2026, మే 10న తమిళనాడు అసెంబ్లీ కాలవ్యవధి ముగియనున్నది. దీంతో మార్చి-ఏప్రిల్ మధ్యలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతున్నది. ఎన్నికల కోలాహలం మొదలవడంతో తమిళనాడులో వేడి రాజుకున్నది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్డీయే కూటమి ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులను ఎన్నికల పరిశీలకులుగా ఆ పార్టీ నియమించింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. పునాదులు కూడా తీయకముందే పేకమేడలా కూలిపోతున్న ఎన్డీయేను నిర్మించే బాధ్యతను కమలం పార్టీ వీరికి అప్పగించింది.
బీజేపీ అగ్రనేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎన్డీయేలో చేరేందుకు ఏఐఏడీఎంకే సహా తమిళనాడులోని ఏ ఒక్క పార్టీ ముందుకురావడం లేదు. ఆఖరికి దళపతి విజయ్ నేతృత్వంలో నిన్న మొన్న పురుడుపోసుకున్న తమిళగ వెట్రి కళగం కూడా విముఖత చూపుతుండటం ఆ రాష్ట్రంలో బీజేపీ దుస్థితిని తెలియజేస్తున్నది. తమిళనాడు పార్టీలన్నీ బీజేపీని దూరం పెడుతుండటానికి ప్రధాన కారణం.. ఆ పార్టీ వల్ల తమకు, తమ రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదని తమిళులు తిరస్కరిస్తుండటమే.
వాస్తవానికి తమిళనాడుకు మాత్రమే కాదు, బీజేపీ వల్ల దక్షిణాదికి కూడా ఒరిగేదేమీ లేదు. పదకొండేండ్ల మోదీ సర్కార్ దక్షిణానికి దగా, దోపిడీ చేసింది తప్ప, దమ్మిడి కూడా ప్రయోజనం చేకూర్చలేదు. దక్షిణాది రాష్ర్టాల నుంచి ఏటా రూ.లక్షల కోట్ల పన్నుల రూపంలో వసూలు చేస్తున్న బీజేపీ సర్కారు.. తిరిగి వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం లేదు. బీజేపీ నిజ స్వరూపం గురించి పూర్తి అవగాహన ఉన్న తమిళ ప్రజలు మొదటి నుంచీ ఆ పార్టీని దూరం పెడుతూ వస్తున్నారు. 1980లో పురుడు పోసుకున్న బీజేపీ తరఫున ఇప్పటివరకు నలుగురు మాత్రమే లోక్‌సభ ఎంపీలుగా గెలుపొందడం తమిళనాడులో ఆ పార్టీ స్థానం ఎక్కడున్నదో తెలియజేస్తున్నది. అది కూడా మిత్రపక్షాల సహాయంతో కావడం గమనార్హం.
1998 పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో జతకట్టిన బీజేపీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. ఆ పార్టీ తరఫున కోయంబత్తూర్‌లో సీపీ రాధాకృష్ణన్, నీలగిరి నుంచి మదన్.ఎం, తిరుచ్చిరాపల్లి నుంచి రంగరాజన్ కుమారమంగళం గెలిచారు. ఆ తర్వాత 1999 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీచేసిన బీజేపీ అదనంగా మరో స్థానంలో, అంటే మొత్తం నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నది. ఆ ఎన్నికల్లో ఈ ముగ్గురితోపాటు నాగర్‌కోయిల్ నుంచి పొన్ రాధాకృష్ణన్ గెలుపొందారు. ఆ తర్వాత రెండున్నర దశాబ్దాలకు 2014లో కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్ మరోసారి గెలిచారు. వీరిలో ఒకరిద్దరూ అటు వాజపేయి ప్రభుత్వంలో, ఇటు మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసినప్పటికీ తమిళనాడుకు ఒరగబెట్టిందేమీ లేదు. అందుకే తమిళులు ఆ పార్టీని వెలివేసినంత పనిచేశారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, మన రాష్ట్రంపై బీజేపీ కనీసం సవతి తల్లి ప్రేమ అయినా చూపించడం లేదు. తల్లిని చంపి బిడ్డను బతికించారని స్వయంగా ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా చెప్పడమే ఇందుకు నిదర్శనం. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను అందినకాడికి దోచుకున్నదే తప్ప, ఆదుకున్నది లేదు. 2014లో స్వరాష్ట్రం ఏర్పడినాక ఇక్కడ ప్రభుత్వం కొలువుదీరకముందే తెలంగాణలోని ఏడు మండలాలను అప్పనంగా ఏపీకి అప్పగించేసింది. విభజన హామీలనూ విస్మరించింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీని కాటగల్పింది. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇప్పటికీ బాకీపడ్డది. ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, నవోదయ లాంటి కేంద్రీయ విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ తెలంగాణపై బీజేపీ సర్కార్ వివక్ష చూపుతున్నది. పన్నుల వాటా పంపకాల్లోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న ప్రతి రూ.100కు గానూ, రూ.31 మాత్రమే తెలంగాణకు తిరిగి ఇస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానికీ జాతీయ హోదా ఇవ్వలేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి బృహత్తర పథకాలకు కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా చిల్లిగవ్వ ఇవ్వలేదు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు మొండిచెయ్యి చూపుతున్నది. నిధుల విషయంలోనే కాదు, నీళ్ల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. న్యాయంగా, హక్కుగా తెలంగాణకు దక్కాల్సిన నీటివాటాను కూడా మనకు కేటాయించడం లేదు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు, అనుమతులను కూడా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నది. ఈ విషయాలన్నీ గ్రహించిన తెలంగాణ ప్రజలు తమిళుల వలె బీజేపీని దూరం పెడుతున్నారు. అందుకు తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే తార్కాణం.
తనను తాను అర్బన్ పార్టీగా చెప్పుకొనే బీజేపీకి గతంలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పట్టుండేది. అంబర్‌పేట, ఉప్పల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్ తదితర నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గతంలో గెలిచారు. కానీ, తెలంగాణ వచ్చాక బీజేపీ నిజస్వరూపాన్ని తెలుసుకున్న విజ్ఞులైన హైదరాబాద్ ఓటర్లు 2018తో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులను ఓడించారు. గోషామహల్లో బీజేపీ గత రెండు ఎన్నికల్లో ఎందుకు గెలిచిందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక 2023 ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీజేపీకి 14 శాతం ఓట్లు వచ్చాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 35.4 శాతం ఓట్లతో ఆ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలిచిన మాట వాస్తవమే. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ చేస్తూ కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు కావడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీ 8 స్థానాల్లో గెలిచిందనే విషయం జగమెరిగిన సత్యం. అయితే తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో ఆ పార్టీ స్థానం ఏంటో చెప్పకనే చెప్పాయి. కమలం పార్టీ తెలంగాణ వ్యతిరేకి అన్న విషయాన్ని గ్రహించిన గ్రామీణ ఓటర్లు బీజేపీని తిరస్కరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 12,735 గ్రామపంచాయతీలు ఉండగా, 1,205 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. 21 గ్రామాల్లో పలు కారణాల వల్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 11,509 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 637 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఏకగ్రీవాలు కూడా కలుపుకొంటే మొత్తంగా ఆ పార్టీ గెలుచుకున్న గ్రామ పంచాయతీలు 666 మాత్రమే. స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు బీజేపీ కంటే ఎక్కువగా 1,654 స్థానాల్లో గెలుపొందడం విశేషం. కాంగ్రెస్ సహకారంతో అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం ఓట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో తెలంగాణలో ప్రత్యామ్నాయం తామేనని, భవిష్యత్తులో అధికారం కూడా తమదేనని గప్పాలు కొట్టిన బీజేపీ.. గ్రామీణ ప్రాంత ప్రజలు కొట్టిన దెబ్బకు ఐదు శాతం సీట్లకు పరిమితమైంది.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో చాలాచోట్ల ఆ పార్టీ జెండా పట్టుకుని బరిలో నిలిచే అభ్యర్థులే కరువయ్యారు. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలాచోట్ల ఘోర ఓటమిని చవిచూశారు. అందుకే బీజేపీ నాయకుల్లో ఏ ఒక్కరూ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు.
బీజేపీలో మొదటినుంచీ ఉన్నవారికే కాదు, కొత్తగా ఆ పార్టీలో చేరే నాయకులకు కూడా తెలంగాణలో భవిష్యత్తు లేదని ఈ ఎన్నికలతో తేలిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు కమలం తీర్థం పుచ్చుకున్నారు. గతంలో వారు బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ బరిలో నిలిచినప్పుడు ప్రజలు ఆదరించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ భారీగా ఓట్లు పడ్డాయి. హుజూర్నగర్ నుంచి బరిలో నిలిచిన శానంపూడి సైదిరెడ్డికి 71,818; వర్ధన్నపేట నుంచి పోటీచేసిన ఆరూరి రమేష్‌కు 87,238; అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజుకు 66,011 ఓట్లు వచ్చాయి. ఇదంతా తమ సొంత బలమని భావించి వారు కమలం పార్టీలో చేరారు. వీరిలో నల్లగొండ నుంచి శానంపూడి, వరంగల్ నుంచి ఆరూరి బీజేపీ తరఫున పార్లమెంట్ బరిలో నిలిచి చతికిలపడ్డారు. తాజాగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఆయా నియోజకవర్గాల్లో వారికి మరోసారి పరాభవమే ఎదురైంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో 146 గ్రామ పంచాయతీలు ఉండగా, ఒక్కటంటే ఒక్కటీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలవలేదు. ఇక అచ్చంపేటలో 178 స్థానాలుండగా, వీటిలో ముక్కుతూ మూలుగుతూ రెండు చోట్ల బీజేపీ గెలువగలిగింది. వర్ధన్నపేటలో మొత్తం 83 గ్రామపంచాయతీలు ఉండగా నాలుగు చోట్ల మాత్రమే కమలం బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఈ అంకెలే చెప్తున్నాయి. అయినా ఎంగిలి చేత్తో తెలంగాణలోని కాకిని కూడా తరమని బీజేపీ ఇక్కడ ఓట్లు, సీట్లు ఆశించడం అత్యాశే అవుతుంది.
తనను తాను అర్బన్ పార్టీగా చెప్పుకొనే బీజేపీకి గతంలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పట్టుండేది. అంబర్‌పేట, ఉప్పల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్ తదితర నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గతంలో గెలిచారు. కానీ, తెలంగాణ వచ్చాక బీజేపీ నిజస్వరూపాన్ని తెలుసుకున్న విజ్ఞులైన హైదరాబాద్ ఓటర్లు 2018తో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులను ఓడించారు. గోషామహల్లో బీజేపీ గత రెండు ఎన్నికల్లో ఎందుకు గెలిచిందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మాలోతు సురేష్
98856 79876