ఎనిమిదేండ్ల కిందట జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఇప్పుడు చర్చ ఎందుకొచ్చింది? అయినా అది రాష్ట్ర విభజన కాదు, విడదీయడం అనాలి. ఎందుకంటే 1956లో బలవంతంగా కలపబడిన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చారిత్రకంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా ఎటువంటి సారూప్యం, పోలికల్లేవు. దేశంలో భాగమై పాలితుల, పాలకుల భాష మాత్రమే తెలిసి, తన ప్రాంత సంస్కృతి మాత్రమే గొప్పదనుకునే ఆంధ్రా ప్రజలు, ప్రత్యేక దేశంగా శతాబ్దాల పాటు ఉనికిని కలిగి, వివిధ దేశాల ప్రజలను అక్కున చేర్చుకొని సాంస్కృతికంగా, భాషాపరంగా అత్యద్భుతంగా ఎదిగిన తెలంగాణ ప్రజలు మానసికంగా ఐక్యత సాధించలేకపోయారు.
ఐదు దశాబ్దాల అనంతరం సుసంపన్నమైన తెలంగాణ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి వేరుపడి స్వేచ్ఛగా తన పరిపాలనలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ప్రగతి సాధించింది. ఇక్కడ శ్రీకృష్ణ కమిషన్ మీటింగ్ నాడు జరిగిన ఒక సంఘటన చెప్పుకోవాలి. తెలంగాణ సిద్ధాంతకర్తగా అందరికీ తెలిసిన జయశంకర్ సార్ శ్రీకృష్ణ కమిటీకి తన వాదన వినిపించారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కమిటీ అధ్యక్షుడు మొదటగా అడిగిన ప్రశ్న ‘ఆంధ్రతో విడిపోతే తెలంగాణ మనగలదా’ అని. దానికి సమాధానంగా సాయంత్రం ఏడింటి దాకా జయశంకర్ సార్ తెలంగాణ వనరులు, ఆదాయం, 1957 నుంచి 2009 దాకా ఆ ఆదాయాన్ని పాలకులు ఖర్చుచేసిన తీరు, అప్పటిదాకా
తెలంగాణకు జరిగిన నష్టం, ఆస్తి, ప్రాణనష్టాలు- అన్నీ వివరంగా, ఓపికగా చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ మీటింగ్ అయిపోయినప్పుడు అడిగిన చివరి ప్రశ్న ‘తెలంగాణ విడిపోతే, ఆంధ్ర బతుకగలదా?’ అని. అంతేకాదు, ఆంధ్ర వనరులు, ఎట్లా తనని తాను ఆసరాగా చేసుకోగలదో రాసి ఇమ్మని శ్రీకృష్ణ అడిగారు. విడిపోవటానికి ఆంధ్ర పాలకులు ఎందుకు అన్ని అడ్డంకులు సృష్టించారో, విడిపోయి దశాబ్దానికి దగ్గరవుతున్నా ఎందుకు ఏడుస్తున్నారో, తెలంగాణ ప్రాంతంతో పోలిస్తే ఈ ముఖ్యమంత్రి గారిని తానే తీర్చిదిద్దానని డంబాలు పలికే నలభై ఏండ్ల రాజకీయ అనుభవజ్ఞుడి పాలనలో కూడా ఆంధ్ర ఎందుకు ప్రగతి సాధించలేకపోయిందో శ్రీకృష్ణ ప్రశ్న సమాధానం చెప్తుంది.
జరిగిందేదో జరిగింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈ చర్చ ఎందుకు జరుగుతున్నది? ఆంధ్ర, తెలంగాణ అనే రెండు భిన్న ప్రాంతాలను కలిపినప్పుడు అప్పటి ప్రధాని ఈ కలయికను వివాహంతో పోల్చారు. ఆ ప్రయత్నం విఫలమైతే విడిపోవచ్చని, రెండు ప్రాంతాలు, రెండు రాష్ర్టాలుగా కావచ్చని చెప్పారు కూడా. ఎందుకంటే అత్యున్నత పదవిలో ఉన్నవారు, రెండు రాష్ర్టాలను ఒక తండ్రిలా, నిష్పక్షపాతంగా చూడవలసినవారు, విభజన సమయంలో పాలించిన పార్టీ సరిగ్గా ప్రవర్తించలేదని విమర్శించేవారు తాము గత ఎనిమిదేండ్లుగా పరిపాలిస్తూ ఆ తప్పులను సవరించకపోగా, ఆ అంశాన్ని ఇంకా రాజకీయంగా వాడుకోవాలన్న నీచబుద్ధిని ప్రదర్శించడమే ఈ చర్చకు
దారితీసింది.
2014లో పగ్గాలు చేపట్టిన బీజేపీ విభజన హామీలు నెరవేర్చి, తెలంగాణ ఆదాయాన్ని అప్పటిదాకా ఆనందంగా అనుభవించిన ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చి ఉంటే, ఇప్పుడు ప్రధాని తాము కాంగ్రెస్ చేసిన అన్యాయాలను చక్కదిద్దామని చెప్పుకొనే హక్కు ఉండేది. ఎనిమిదేండ్లు చాలవా ఒక ప్రాంతానికి సాయం చేయడానికి? అయినా గెలిచినవారికి ఐదేండ్ల కాల పరిమితి ఉంటుంది. అంటే వారు అనుకున్నవి, ప్రమాణాలు చేసినవి పూర్తిచేయటానికి ఐదేండ్ల కాలం సరిపోతుందనేగా అర్థం! మరి ఏ ఒక్కటీ
నెరవేర్చకుండా ఎప్పుడో ఓడిపోయిన పార్టీ చేయలేదని ఏడ్చేవాళ్లను ఏమనాలి? అయితే అసమర్థులనాలి, లేకపోతే అవకాశవాదులనాలి.
ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలు ఏం చేయాలో చూద్దాం! రాష్ర్టాల విభజన సరిగ్గా జరగలేదని విమర్శించే పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ రెండు తెలుగు రాష్ర్టాలలోనూ ఉన్నారు కదా! వారెక్కడ ప్రజలను కలిసినా, ఈ ఎనిమిదేండ్ల కాలంలో వారి పార్టీ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఏ రకంగా సహాయపడిందో నిలదీయాలి. ఈ నాయకులు పెద్ద గొంతుకలతో, అభ్యంతరకర భాషలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వారి రాష్ర్టాలకు ఎన్ని నిధులు, ఎంత సహాయం తెచ్చారో నిరూపించుకోవాలని నిలదీయాలి. అస్సలు ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా వారికి ఏ రకంగానూ
మద్దతివ్వకూడదు. ఏదోరకంగా ఈ రాష్ర్టాలలో అశాంతి రేపాలనీ, ప్రగతి ఆపాలని వారు చేసే ప్రయత్నాలను భగ్నం చేయాలి. ముందు ఇతర రాష్ర్టాలలో బీజేపీ ప్రభుత్వం చేసే పనులను గమనించాలి. ఎన్నికల ముందు ఆయా రాష్ర్టాలలో చేసిన బాసలు తీర్చిందా అన్నది నిశితంగా పరిశీలించాలి. ఆ పార్టీ ఎప్పుడూ ఒక్కటే ఆట ఆడుతుంది. గెలవబోయే ప్రాం తీయ పార్టీతో జతకట్టడం, దానిని ముందుకు పోనీయకుండా నాశనం చేయటం, తాను ఎదగటం, అబద్ధాలు ప్రచా రం చేయటం, ప్రాంతీయ పార్టీలను ఆగం చేయ టం. శివసేన, నితీష్‌కుమార్ వంటివారు ఇవన్నీ అనుభవిస్తున్నారు. తెలంగాణలో, ఏపీ లో సమర్థులైన నాయకులు ఉండటంతో వారి ఆటలు
సాగటం లేదు. ఈ రెండు రాష్ర్టాలు కేరళ, తమిళనాడు నాయకులు బీజేపీ వారిని అడ్డగించటానికి సమర్థులు. దీనిని ఈ నాలుగు రాష్ర్టాల ప్రజలు విజ్ఞతతో ఈ ప్రాంతీయ పార్టీల నాయకులను సమర్థించి బీజేపీ ఆటలు ఇక్కడ సాగకుండా నిరోధించాలి.
– కనకదుర్గ దంటు
89772 43484