వారికి తెలంగాణపై కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆశలు కలుగలేదు. ఆశల మాట అట్లుంచండి, ఇటు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఆ విధమైన సాహసాలు, ఆశలు ఇక్కడ రేవంత్‌రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలయ్యాయి. ఆయన పాలనను ఏడాది పాటు చూసిన వెనుక రెండవ సంవత్సరం నడుస్తుండగా. ఇక్కడ రెండవ సంవత్సరం వచ్చేసరికి అటు ఏపీలో చంద్రబాబు తిరిగి అధికారానికి వచ్చి కుదురుకోవటం మొదలైంది. ఆ విధంగా అక్కడి శక్తులకు, ఇక్కడి శక్తులకు కలిసి, రేవంత్ రెడ్డి కాలం తమకు తగిన అదనుగా తోస్తున్నది. దానితో ఇరువురు కలిసి, తెలంగాణను పరోక్షంగా తమ అదుపులోకి తీసుకునేందుకు వ్యూహరచన చేసి అమలు జరుపుతున్నారు. తెలంగాణలోని చంద్రబాబు అనుకూల మీడియా ఇందులో తన పాత్ర తాను పోషిస్తున్నది.
ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. ఈ తరహా ఆశలు, వ్యూహాలు చంద్రబాబు వర్గాన్ని కేంద్రంగా చేసుకొని వారి చుట్టూ తిరుగుతున్నవే. అక్కడి సామాన్య ప్రజలలో ఇటువంటి ఆలోచనలు కనిపించటం లేదు. అట్లాగే, కోస్తాంధ్ర ప్రాంతాన్ని మినహాయిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు, గోదావరి సీమలోనూ దీనితో మమేకత ఏమీ లేదు. అనగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఏ వర్గాలైతే శతవిధాలా వ్యతిరేకించి విఫలమయ్యాయో, తిరిగి వారికే ఈ ఆశలన్న మాట. ఒకసారి ఉద్యమకాలానికి వెళ్లి చూద్దాం. అప్పుడు ఇదే వర్గం తెలంగాణ ఏర్పాటును మనసా వాచా కర్మణా వ్యతిరేకించింది. అందుకు కారణం వారి ప్రయోజనాలని తెలిసిందే గనుక తిరిగి చెప్పుకోనక్కరలేదు. అయితే, వారి తరహా ప్రయోజనాలేవీ లేని ఉత్తరాంధ్ర, గోదావరి, రాయలసీమ వాసులు చివరికి కోస్తాంధ్రకు చెందిన బడుగు బలహీన వర్గాలవారు కూడా ఆ వ్యతిరేకతలో భాగం కాలేదు. అక్కడ సృష్టి అయిన సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం దోపిడీదారులైన ధనిక వర్గాల వారిదని వారికి అవగాహన కలిగింది. కనుకనే ఆ ఉద్యమంలో వారు భాగస్వాములు కాలేదు. అయినా, పాలకులకు, ధనికులకు రకరకాల బలాలు ఉంటాయి గనుక వాటిని ఉపయోగించి కృత్రిమ ఉద్యమపు గాలి బుడగ ఒకటి సృష్టించి, కొద్దికాలం కృత్రిమంగా నడిపారు. ఆ బుడగలోని గాలి త్వరలోనే దిగిపోతూ చివరికి పేలిపోయింది. ఇదంతా నా పర్యటనలలో కండ్లారా చూసిన విషయం.
అంతేకాదు. తెలంగాణ ఏర్పడితే తమ పరిస్థితి ఏమిటని ఆంధ్ర ప్రాంతంలోని వారికి, అంతకన్న ఎక్కువగా అప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాలలో నివసిస్తున్న వారికి కొద్ది సంశయాలు ఏమైనా ఉంటే, అవి కేసీఆర్ పాలన మొదలైన స్వల్పకాలంలోనే సమసిపోయాయి. ఆ సమాచారాలు ఆంధ్ర జిల్లాలకు రోజువారీగా చేరుతుండేవి. దీనంతటిలోని ఒక విశేషం, ఇక్కడి ఆంధ్రులకు, అక్కడి ఆంధ్రులకు కూడా కేసీఆర్ పాలన పట్ల ఆశ్చర్యంతో కూడిన సదభిప్రాయం కలగటం. తమకు కూడా అటువంటి పాలకుడుంటే బాగుండును కదా అనే మాట సర్వ సాధారణంగా మారింది. అప్పటికి కేసీఆర్ మొదటిసారి ప్రభుత్వాన్ని నడుపుతుండగా, ఆంధ్రలో నడుపుతున్న నాయకుడు ఉద్ధండునిగా ప్రచారం పొందిన అనుభవజ్ఞుడు. ఈ విధమైన తేడాల వల్లనే ఆంధ్ర ప్రజలు రెండవ ఎన్నికలో చంద్రబాబును చిత్తుగా ఓడించి తెలంగాణలో కేసీఆర్ పార్టీకి మూకుమ్మడిగా ఓటు వేశారు. మొన్న మూడవసారి సైతం, చంద్రబాబు పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా హైదరాబాద్ ఆంధ్రులంతా కేసీఆర్‌ను బలపరిచారు.
ఈ విధమైన ఉద్యమకాలం నేపథ్యాన్ని, వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యాన్ని సమీక్షిస్తే అర్థమయ్యేదేమిటి? మొదట 1956లో తెలంగాణను ఆక్రమించిన వారు, తర్వాత నుంచి ఒప్పందాలను ఉల్లంఘించినవారు, ఉద్యమాలను అణచివేసినవారు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు ఈ ప్రాంతాన్ని అంతర్గత వలసగా మార్చుకొని దోపిడీ చేసినవారు, రాష్ట్రం రాకుండా శతవిధాల ప్రయత్నించినవారు, ఏర్పడిన తర్వాత సైతం విభజన సమస్యలను మిగిల్చి ఇబ్బందులు పెడుతున్నవారు, తమ పూర్వకాలపు అనుచరుడు రేవంత్‌రెడ్డి అసమర్థతను, విధేయతను ఉపయోగించుకుంటూ తెలంగాణను తమ పరోక్ష జాగీరుగా మార్చుకొనజూస్తున్న వారు అందరిదీ ఒకే జాతి, అదే వారసత్వం. మెర్కంటైల్ ఇంపీరియలిజం, భౌగోళిక వలసవాదం, సామ్రాజ్యవాదం, నయా వలసవాదం, ఆర్థిక-సాంకేతిక శాస్త్ర వలసవాదం, తర్వాత ట్రంప్ కాలపు టారిఫ్ వలసవాదం వలె, ఈ వర్గపు దోపిడీదారులు బహు రూపాలలో అవతరిస్తూ జాగీర్లు నడుపజూస్తుంటారు. కానీ, ఈ వర్గాల వెంట సామాన్య ప్రజలుండరు. ప్రస్తుతం చంద్రబాబు సాగిస్తున్న నయా జాగీర్ చాణక్యంలోనూ తన వెంట ఇక్కడి సామాన్య ఆంధ్రులు గాని, అభివృద్ధినీ, ప్రశాంత జీవనాన్ని, తెలంగాణ ప్రజలతో ప్రేమపూర్వక సంబంధాల కొనసాగుదలను కోరుకునేవారు గానీ లేరు.
ఆ విధంగా చంద్రబాబు ఒక ఒంటరి. ఇతరత్రా తన వర్గానికే చెందినప్పటికీ తన వలె ఆలోచించని వారు అనేకులు గనుక ఆ విధంగానూ ఒంటరి. తనతో చేయి కలిపితే వచ్చేదీ పోయేదీ లేదు గనుక ‘చేయి కలిపే చూద్దాము రామా హరీ’ అనుకునే సినిమా నట నాయకుని భాగస్వామ్య ప్రయోజనం శూన్యం గనుక అట్లానూ ఒంటరి. తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు నిప్పును ముట్టుకోవటమేనని బీజేపీకి తెలుసు గనుక ఆ విధంగానూ ఒంటరి. చివరికి తన వెంట నిజంగా నిలిచేది తన సామంత మీడియా మాత్రమే.
సామ్రాజ్యవాద చరిత్రలోనే కాదు, అంతర్గత వలసల చరిత్రలోనూ ఆసక్తికరమైన పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. దోపిడీదారులు తమ ఓటమిని ఓడిన తర్వాత కూడా అంగీకరించరు. ఆ కొత్త స్థితిని స్వీకరించి అందుకు అనుగుణంగా వ్యవహరించరు. తమ దోపిడీ ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. అందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తుంటారు. తమ వల్ల కలిగిన, కలుగుతున్న, కలగగల హానిని సదరు ప్రజలు గ్రహించినట్టు, దానిని ఎంతమాత్రం ఆమోదించటం లేదన్నట్టు తెలిసి కూడా తమ ప్రయత్నాలు ఆపరు. చంద్రబాబు విషయమే చూద్దాం. ఆయన ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించినపుడు, తర్వాత విభజన సమయంలో ఏమేమి చేశారన్న చరిత్ర అందరికీ తెలిసిందే గనుక ఇక్కడ గుర్తుచేయనక్కరలేదు. కాని విభజన చట్టంలో ఉన్న ప్రకారం తెలంగాణకు రావలసిన వాటికి, తర్వాత తను ఐదేండ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సమస్యలు సృష్టించారు. వాటిలో అనేకం ఈ పదకొండేండ్లు గడిచిన తర్వాత కూడా మిగిలే ఉండటాన్ని బట్టి ఆయన స్వభావం ఏమిటో గ్రహించవచ్చు. అదంతా చాలదన్నట్టు, ఏపీలో మళ్లీ అధికారానికి వచ్చినాక గత ఏడాదిగా కూడా తెలంగాణకు నష్టం కలిగించి తాము లాభపడేందుకు కొత్త విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందుకు సరికొత్త ఉదాహరణ బనకచర్ల.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతుండి ఉంటే బనకచర్ల ప్రతిపాదన చేసేందుకైనా చంద్రబాబు సాహసించేవారా? ఆ ప్రతిపాదన వల్ల తెలంగాణకు కలిగే నష్టం ఎంతటిదో ఆయనకు తెలియనిది కాదు. అయినప్పటికీ ఏ నష్టమూ లేదని నమ్మబలుకుతూ ఆ ప్రతిపాదనను ముందుకు తోసే ప్రయత్నం చేస్తున్నారంటే అందుకు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పైన అనుకున్నట్టు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో లేకపోవటం. రెండు, తన మద్దతుపై ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం. మూడు, తనకు సహచరుడైన రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి కావటం. ఇవిగాక మరొక పరిస్థితి కూడా ఆయనకు కలసివస్తున్నట్టు తోస్తున్నది. అది, కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి ఇటువంటి విషయాలపై శ్రద్ధ లేకపోవటం. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇటువంటి నష్టాలు జరిగితే ప్రజలలో అప్రతిష్ట పాలై తమ పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. అటువంటప్పుడు తమ ముఖ్యమంత్రిని కట్టడిచేయాలి. కానీ, ఆ పనిచేయటం లేదు. తమకు కావలసిందల్లా ఇక్కడ అధికారంలో ఉండటం, తద్వారా పలురకాల లాభాలు పొందటం. రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ ముఖ్యులకు కూడా ఇదే పరమ లక్ష్యంగా మారినట్టు కనిపిస్తున్నది. ఇక్కడి పరిస్థితులను ఏఐసీసీ నాయకత్వానికి వివరించి జాగ్రత్తలు చెప్పవలసిన పార్టీ పరిశీలకురాలు ఒక అసమర్థ సజ్జనురాలి వలె రుజువు చేసుకుంటున్నారు. ఇక్కడి మేధావులు అనబడే వారిలో పలువురు తమ తమ స్వీయ కారణాలతో మౌనదీక్షలు చేస్తున్నారు.
చంద్రబాబును ఒక నెగెటివిస్ట్ సూక్ష్మబుద్ధిగా మనం అంగీకరించవలసి ఉంటుంది. పైన వివరించుకున్న పరిస్థితులను సాకల్యంగా సమీక్షించుకున్న ఆయన, తెలంగాణను తన వర్గపు నయాజాగీర్గా మార్చుకునేందుకు ఇదే సానుకూల సమయమన్న అంచనాకు వచ్చినట్టు స్పష్టమవుతున్నది. ఎప్పుడైనా ఇటువైపు ఉండే బలహీనతలు అటువైపు బలమవుతాయి.
కానీ, సరిగ్గా ఇక్కడనే చంద్రబాబు, ఆయన వర్గం, వారి మీడియా పెద్ద పొరపాటు చేసింది. కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేకపోయినా ఏ మాత్రం చెక్కుచెదరని సజీవశక్తినీ, క్రియాశీలతనూ, అంతే ముఖ్యంగా తెలంగాణ ప్రజల చైతన్యాన్ని, పోరాట శక్తిని తప్పుగా అంచనా వేశారు. ఉద్యమకాలంలో వేసిన తప్పుడు అంచనా వంటిదే ఇది కూడా. ఆ నాటి తప్పుడు అంచనా నుంచి చంద్రబాబు, ఆయన మీడియా ఎటువంటి పాఠాలు నేర్చుకోకపోవటం గమనించదగినది. బనకచర్ల అంశం ఉదాహరణకు పేర్కొంటున్నప్పటికీ అటువంటి అజెండాలు, రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నవి, సహకరిస్తున్నవి ఇంకా ఉన్నాయి. ఆయన ఇంకా పాలించే మూడున్నరేండ్లలో మరిన్ని ముందుకు వస్తాయి. అందువల్ల తెలంగాణ ప్రజలు, యువకులు, ఇంకా మిగిలిన మేధావి వర్గాలు నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరం. అలా ఉన్నప్పుడు వారిని ఏ శక్తీ ఎదుర్కొనజాలదు.