HomeEditpageBreakfast Is Very Important In Our Daily Diet
మీ కడుపు సల్లగుండ
బడీడు పిల్లల్లో రక్తహీనత, పోషకాహారలోపం సాధారణంగా కనిపించే లక్షణాలు. గతంలో జరిపిన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల్లో 28.9 శాతం మంది తక్కువ బరువు, 21.8 శాతం మంది ఎత్తు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ప్రభుత్వ బడులకు వచ్చే పిల్లలు చాలామంది ఉదయాన్నే ఏం తినకుండా వస్తారు. వ్యవసాయం, కూలీ, ఇతరత్రా పనులకు వెళ్లే వారి తల్లిదండ్రులకు తీరిక ఉండకపోవడం ఒక కారణమైతే, వారి పేదరికం మరో ప్రధాన కారణం.
బడీడు పిల్లల్లో రక్తహీనత, పోషకాహారలోపం సాధారణంగా కనిపించే లక్షణాలు. గతంలో జరిపిన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల్లో 28.9 శాతం మంది తక్కువ బరువు, 21.8 శాతం మంది ఎత్తు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 5.8 శాతం మంది పిల్లలు విటమిన్ ‘ఏ’ లోపంతో 15.0 శాతం మంది విటమిన్ ‘బీ’ లోపంతో, 15.8 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన సర్వేలో 0 నుంచి 18 ఏండ్ల పిల్లల్లో 19 శాతం మందిలో జింక్ లోపం, 23 శాతం మందిలో ఐరన్ లోపం ఉన్నట్లు వెల్లడైంది. సూక్ష్మ పోషకాలు-విటమిన్లు ఎముకల దృఢ త్వం, శారీరక పెరుగుదల, రోగనిరోధకత, రక్తహీనత నివారణ, నాడులు, కండరాల సరైన పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఈ లోపాలు అధిగమించడంలో కొంత ప్రగతి సాధిస్తున్నది.
రోజువారీ మన ఆహారంలో ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యమైనది. ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత, అభ్యాసన సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. శారీరకంగా, మానసికంగా వారు ఆరోగ్యంగా ఉంటారు. వయసుకు తగిన ఎత్తు తో పాటు, బరువు పెరుగుతారు. వీటన్నింటి వల్ల రక్తహీనత, పోషకాహార లోపం నివారించబడుతుందని ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు నిర్ధారించాయి. పెరిగే వయసులో శరీరం లో అధికశక్తిని మెదడు వాడుకుంటుంది, అం దువల్ల పిల్లలకు ఉదయం అల్పాహారం తప్పనిసరి. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసుకుంటారు. పరీక్షల్లో మంచి మా ర్కులు సాధిస్తారు. జర్నల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం ఉదయం అల్పాహారం తీసుకునే విద్యార్థులు గణితం, సైన్స్ తదితర సబ్జెక్టుల్లో 25 శాతం అధిక మార్కులు సాధించారు. అల్పాహారం పిల్లల్లో సృజనాత్మక, పరిశీలనాత్మక, సమస్యాసాధన జ్ఞానాలను పెంచుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది.
జర్నల్ ఆఫ్ ఫ్రాంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం.. ఉదయం అల్పాహారం విద్యార్థులకు అవసరమైన పోషకాల్లో 60 శాతం అందిస్తుంది. వారి శారీరక, మానసిక వికాసానికి తోడ్పడుతుంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు అన్ని సర్కారు బడుల్లో అల్పాహారాన్ని అందచేయాలని నిర్ణయించడం ముదావహం.
ఉదయం ఏం తినకుండా ఖాళీ కడుపుతో బడులకు హాజరయ్యే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బెల్లం, రాగిజావతో ఆకలి తీర్చబోతున్నది. దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంతో ప్రయోజనం పొందనున్నారు. రాగిజావతో పిల్లలకు కాల్షియం, ఐరన్, విటమిన్స్, ప్రోటీన్స్, ఇతర పోషకాలు అందుతాయి. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారించబడుతుంది. కండరాల ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి, ఇమ్యూనిటీ పెంచేందు కు, మానసిక ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో వారానికి మూడు కోడిగుడ్లు ఇస్తున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి బలవర్ధక ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వనున్నది. ఇవి పిల్లల మానసిక, శారీరక వికాసానికి ఊతం ఇస్తాయి.
నేటి బాలలే రేపటి పౌరులు.. యువశక్తి సమర్థవంతంగా ఉండాలంటే పునాది స్థాయిలోనే వారిని బలోపేతం చేయాలి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న ‘విద్యార్థులకు అల్పాహార’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజానీకం స్వాగతిస్తున్నది.