సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పక్షానికి మంచి మెజారిటీ లభిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత కూడా సాధారణంగా మున్సిపాలిటీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు మూడు నాలుగు ఏండ్ల గడువు ఉన్న సమయంలోనే జరిగాయి. ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్కు ఇంకా 33 నెలల పదవీ కాలం ఉన్న సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా గడువు ఉండడం వల్ల సహజంగా అధికార పక్షానికి ఫలితాలు అనుకూలంగా ఉండాలి. అయితే గతంలో అధికారంలో ఉన్న పార్టీలకు లభించిన విజయం కన్నా ఈ సారి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన మెజారిటీ తగ్గింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ.
2020లో తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 110 మున్సిపాలిటీల్లో, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో విజయం సాధించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాలుగు మున్సిపాలిటీల్లో మాత్రమే గెలుపొందింది. ఒక్క కార్పొరేషన్ కూడా దక్కించుకోలేదు. అంటే మొత్తం సీట్లల్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కేవలం మూడు శాతం సీట్లు మాత్రమే గెలిచింది. మూడేండ్లు గడిచిన తర్వాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మున్సిపాలిటీల్లో మూడు శాతం సీట్లు సాధించడం అనేది, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అడ్డంకి కాలేదు.
అదే విధంగా వార్డుల విషయంలోనూ ఇలానే ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ 1686 వార్డుల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ 569 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. 2020లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సాధించిన ఫలితాలతో పోలిస్తే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ చాలా ఎక్కువ సీట్లు సాధించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 1347 వార్డుల్లో విజయం సాధిస్తే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ 723 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 52 శాతం వార్డుల్లో గెలిస్తే బీఆర్ఎస్ 30 శాతం వార్డులను కైవసం చేసుకున్నది.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సగం సీట్లు సాధించినా మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం 261 వార్డులు, దాదాపు 10 శాతం సీట్లు మాత్రమే సాధించి, మూడో స్థానానికి పరిమితమైంది. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన మూడేండ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడం అనేక సార్లు జరిగింది. ఎక్కువసార్లు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలకు పూర్తి భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2004లో శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2005లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 96, వీటిలో టీడీపీ 20 మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నది అని ఎన్నికలకు ముందు టీవీ 9 సర్వే ప్రకటించింది.
కాంగ్రెస్తో కుమ్మక్కు అయి ఈ సర్వే ప్రకటించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపణలు చేశారు. తమ పార్టీ కార్యక్రమాలకు టీవీ 9ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. టీవీ 9 బాధ్యులు ఎన్టీఆర్ భవన్కు వెళ్లి, చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్నారు. వాస్తవానికి అధికార పక్షానికి ఉండే అనుకూలత, శాసనసభ్యులకు ఉండే ఓటింగ్, వంటి కారణాలతో టీడీపీకి ఆ 20 కూడా రావని గట్టి నమ్మకం ఉండే ది. ఇక ఫలితాలు వచ్చాక చూస్తే చివరకు ఆ 20 కూడా రాలేదు. టీడీపీ కేవలం ఎనిమిది మున్సిపాలిటీల్లో మా త్రమే గెలిచింది. 82 మున్సిపాలిటీలతోపాటు తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ గెలుచుకున్నది.
వైఎస్ఆర్ నాయకత్వంలో మున్సిపాలిటీల్లో 90 శాతం విజయం సాధించిన కాంగ్రెస్కు.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 అసెంబ్లీ సీట్లకుగాను 156 అసెంబ్లీ సీట్లు, 36.56 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. టీడీపీకి 92 సీట్లు లభించాయి. ఉమ్మడి రాష్ట్రంలో 92 సీట్లతో బలమైన ప్రతిపక్షం ఉండడం అదే మొదటి సారి. అంతకుముందు ఎప్పుడూ ప్రతిపక్షానికి అన్ని సీట్లు లేవు. 1981-82లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్, ఆ ఎన్నికల తర్వాత పుట్టిన టీడీపీ చేతిలో అసెంబ్లీ ఎన్నికల్లో మట్టికరిచింది.
ఉమ్మడి రాష్ట్రంలో 1987లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ మెజారిటీ సీట్లలో గెలిచింది. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ 183 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 2021లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేసింది.
మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అదొక రికార్డ్. 95 శాతం సీట్లు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చాయి. 1500 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీడీపీ వంద వార్డులకు పరిమితమైంది. 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. రెండేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 అసెంబ్లీ సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కూడా పొందలేక పోయింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచిపోయింది. రెండేండ్లలోనే ఐదేండ్లకు సరిపోయేంత వ్యతిరేకత మూటకట్టుకున్నది. మున్సిపాలిటీ ఎన్నికల్లో 95 శాతం సీట్లు సాధించిన వారు కూడా ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఎన్నికల చరిత్ర ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో 1347 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే, బీఆర్ఎస్ 716 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ అధికారానికి ఇంకా 33 నెలల సమయం ఉన్నది. బీఆర్ఎస్ పుంజుకోవడానికి ఈ సమయం సరిపోతుంది.
తెలంగాణలోఉత్కంఠ రేకెత్తించిన పురపోరులో ఇక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ సాధించిన ఫలితాలు చాలా మెరుగైనవే. గతంలో అధికార పార్టీలు పురపోరులో దక్కిం చుకున్న స్థానాలతో పోల్చితే కాంగ్రెస్ కైవసం చేసుకున్నవి చాలా తక్కువేనని స్పష్ట మవుతున్నది.
ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 1347 వార్డుల్లో విజయం సాధిస్తే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ 723 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 52 శాతం వార్డుల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్
30 శాతం వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లు సాధించినా
మున్సిపాలిటీల్లో మాత్రం 261 వార్డులతో దాదాపు 10 శాతం సీట్లు మాత్రమే సాధించింది.
-బుద్దా మురళి