద ఎన్టీఆర్ భారీ విగ్రహ స్థాపన జరిగింది. గతేడాది హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో ప్రభుత్వ అనుమతి లేకుండానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు వెళ్తే టీడీపీ కార్యకర్తలు అడ్డగించారు. చంద్రబాబు పాలనాకాలంలో తెలంగాణవ్యాప్తంగా దాదాపు ఊరూరా ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఇవి ఉండగా కొత్తగా ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని తెలంగాణలో నెలకొల్పడం అవసరమా? ఆంధ్రా ప్రాంతానికి చెందిన పెద్దమనిషి విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పితే ఆ ఉత్సవాల్లో పాల్గొనేదెవరు? దాని ప్రభావం తెలంగాణపై ఎలా ఉంటుంది?
ఏదేదో సాకుతో ఆంధ్రుల ప్రతీకలు తెలంగాణలో పెరుగుతూ పోతే స్వీయ పాలనకు అర్థమేముంది? ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహానికి ప్రభుత్వ స్థలం కేటాయింపుపై తక్షణ నిరసన అవసరం. అంతగా ఏర్పాటు చేయాలనిపిస్తే ఎక్కడైనా స్థలాన్ని కొనుగోలు చేసుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భూముల ధరలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేర్చడానికి నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న దశలో విలువైన భూమిని ప్రభుత్వం ఎవరికీ ధారాదత్తం చేయకూడదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ఇలాంటి చర్యలను అందరూ కలిసికట్టుగా నిలదీయాలి.
– నర్సన్ బద్రి 94401 28169