మేం వద్దంటే పోరాటాలు చేశారు.. మేం వద్దంటే గోదావరి మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం వద్దంటే కృష్ణా మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం కష్టపడి దశాబ్దాల పాటు ఎప్పటికీ పూర్తి కాకుండా పెండింగ్ లో పడేస్తే.. వాటిని పూర్తి చేసుకున్నారు. మేం వద్దన్నా.. కూడదన్నా వ్యవసాయాన్ని పండుగ చేసుకున్నారు.. మాకంటే దండిగా పంటలు పండిస్తారా? ఎంత అహంభావం? మీరు రైతుబంధు ఇచ్చిన పాపానికి చచ్చినట్టు మేం ఇవ్వాల్సి వచ్చింది. హమ్మా!! మాకే పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తారా? ఒక విజనరీ విజన్‌నే ప్రశ్నించడానికి దుస్సాహసం చేస్తారా? మీరెట్లా ఉండాలో, ఎలా ఉండాలో, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు. తిండి తినటం కూడా రాని మిమ్మల్ని పైకి తీసుకువచ్చాం.. అలాంటి మాకు వ్యతిరేకంగా, మా పట్ల కృతజ్ఞత లేకుండా కేసీఆర్ అనే ఒకానొక నాయకుడు మిమ్మల్ని పక్కదారి పట్టించాడు. ఇదీ రాష్ట్ర విభజనకు శత్రువు, ప్రపంచ విజనరీ మనోగతం.
తెలంగాణలో సాగు బాగుపడి, ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ బాబు దండుగ అని నిర్లక్ష్యం చేసిన వ్యవసాయాన్ని ప్రత్యేక రాష్ట్రంలో పండుగ చేసుకున్నాం. కానీ ఇప్పుడు కూడా తమ బతుకులపై, భవిష్యత్తుపై, భావితరాలపై దృష్టి పెట్టకుండా తెలంగాణపై పడి ఏడుస్తున్నారు. వాళ్ల మనసులో ఇలా అనుకుంటున్నారని అనిపిస్తున్నది. అప్పుడే చెప్పాం.. ఇష్టం ఉన్నా.. లేకున్నా మాతోనే ఉండాలని హెచ్చరించాం. మమ్మల్ని కాదంటే మీకు రాళ్లూ రప్పలే దిక్కు అని భవిష్యత్తు కూడా చూపించాం. మీకు నీళ్లు రావాలో వద్దో మేం నిర్ణయిస్తాం.
మీరు వ్యవసాయం చేయాలో వద్దో కూడా మేమే చెప్తాం. మీరు వలసలు పోయి బతకడానికే కదా బొంబాయి బస్సులు వేసింది. అక్కడెక్కడికో పోయి బతక్క.. మళ్లా వెనక్కి వస్తారా? రాష్ట్రం సాధించుకొని, బరాజ్‌లు కట్టుకున్నారు.. చెరువులు, చెక్‌డ్యామ్‌లు నింపుకొన్నారు. మేం బయటకు వలసలకు పంపించినోళ్లను తిరిగి వెనక్కి తెప్పించుకున్నారు. అన్నింటికీ మించి మా దగ్గరి నుంచి కూలి పనికి మనుషులు వచ్చేలా చేశారు. ఎంత అహంకారం మీది. అని కుళ్లుకుంటున్నాడు ప్రపంచానికి ఐటీని పరిచయం చేసినట్టు చెప్పుకొనే స్వయం ప్రకటిత మేధావి.
అంతేనా.. మన బతుకులు బాగుపడితే చూడలేని బాబులు, బాబుల శిష్యులు మళ్లీ మన తెలంగాణపై పెత్తనం చెలాయిస్తున్నారు. కొట్లాడి రాష్ట్రం సాధించుకున్న ప్రజలపై కక్ష సాధించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. పట్టిపీడించడం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. జనాలను కష్టాల్లోకి నెట్టేసి ఇలా అనుకుంటున్నారు. ఇప్పుడేమైంది.. మీ బతుకులు మా పిడికిట్లో చిక్కుకున్నాయి. ఢిల్లీలో మావోడే ఉన్నడు. నీళ్ల శాఖలో కూడా మావోడినే పెట్టుకున్నం. మీ దగ్గర ఉన్నవాళ్లంతా మా తోలుబొమ్మలు. వారికి మేం ఎంత చెప్తే అంత.. మేం చెప్పకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోరు.
అంతటి విధేయులు. మీ నీళ్ల శాఖలోనూ మావోళ్లందరినీ చొప్పించాం. భలే ఉన్నది కదా.. మా ఆట. ఇప్పుడు నీళ్ల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఏం జరుగుతున్నదో కూడా తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మేం నడిపిస్తున్న డ్రామాను చూస్తూ ఉండండి. గోదావరి మీద మీరు కట్టుకున్న ప్రతీ ప్రాజెక్టు అనుమతినీ రద్దు చేపిస్తాం. కృష్ణా మీద ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండ చేస్తం. మీకు నీళ్లు ఎట్లా వస్తయో చూస్తం. ఒక్క చుక్క కూడా రాకుండా చేస్తం. ఎవరన్నా అడిగితే.. పాపం గడ్డమీదున్నరు.. వాళ్లకు నీళ్లెట్ల వస్తయి అని సన్నాయి నొక్కులు కూడా నొక్కుతాం. నీళ్లు లేవు.. వ్యవసాయం లేదు.. మీకేదీ అక్కరలేదు. నోరుమూసుకుని పడి ఉండండి.. మేం చెప్పినట్టు నడుచుకోండి.. మీకు నీళ్లు అవసరం లేదు.
వ్యవసాయం వద్దు. వలసలు మీకు ఇంతకుముందే అలవాటు చేశాం కదా.. కొత్తేమీ కాదు.. కావాలంటే మావోళ్లకు చెప్పి నాలుగు బస్సులు, రైళ్లు వేయిస్తాం పొండి. మళ్లీ తిరిగి వచ్చారా తస్మాత్ జాగ్రత్త! తిండి కావాలంటే నాలుగు మెతుకులు పడేస్తాం.. తినండి. నూకలు తిని బతకండని మావోడు ఢిల్లీలోనే చెప్పాడు కదా.. అప్పుడే మర్చిపోయారా? ఎప్పుడన్నా వానలు పడితే.. ఏమన్నా పండించుకోండి. అంతేకానీ, ప్రాజెక్టులు, నీళ్లు, వ్యవసాయం అని అన్నారో.. మా తడాఖా చూపిస్తాం. ఇట్లాంటి బాబులను, బాబులకు ఊడిగం చేసే బానిసల గుట్టుమట్టు తెలుసుకొని మసలుకోవాల్సి ఉన్నది. అదనుచూసి ఓటు అనే కర్రుకాల్చి వాతపెట్టాల్సిన చైతన్యం ప్రదర్శించాల్సి ఉన్నది.
(తెలంగాణ మీద చంద్రబాబు అక్కసుపై వ్యంగ్యాస్త్రం)
-కోవెల సంతోష్ కుమార్