ఇంకా నోటిఫికేషన్ కూడా జారీ కాకున్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆ రాష్ట్రంలో కాకుండా దేశ పార్లమెంటులో హోరాహోరీగా సాగుతున్నది. వరుసగా రెండో రోజైన గురువారం విపక్షం ఉభయసభలను స్తంభింపజేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ఓటర్ల జాబితా ఉధృత సవరణకు ఎన్నికల సంఘం చేపట్టిన తనిఖీల కార్యక్రమం చుట్టూ ఈ వివాదం అల్లుకున్నది. ‘ఎస్ఐఆర్’ పేరిట ఈసీ జరుపుతున్న సర్వే.. సవరణకు కాదు, ప్రక్షాళనకే అనేది విపక్షాల వాదన. అస్మదీయులు, తస్మదీయులు అనేది గుర్తించి ఏరివేయడానికి ఈ సర్వే జరుగుతున్నదనే ఆరోపణలు మొదటినుంచీ వినిపిస్తున్నాయి. స్వతంత్ర ప్రతిపత్తితో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్.. కేంద్రం చేతిలో పావుగా మారిందనే అనుమానాలను అవి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా 52 లక్షల మంది ఓటర్ల ఆచూకీ దొరకడం లేదని ఈసీ ప్రకటించడంతో విపక్షాలు అప్రమత్తమయ్యాయి. పార్లమెంటులోనే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈసీ తరఫున తాము మాట్లాడటం తగదంటూ ప్రభుత్వం చర్చను తిరస్కరిస్తుండటంతో పీటముడి పడింది.
ఎన్నికల సంఘం వ్యవహారశైలి అనుమానాస్పదం కావడానికి పలు కారణాలున్నాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కలు తారుమారు కావడం అందులో ప్రధానమైనది. ఏపీలో కూటమి పార్టీలు భారీ గెలుపు సాధించడంపైనా ఆరోపణలు వచ్చాయి. ఇక బీహార్ విషయానికి వస్తే ఎన్నికలు మరీ దగ్గర పడిన సమయంలో ఎస్ఐఆర్ చేపట్టడం, సామాన్యులు అంత సులభంగా సంపాదించలేని పత్రాలు సమర్పించాలని గొంతెమ్మ కోరికల్లాంటి నిబంధనలు పెట్టడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ‘క్షాత్ర పరీక్షే తప్ప క్షత్రియ పరీక్ష కాదే’ అన్నట్టుగా ఓటర్ల జాబితా సవరణ కాస్తా, పౌరసత్వ నిర్ధారణ పరీక్షగా మారిందనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను గుర్తించడానికి ఈసీ నిరాకరిస్తున్నది. సామాన్యుల దగ్గర అంతకుమించిన గుర్తింపు పత్రాలుండటం అసాధ్యం. ఇలాంటి విధానపరమైన ప్రాముఖ్యం కలిగిన అంశాలను కేంద్రంతో మిలాఖతుతోనే ఈసీ తెరమీదకు తెచ్చిందనేది అసలు ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నాయకత్వం ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుత పరిస్థతుల్లో బీహార్ ఎన్నికల్లో గెలవడం కేంద్రంలోని పాలక కూటమికి, ముఖ్యంగా బీజేపీకి, మరీ ముఖ్యంగా ప్రధాని మోదీకి చాలా కీలకమనేది తెలిసిందే. ఆరెస్సెస్‌తో సంబంధాలు ఊగిసలాటకు లోనవుతున్న తరుణంలో ఇది మరీ మరీ అవసరం. అందుకు ఈసీని సాధనంగా వాడుకుంటున్నదన్న విపక్షాల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఎంత ఉందో, ఈసీపైనా అంతే ఉన్నదని చెప్పక తప్పదు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో ప్రధాని, సీజేఐ, ప్రతిపక్ష నాయకుడు ఉండాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ, సీజేఐ స్థానంలో హోంమంత్రిని కేంద్ర ప్రభుత్వం చేర్చడం ఏమిటి? అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో తటస్థ మధ్యవర్తిలా ఉండాల్సిన ఈసీపై నీలినీడలు ముసురుకోవడం ఎంతమాత్రం శోభించదు.