2025-26 కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. గత ప్రభుత్వ హయాంలో పలు సంక్షేమ, అభివృద్ధి వల్ల తలసిరి ఆదాయం రూ.3,79,751 లక్షలకు చేరిందనే విషయం అందరికీ తెలిసిందే. గత 16 నెలల పాలనలో ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పడిపోయింది. రెవెన్యూ రాబడి తగ్గిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి హరించింది. అస్తవ్యస్థ విధానాలతో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన 2025-26 బడ్జెట్ స్పష్టం చేసింది. తలసరి ఆదాయం 2014-15లో 1,24,104 నుంచి 2023-24 వరకు 3,47,299కి పెంచిన ఘనత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతుబంధు లాంటి పథకాలను 30 శాతం మంది రైతులకే అమలు చేసి మెజారిటీ రైతులకు ఎగ్గొట్టింది. కానీ, భట్టి ప్రసంగంలో మాత్రం అబద్ధాల పరంపర కొనసాగింది.
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగం అత్యంత కీలకమైనది. ఆ రంగానికి ప్రభుత్వం కేటాయించింది. రూ.24,439 కోట్లు మాత్రమే. రూ.18,000 కోట్లు రైతుబంధు పథకం కింద కేటాయింపు చేసింది. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు కానీ, కేటాయింపులు మాత్రం తగ్గట్టుగా లేవు. బోనస్, బీ మా, వ్యవసాయ సబ్సిడీలలో అన్నీ కోతలే. రాష్ట్ర బడ్జెట్లో మరో కీలకమైనది విద్యారంగం. బడ్జెట్లో 15 శాతం విద్యకు నిధులు కేటాయిస్తామని చెప్పి 7.57 శాతం అం టే, 23,108 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు. వైద్య రంగానికి రూ.12,393 కోట్లు కేటాయించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, ఇప్పుడు రూ.11,405 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో బీసీ సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. యాభై లక్షల మందికి 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పి ఈ బడ్జెట్లో మాత్రం నామమాత్రంగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు పింఛన్, ప్రతి మహిళకు 2,500 పథకం కోసం అసలు కేటాయింపులే జరపలేదు. పింఛన్ హెచ్చింపు లేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే 6 గ్యారెంటీల పేర 420 హామీల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని ఈ బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా చెప్తున్నాయి.
ఉద్యోగులు పీఆర్సీ కోసం, 5 కరువు భత్యాల విడుదల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ బడ్జెట్లో వాటికి సంబంధించిన ఊసే లేదు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల విషయమై అసలు ప్రస్తావనే రాలేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా జీతాలు తప్ప ఏవీ అడగొద్దని హుకూం జారీ చేయడంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన మొదలైంది. పీఆర్సీ గడువు ముగిసి దాదాపు రెండేండ్లు గడిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మధ్యంతర భృతిని కూడా పెంచలేదు. ముఖ్యమంత్రి రేవంత్ పరోక్షంగా పీఆర్సీని మరిచిపోవాలని చెప్పారు. కావాలంటే బడ్జెట్ మీ చేతుల్లో పెడతాను మీరే పంచుకోండని ఉద్యోగులకు చెప్పడం హాస్యాస్పదం. 2025-26లో మరో 10 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ కాబోతున్నారు. వీరి పరిస్థితి ఏంటో ఊహించుకుంటే ఆందోళన మొదలవుతున్నది. ఆర్థిక ప్రయోజనాలు అడిగిన పాపానికి జీవితమంతా శ్రమించి దశాబ్దాల కాలం ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదు. అందుకే అన్ని వర్గాలు ఉద్యమబాట పట్టే అనివార్య పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ పాలన గాడితప్పి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సొంత రెవెన్యూ రాబడి కూడా గణనీయంగా తగ్గింది.
కేంద్రం నుంచి బ్రహ్మాండంగా నిధులు వస్తున్నాయని గవర్నర్ ప్రసంగం సందర్భంగా చెప్పిన మాటలు ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పిన రేవంత్రెడ్డి తన సమర్థత వల్ల కేంద్రం నుంచి అనేక ప్రయోజనాలు పొందానని చెప్పడం ద్వారా బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడటమే కదా? జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై బీఆర్ఎస్ను రాజకీయంగా అణచివేయాలనే కుట్రలో భాగమే ఇది. మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాపాలన సాగిస్తున్నామని, పారదర్శకత, జవాబుదారీతనం మా విధానమని చెప్తున్న ప్రభుత్వం గత 16 నెలల కాలంలో కొనసాగిన ప్రజా వ్యతిరేక పాలనకు ఎవరు కారణమో చెప్పాలి. మొత్తంగా 2025-26 కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎగవేతలకు అద్దం పట్టింది. ఓ దిక్కు మేమెంతో.. మాకంత కావాలని అన్ని వర్గాలు పోరాడుతుంటే… ఇంకో దిక్కు ఆయా వర్గాలకు న్యాయం జరిగేలా కేటాయింపులు మాత్రం జరగలేదు. గత ప్రభుత్వం సకల సంపదలతో రాష్ర్టాన్ని అప్పచెప్తే, కాంగ్రెస్ ప్రభుత్వం సకల సమస్యలు సృష్టించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం బడ్జెట్ కేటాయింపులు జరుపలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరుపాళ్లు తప్పింది. భవిష్యత్తు పాలనకు అద్దం పట్టేలా తేల్చిచెప్పింది. ఇక తేల్చుకోవాల్సింది ప్రజలే. ప్రజలే చరిత్ర నిర్మాతలు. తెలంగాణ భవిష్యత్తు చరిత్రను ఇక ప్రజలే నిర్ణయిస్తారు.