ప్రజా ఉద్యమం నాయకత్వాన్ని అన్వేషిస్తుంది. నాయకత్వం ఉద్యమాన్ని నిర్మిస్తుంది. ఈ రెండింటికీ పరస్పరపూరకమైన బంధాన్ని తెలంగాణ ఆవిష్కరించింది. దేశంలో తక్కిన రాజకీయ పార్టీలకు లేని ప్రత్యేకత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ప్రజా ఆకాంక్షల ఉద్యమాన్ని పార్లమెంటరీ రాజకీయాలకు అనుగుణమైన రీతిలో తీర్చిదిద్ది, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్కంటూ ఒక చరిత్ర ఉన్నది. ఇది ఎవరూ కాదనలేని సత్యం.
భారత స్వాతంత్రోద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించిందని ఎలా అంటున్నామో… , 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం దేశానికి కొత్త నాయకత్వాన్ని జనించిందని ఎలా చెప్పుకుంటున్నామో.. అలాగే బీఆర్ఎస్ పార్టీ స్థాపన కొత్త నాయకత్వాన్ని ఉత్పత్తి చేసిందని కూడా చెప్పుకోవాలి. తెలంగాణ నేల మీద ఆ మాటకొస్తే ఉమ్మడి రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్థావన తీయకుండా, కేసీఆర్ పేరు ఎత్తకుండా రాజకీయాలు చేయలేని వాతావరణం నెలకొన్నది. 2001 నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ గెలిచినా, ఓడినా… అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా… ఉద్యమంలో ఉన్నా, ఉద్యమం స్తబ్దుగా సాగినా.. ఏ దశలోనూ ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ పేరు లేకుండా రాజకీయాలు సాగని కాలమొకటి సృష్టించబడింది. అలా సృష్టించటం బీఆర్ఎస్కు ఒకవైపు అదృష్టం, మరోవైపు దురదృష్టం. అదృష్టం క్షేత్రస్థాయిలో చెక్కుచెదరని కేడర్ అయితే, దురదృష్టం ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇప్పుడు ఇతర పార్టీలకు మారటం.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీని చీల్చటం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చవచ్చని 2004 ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నది. అవి కుట్రలని తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలనూ అదే కోణంలో తెలంగాణ విశ్లేషించుకుంటున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేసి తద్వారా తమకు అనుకూల రాజకీయాలు చేయటం సాధ్యమా? కాదా? కాలమే నిర్ణయిస్తుంది. అలా కాకుండా ఒక రాజకీయ పార్టీ స్పేస్‌ను మరో రాజకీయ పార్టీ భర్తీచేయాలనుకుంటే ఆ పార్టీ అనుసరించి, ఆచరించిన విశ్వాసాలను అచ్చుగుద్దినట్టు చేయాలి. అలా చేయటం సాధ్యమా? అంటే చరిత్ర అసాధ్యమనే చెప్తున్నది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఒక ఎమోషన్‌తో నిర్మించారు. కేసీఆర్ ఉద్వేగాన్ని అద్ది ఉద్యమాన్ని ఎట్లా నిర్మించారో… పార్టీని కూడా అట్లాగే నిర్మించారని కేసీఆర్ బద్ధ విరోధులు సైతం అంగీకరించే సత్యం. కాబట్టి ఇవ్వాళ బీఆర్ఎస్ను వీడిన ప్రజాప్రతినిధులు, ఇంకా వీడాలనుకునేవాళ్లకు తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న ఉద్వేగాన్ని విడదీయలేరని, ఆ ఉద్వేగ నెత్తురు బీఆర్ఎస్లోనే ఉన్నదని వారి నిశ్చితాభిప్రాయం. కేసీఆర్ విరోధులు ఈ నిర్ణయానికి రావటానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ఉత్పత్తి చేసిన నాయకత్వం.
తెలంగాణ నవతరం నాయకత్వాన్ని ఉత్పత్తి చేసిన కర్మాగారంగా కేసీఆర్ బీఆర్ఎస్ను తీర్చిదిద్దారు. రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన బీఆర్ఎస్ రాష్ర్టాన్ని సాధించి, తెలంగాణ పునర్మిర్మాణంలో నవతరాన్ని భాగస్వామ్యం చేసింది. ఉద్యమ శక్తులనూ సమ్మిళితం చేసింది. తెలంగాణలో 60 లక్షల మంది సభ్యులున్న పార్టీ బీఆర్ఎస్.
ఈ పార్టీ ‘విద్యార్థి’ శిక్షణా శిబిరాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి మెరికల్లాంటి నాయకులను ఉత్పత్తి చేసింది. 2001 నుంచి ఇప్పటిదాకా ఎదిగివచ్చిన ఎంతోమంది నాయకులు స్వరాష్ట్రంలో తమ బుద్ధికుశలతను ప్రదర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్ (ప్రస్తుతం బీజేపీ ఎంపీ) వంటి ఎంతోమంది నాయకులు తమ తమ ప్రతిభాపాటవాలతో తెలంగాణ రాజకీయాలను సుసంపన్నం చేశారు. బాల్క సుమన్, గాదరి కిశోర్ వంటి విద్యార్థి నాయకులు ప్రజాప్రతినిధులుగా తమ ప్రాంతానికి వన్నె తెచ్చారు. ఉద్యమ మాగాణాన్ని తమ ఆటపాటలు, అక్షరసాగుతో అలరించిన గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ వంటి వారనేకమందిని శాసననిర్మాణకర్తలుగా చేసిన ఘనత బీఆర్ఎస్ది. అప్పటిదాకా కొన్నివర్గాలకే రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని బద్దలు కొడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు టీడీపీ ద్వారా కొత్తతరం నాయత్వాన్ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే.. అంతకు పది రెట్లు కేసీఆర్ మారుమూల పల్లెలు, పట్టణాల్లోని యువతను నాయకులుగా మలచి తెలంగాణ ప్రయోజనాల రక్షణ కవచంగా తీర్చిదిద్దారు. ఆ నాయకత్వమే నేడు తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నది. పార్లమెంట్ నుంచి పంచాయతీ దాకా ప్రజాభిమానాన్ని పార్టీ శ్రేణులు కంచుకోటగా కాపాడుకుంటారనే వాదన సజీవమైంది.
భౌగోళిక, ఆర్థిక, సాంస్కృతిక, వారసత్వం, రాజకీయం సహా అన్నిరంగాల్లో అవగాహన ఉండేలా బీఆర్ఎస్ పార్టీ తనను తాను తీర్చిదిద్దుకున్నది. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని స్థాయిల్లో నాయకత్వం జెండాలెత్తింది. తెలంగాణ విషయంలో మిగతా పార్టీల నాయకుల వ్యవహార సరళికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యవహారశైలి భిన్నంగా ఉంటుందని అనేక సందర్భాలు రుజువు చేశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ వాదన పటిమతో సభను అబ్బురపరిచిన సందర్భాలనేకం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల సహా పలువురి నేతల విషయ జ్ఞానాన్ని చూసి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కీర్తించి ఆళింగనం చేసుకున్న సందర్భాలనేకం. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఉభయ సభల్లోనే కాకుండా అనేక అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. రాజకీయ వారసత్వంగా లేని వేలాదిమంది కార్యకర్తలు నాయకులుగా ఎదిగిన పార్టీగా తక్కువ కాలంలోనే బీఆర్ఎస్ రికార్డు నెలకొల్పింది.
ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ సహా వివిధ విశ్వవిద్యాలయాల కేంద్రంగా సాగిన ఉద్యమంలో విద్యార్థులు కీలక భూమికను పోషించారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్‌ను, విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌ను పార్లమెంట్‌కు పంపిన చరిత్ర బీఆర్ఎస్ది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన పసునూరి దయాకర్‌ను, తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేసిన కల్వకుంట్ల కవితను పార్లమెంట్‌కు పంపిన రికార్డూ బీఆర్ఎస్దే. ఫౌల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్న రంజిత్‌రెడ్డి (ఇప్పుడు కాంగ్రెస్‌లో), తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలనే స్ఫూర్తిని నింపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (ప్రస్తుత బీజేపీ ఎంపీ), వైద్యుడిగా ఉండి ఉద్యమంలో పాల్గొన్న బూర నర్సయ్యగౌడ్, ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న వెంకటేశ్ నేత, న్యాయవాది మధుసూదన్ రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, బీబీ పాటిల్, ప్రొఫెసర్ సీతారాంనాయక్‌ను పార్లమెంట్‌కు పంపిందీ బీఆర్ఎస్సే.
ఉద్యమంలో తనతో నడిచిన బీఆర్ఎస్ నాయకులను, ఉద్యమకారులను, బుద్ధిజీవులను కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేశారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీతోనే రాజకీయ రంగప్రవేశం చేసినవారు, వివిధ ప్రజా ఉద్యమాలు, ఉద్యోగ ఉద్యమాలతో సంబంధం ఉన్నవారెందరికో కేసీఆర్ అవకాశాలు కల్పించారు.
వారిలో మంత్రులుగా కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పద్మారావుగౌడ్, నిరంజన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గొంగిడి సునీత, ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, గాదరి కిశోర్, రసమయి బాలకిషన్, చంటి క్రాంతికిరణ్, దుర్గం చిన్నయ్య, సుంకె రవిశంకర్, డాక్టర్ మెతుకు ఆనంద్, ఆరూరి రమేశ్, నోముల భగత్, డాక్టర్ సంజయ్, కోవా లక్ష్మి, బొడిగె శోభ, నల్లాల ఓదెలు, వేముల వీరేశం, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, సైదిరెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ఇలా ఎంతోమంది గులాబీ సైనికులు చట్టసభల్లో తమ వాణిని వినిపించారు.
ఇక తెలంగాణ ఉద్యోగ సంఘాల నుంచి ఎదిగిన స్వామిగౌడ్ మండలి చైర్మన్‌గా, శ్రీనివాస్‌గౌడ్ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్సీలుగా ఆర్.సత్యనారాయణ, నారదాసు లక్ష్మణ్‌రావు, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, సురభీ వాణిదేవి (పీవీ కుమార్తె), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్, శంభీపూర్‌రాజు ఎమ్మెల్సీలుగా, గ్యాదరి బాలమల్లు, ఆంజనేయగౌడ్, రాజారాం యాదవ్, అమీర్, మీర్ ఇనాయత్ అలీ, మందుల సామేలు, నాగర్లు వెంకటేశ్వర్రావు, విప్లవ్‌కుమార్, మేడే రాజీవ్‌సాగర్, తాడూరి శ్రీనివాస్, పిడమర్తి రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, గాంధీనాయక్, వాల్యా నాయక్, శుభప్రద్ పటేల్, మఠం భిక్షపతి, మన్నె క్రిశాంక్, వాసుదేవరెడ్డి, జగన్మోహన్రావు, కిశోర్‌గౌడ్ ఇలా ఎంతోమంది రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా బీఆర్ఎస్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయిన సైన్యమే. వీరితోపాటు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లుగా బొంతు రామ్మోహన్, బాబా ఫసియొద్దీన్ సహా వేలాది మందిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎదిగేలా చేసిన మహావృక్షం బీఆర్ఎస్ పార్టీ. అలాగే ఇటీవల మరణించిన కుసుమ జగదీశ్, పాగాల సంపత్‌రెడ్డి సహా జడ్పీ చైర్మన్లుగా, నగరపాలక సంస్థ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా చాలామంది వ్యవహరించారు.
ఉద్యమకారులను అక్కున చేర్చుకోలేదు. అవకాశాలు ఇవ్వలేదు. పాలనలో భాగస్వామ్యం చేయలేదనే ఆరోపణ పూర్తిగా సత్యం కాదని పదేండ్ల కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలన స్పష్టం చేస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో తనతో మమేకమైన అనేకమంది మేధావులు, బుద్ధిజీవుల సేవలను కేసీఆర్ వినియోగించుకున్నారు. ఉద్యమ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మీడియా వర్గాల నుంచి ఎదిగివచ్చిన అనేకమంది వారి వారి అభిరుచులు, అనుభవాలకు అనుగుణంగా ఆయా రంగాల్లో సేవలందించారు. వారి సేవలకు బీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపును, గౌరవాన్ని ఇవ్వటం తెలిసిందే. టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్‌గా ఘంటా చక్రపాణి, బీసీ కమిన్ తొలి, మలి కమిషన్ చైర్మన్లుగా బీఎస్ రాములు, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్లుగా నందిని సిధారెడ్డి, జూలూరు గౌరీశంకర్, వి.ప్రకాశ్, అయాచితం శ్రీధర్, టంకశాల అశోక్, దేవులపల్లి ప్రభాకర్‌రావు, సమాచారశాఖ కమిషనర్లుగా బుద్దా మురళి, కట్టా శేఖర్‌రెడ్డి, నారాయణ్‌రెడ్డి సహా ఎంతోమంది బీఆర్ఎస్ సర్కార్‌లో భాగమయ్యారు.
ఉపసంహారం.. గతం గణకీర్తి అని చెప్పుకొని మురిసిపోతూ.. కప్పదాటు వర్తమానం అని మనసుకు సర్దిచెప్పుకోవటం కాకుండా క్షేత్రం నుంచి బలమైన పునాదిని నిర్మించుకోవలసి ఉన్నది. తెలంగాణ పేగు బంధాన్ని తిరిగి పునర్ నిర్వచించుకోవలసి ఉన్నది. తనను తాను తవ్వి తల్లి వేరును కనుగొనవలసి ఉన్నది.
– నూర శ్రీనివాస్