వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి, కనీసం ఈసారైనా అవకాశం సంపాదించాలనే తపన పెరుగుతుండటంతో, అకస్మాత్తుగా బీసీలపై ప్రేమ కలుగుతున్నది. ఆయన ఈ నెల 24, 25 తేదీలలో బీసీల గురించి ఢిల్లీలో అన్న మాటలను గమనించండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కులగణన దేశంలో సామాజిక న్యాయానికి మైలురాయి అవుతుందని, మొత్తం దేశానికి మార్గదర్శి కాగలదని, ధనమూ, భూమి ఎవరి చేతిలో ఉన్నాయో ఇపుడు తెలుస్తుందని అన్నారు. తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో భూకంపమవుతుందని కూడా అన్నారు. అంతటితో ఆగక, ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగణన చేయకపోవటం పార్టీ తప్పుకాదని, తనదని, ఈ వర్గాల చరిత్ర, సమస్యలు కొంతముందుగా తెలిసి ఉంటే, అప్పుడే ఈ పనిచేసేవారమని చెప్పారు.
ఈ మాటలలో ప్రస్తావనకు వచ్చిన రెండు విషయాలు ముందుగా చూసి, తక్కిన చర్చలోకి తర్వాత పోదాం. తెలంగాణలో జరిగిన కులగణనను మైలురాయి అని, దేశానికే ఆదర్శమని ప్రకటిస్తున్న రాహుల్ గాంధీ, ఆ ప్రక్రియపై బీసీ వర్గాల నుంచే వస్తున్న తీవ్ర అభ్యంతరాలను, వారు ఎత్తిచూపుతున్న లోపాలను, ఆ లెక్కలు ఏ విధంగా నియమ నిబంధనలకు విరుద్ధమైనవో ఇస్తున్న వివరణలను, కోర్టుల ముందు నిలవబోవన్న వాదనలను పరిగణనలోకి తీసుకున్నారా? తీసుకుని ఉంటే, బీసీల పట్ల నిజాయితీ గలవారు ఇటువంటి సర్టిఫికెట్లు ఇవ్వలేరు. బీసీల ఓట్ల కోసం కపటంగా వ్యవహరించదలచిన వారు మాత్రమే ఆ పనిచేయగలరు.
ఆ వర్గాల స్థితిగతుల గురించి తనకు ఇప్పుడు స్పృహ కలిగిందంటున్న కాంగ్రెస్ నాయకుడు, కనీసం ఇప్పటికైనా అట్లా కలిగిన మాట నిజమే అయితే, తెలంగాణ కులగణనపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు ఏమిటో తెలుసుకొని వివేచించేవారు. ఆయన పక్షాన, తనకు పూర్తిగా నమ్మకస్థురాలనే పేరున్న ఏఐసీసీ పర్యవేక్షకురాలు ఒకరు ఇక్కడ మకాం చేసి ఉన్నందున, ఆ భిన్నాభిప్రాయాలు ఏమిటో ఆయన చెవిన పడి ఉంటాయనే భావించాలి. వాటి గురించి తన అభిప్రాయమేమిటో మనకు తెలియదు. కానీ, ఈ రెండు రోజుల తన మాటలను బట్టి మాత్రం, ఆయన బీసీ వర్గాల ఆక్షేపణలను పట్టించుకోదలచుకోలేదనో, పట్టించుకోదగినవి కాదనుకున్నారనో భావించాలి.
అనగా, ప్రజాస్వామికమైన ఆక్షేపణలు అవే బీసీ ముఖ్యుల నుంచి వస్తున్నా లెక్కచేయని నాయకుడు, ఆ వర్గాలపై తనకు కొన్ని దశాబ్దాల రాజకీయం తర్వాత అవగాహన, ప్రేమ ఇపుడు కలుగుతున్నదని మాట్లాడితే, చిత్తశుద్ధితో కూడిన మాట అని ఆ వర్గాల వారు నమ్మాలన్న మాట. ఆయనకు చిత్తశుద్ధి ఉండినట్టయితే, ఆయా విమర్శకులతో హైదరాబాద్‌లోనో, ఢిల్లీలోనో సమావేశమై, వారి అభిప్రాయాలు విని, కులగణన విధానంలో మార్పులు అవసరమని తోస్తే ఆ పనిచేసి, అపుడు ఆ నివేదికను దేశానికి ఆదర్శం వగైరాలు అని ఉంటే బాగుండేది. ఆ విధంగా, ఆ తర్వాత కోర్టులలో ఏమి జరిగినా, ముందు డేటా అనేది సవ్యంగా ఉంటుంది. నిజానికి ఆ లోపభూయిష్టమైన గణన అయినా సరిగా జరగలేదన్నది అందరూ మాట్లాడుతున్నదే. ఆ ప్రశ్నావళిలో అక్కర లేని ప్రశ్నలు అనేకం ఉండటం, సేకరణ సిబ్బంది చాలా ఇళ్లకు వెళ్లకపోవటం, పోయిన ఇళ్లలో పలుచోట్ల ప్రజలు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ఇష్టపడకపోవటం వంటి కారణాలతో డేటా సేకరణ అన్నదే అసంపూర్తిగా తయారైంది. వివరాలు ఇవ్వని కుటుంబాల వద్దకు వెళ్లి జరిపిన రెండవ సర్వే కూడా విఫలమైందని అధికారులే వెల్లడించారు.
ఒకవైపు బీసీ ప్రముఖుల అభ్యంతరాలు, మరొకవైపు పైన పేర్కొన్న పలు లోపాలను కలిపి చూసినపుడు, తెలంగాణ కులగణన నామకార్థపు నివేదిక మాత్రమేనని ఎవరైనా చెప్పగలరు. అయినప్పటికీ రాహుల్‌గాంధీ దానిని ఆకాశానికెత్తి మాట్లాడటం, తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికే తప్ప, అందులో నిజాయితీ కనిపించదు. ఒకవేళ ఆ లెక్కింపు అన్నివిధాలా సక్రమంగా జరిగి ఉంటే, ఆ మేరకు రిజర్వేషన్లు పెరిగి ఉండేవా? కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం ఆ పని చేసేదా? అంతిమంగా కోర్టులు ఏమనేవి? అందరూ ఒత్తిడి చేసి రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయించటం వీలయ్యేదా? వంటివి తర్వాతి ప్రశ్నలు. కానీ, అసలు మౌలికంగా జరుగవలసిన కులగణన సవ్యంగా జరుగనప్పుడు ముందుకుపోయేది ఏ విధంగా? అప్పుడు జరిగేది, లోపల సరుకు లేని ఒక గుల్ల బొమ్మను తయారుచేసి ముందుపెట్టి, అది గాలికి కిందపడి పగిలిపోతే, చూశారా బొమ్మను చేయనైతే చేశామని బుకాయించేందుకు తప్ప అదెందుకూ పనికిరాదు.
అదట్లుంచి, కులగణన నేడు గాక రేపు జరిగినా కోర్టుల నుంచి 50 శాతం ప్రశ్న ఎదురవుతుంది. అటువంటప్పుడు, కాంగ్రెస్ నాయకునికి ఓట్లపై గాక బీసీలపై ప్రేమ ఉంటే, ఆ సీలింగ్ ఎత్తివేతకు తక్కిన ‘ఇండియా’ కూటమి పార్టీలతో కలిసి ప్రభుత్వం వద్ద ప్రతిపాదించటం, ఒత్తిడి తేవటం చేయవచ్చు. అందుకు కాదనటం బీసీనని చాటిచెప్పుకొనే ప్రధానికి తేలిక కాదు. కాంగ్రెస్ విమర్శలను తిరస్కరిస్తున్న బీజేపీ, మీరు బీసీని ముఖ్యమంత్రి చేయండి, కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబం నుంచి విముక్తం చేసి బడుగు, బలహీన వర్గాలకు అప్పగించండి వంటి సవాళ్లను విసురుతున్నది. ఆ రొటీన్ రాజకీయాలను పక్కన ఉంచితే బీసీ కులగణన, రిజర్వేషన్లు అనే తక్షణ విషయాలకు సంబంధించి మాత్రం తమ నివేదిక దేశానికే ఆదర్శం, గేమ్‌ఛేంజర్, భూకంపం వంటి ఆర్భాటపు ప్రకటనలు చేయటానికి ముందు రాహుల్‌గాంధీ చేయవలసినవి అనేకం ఉన్నాయి.
ఇంతకాలం కులగణన జరుగకపోవటం తన పొరపాటే తప్ప కాంగ్రెస్ పార్టీది కాదని రాహుల్ మరొక మాట అన్నట్టు మొదట చూశాం. ఈ విషయమై చెప్పుకోవాలె గానీ చాలా చాలా ఉన్నాయి. పార్టీ గురించి, ఆయన గురించి కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పార్టీ, ఆయన కూడా మొదటినుంచి బీసీలను మాత్రమే గాక బడుగు, బలహీన వర్గాలన్నింటిని తమ అధికారం కోసం ఉపయోగించుకుంటూ వస్తున్నారు. తెలియకనో, పొరపాటునో కాదు. తెలిసి తెలిసి ఉద్దేశపూర్వకంగా. ఇది ఊహాగానపు మాట కాదని చెప్పేందుకు బలమైన వాదనలు ఎన్నయినా ఉన్నాయి. ఆ వాదనలు స్వయంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నవే. అందుకే వారు కాంగ్రెస్ నుంచి దూరమై తమ పార్టీలు ఏర్పాటు చేసుకోవటం, లేదా ఇతర పార్టీ ల వైపు మొగ్గటం చేస్తూ వస్తున్నారు.
రాహుల్ గాంధీ మకుటం లేని యువరాజుగా కాంగ్రెస్‌లోకి 2004లో ప్రవేశించిన తర్వాత ఇరవయ్యేండ్ల కాలంలో ఈ ధోరణి తగ్గకపోగా మరింత పెరుగుతున్నది. అది ఆయన గమనించలేదా? తను బీసీల విషయం ఇన్నాళ్లు గుర్తించలేదని, ఇప్పుడు గుర్తించానని, లోగడ గుర్తించి ఉంటే పొరపాటును దిద్దుకునేవాడినని ఆయన ఇప్పుడు అంటున్న మాటల్లోనూ ఓట్ల కోసం చేసే కపటపు నటనలే తప్ప నిజాయితీ లేదు. 2004 కన్న ఎంతో ముందే బలంగా మొదలైన బీసీ వాదం, కులగణన డిమాండ్లు, రిజర్వేషన్ల హెచ్చింపు డిమాండ్లు రిజర్వేషన్లు అట్లుండగా తమ పార్టీలో పార్టీ ప్రభుత్వాలలో బీసీలకు పదవుల డిమాండ్ల వంటివన్నీ గత 20 ఏండ్లుగా ఆయన కండ్లముందే కదలుతూ వస్తున్నాయి.
బయట అంతగా తెలియని మరొక విషయం చెప్పాలి. ఆయన రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో, అప్పుడు యూపీలో కాంగ్రెస్ అతి బలహీనం గనుక, తమ సంప్రదాయిక స్థావరమైన అక్కడ పుంజుకుంటే గాని కేంద్రాధికారం సాధ్యం కాదని చెప్పి, అదెట్లా సాధించాలో అర్థం చేసుకునేందుకు రాహుల్‌గాంధీ తరచూ సాయంత్రం పొద్దుపోయినాక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి వెళ్లి ప్రొఫెసర్లతో చర్చలు జరిపేవారు. వారు ఆయనకు, యూపీలో వెనుకబడిన తరగతులు (బీసీలు), వారి సంఖ్యాబలం, రాజకీయ బలం, వారి సమస్యలు, వారిని ఆకర్షించటం గురించి చాలా చెప్పేవారు. ఆ ప్రకారం ఆయన ఏమి చేసి ఏమి సాధించారన్నది అట్లుంచితే, తనకు బీసీలు, వారి సమస్యల గురించి తొలిరోజుల నుంచే స్పష్టంగా తెలుసునన్నది ఇక్కడ గుర్తించవలసిన విషయం.
ఎవరూ చర్చించనిది మరొకటి ఉందిక్కడ. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు తెలుసు. ఆ మేరకు చట్టాలున్నందున వారికి విద్య, ఉద్యోగాలు చట్టసభలలో రిజర్వేషన్లున్నాయి. వీటిలో కచ్చితంగా అమలవుతున్నది చట్టసభలవి మాత్రమే. తక్కినవి పలు కారణాలతో ఎడతెగని ఉద్యోగాల బ్యాక్‌లాగ్‌లు. వాటిని భర్తీ చేయగల మార్గాలున్నా అధికారంలో ఉన్నవారు ఆ పని చేయటం లేదు.
ఆ వర్గాలవారు పోరాడటం లేదు. మరి రేపు బీసీల లెక్కలు తేలితే ఏమి కావచ్చు? వీరికి రిజర్వేషన్లు, బ్యాక్‌లాగ్‌ల భర్తీకి రాహుల్‌గాంధీ పట్టుబట్టి ఏమైనా చేయగలరా? నిజమైన గేమ్‌ఛేంజర్ అది అవుతుంది తప్ప, తప్పుల తడక కులగణనల లెక్కలు, దానితో చేతులు దులుపుకొని బీసీలను భ్రమపెట్టడం, వారి ఓట్లు కొల్లగొట్ట జూడటం కాదు. బీసీల విషయం ఒకవైపు నడుస్తుంటుంది. రాహుల్‌కు బడుగు, బలహీనవర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మరొకవైపు ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ల భర్తీకి గల మార్గాలను సూచిస్తూ ఇప్పటికే గల నివేదికలను బయటకుతీసి ఆ మేరకు తమ పార్టీ పాలించే రాష్ర్టాలలో, ఇండియా కూటమి రాష్ర్టాలలో అమలుచేసి చూపాలి. తాము అమలుచేస్తూ ఎన్డీయే ప్రభుత్వాలను ఒత్తిడి చేయాలి. ఇది చేసినప్పుడు, బీసీల విషయంలోనూ నిజాయితీ చూపగలరనే నమ్మకం ఏర్పడుతుంది. తన తప్పును ఇప్పుడు గుర్తించాననే ప్రకటనకు ఆచరణపూర్వకమైన రుజువు లభిస్తుంది.
2004 నుంచి ఈ రోజు వరకు రాహుల్‌గాంధీ సమర్థత రుజువైన సందర్భాలు ఏమంటే చాలా ఆలోచించవలసి ఉంటుంది. అసమర్థతలు ఏమంటే మాత్రం తడుముకోకుండా ఎన్నో చెప్పవచ్చు. ప్రస్తుతం బీసీ కులగణనల గురించి తను మాట్లాడుతున్నదానిలోనూ అధికారపు ఆశల ఎత్తుగడలు మినహా సమర్థత అనదగ్గది కనిపించటం లేదు. ముఖ్యమైన విషయం మరొకటి చెప్పుకోవాలి. బీసీల సమస్యలన్నీ కులగణనకు మాత్రమే పరిమితమై లేవు. ఆ లెక్కల ప్రకారం జరిగే రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీలలోని కొన్ని తరగతులకు ఉపయోగపడుతాయి. ఆ పరిధిలోకి రాని బీసీ రైతులు, పలు వృత్తులవారు, ఇతర పనిపాటల వారు అంతకన్న పెద్ద సంఖ్యలో ఉన్నారు.
రాహుల్‌గాంధీకి ఈ విషయాలు, వారి స్థితిగతులు, వారి బాగు కోసం చేసిన ఉదాహరణకు భూ సంస్కరణల చట్టాలు, సహకార చట్టాలు, బ్యాంకింగ్ రుణాల నియమాలు మొదలైనవి తెలియవా? వాటి అమలు కాంగ్రెస్ పాలనాకాలంలోనూ ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియదా? వాటి అమలుకు కులగణనతో నిమిత్తం లేదని తెలియదా? అట్లాగే, తను అంటున్నట్టు ఎవరిదగ్గర డబ్బు, భూములు ఉన్నాయో కులగణన జరిగితే గాని తెలియదా? అందువల్ల ఆయన తన నటనలను వెంటనే మానివేసి చిత్తశుద్ధి చూపితే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు దూరమవుతున్న బీసీల ఓట్లు అప్పటికి ఏమైన కొంత తిరిగివస్తే రావచ్చు గాని, ఇటువంటి నిజాయితీ లేని మాటలు మాత్రం వారిని నమ్మించలేవు. రేవంత్ రెడ్డితో పాటు సహ నటుడు కావటం వల్ల ఉపయోగం ఉండదు.
-టంకశాల అశోక్