CM Chandrababu | ఊరకరారు మహాత్ములు. అందులోనూ చంద్రబాబు వంటి మహాత్ములు. అది కూడా హైదరాబాద్ వంటి సిరిసంపదల నగరానికి. పైగా తెలంగాణ ప్రజలు తన గత రికార్డును ఇంకా మరవనైనా మరవకముందే. తన పాలన యావత్తూ తెలంగాణ పట్ల ఎంత వివక్షతో, దోపిడీమయంగా సాగిందో ఒకవేళ విస్మరించినా, చివరి దశ వచ్చేసరికి ఎట్లా ఒకవైపు విభజనకు మద్దతుగా లేఖను ఇస్తూనే మరొకవైపు విభజన బిల్లు సమయంలో దానిని వ్యతిరేకించాలంటూ ప్రత్యేక విమానంలో పలు రాష్ర్టాలు తిరిగి మద్దతులు కూడగట్టిన ద్రోహాన్ని ఇంకా క్షమించకముందే. తెలుగువారి రాజకీయ చాణక్య చరిత్రలో చంద్రబాబు ఒక ప్రత్యేక వ్యక్తి. ఆయన ఒక మహాత్ముడు. తనకు ఒక విజన్-2020 వంటిది హైదరాబాద్ నగరంపై ఇప్పటికీ ఉన్నది. అది ఒక చెదరని కల. అటువంటి మహాత్ములు ఇక్కడకు ఊరకనే రారు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించి తిరిగి అధికారానికి వచ్చారు. గత ఐదేండ్లలో అక్కడ ‘అంతా విధ్వంసమైం’దని ఎన్నికల ప్రచారానికి ముందే ప్రకటించారు. ఆ ‘విధ్వంసం’ ఎటువంటిదో అధికారానికి రాగానే శ్వేతపత్రాలు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా తమ ప్రజలకు వివరించారు. నిరంతరం కష్టించి దానినంతా చక్కదిద్దగలనని వారికి హామీ ఇచ్చారు. అంతా బాగున్నది. ఆయన ప్రమాణస్వీకారం చేసింది జూన్ 12న . కొత్త క్యాబినెట్ ఏర్పడి, శాఖలు కేటాయించి, మొదటి క్యాబినెట్ సమావేశం జరిగేసరికి మరొక 12 రోజులు గడిచి జూన్ 24 వచ్చింది. అధికారుల నియామకాలు ఇంకా పూర్తికాలేదు. శాఖల సమీక్షలు జరగలేదు. తాను అన్న విధ్వంసాన్ని ఎట్లా చక్కదిద్దాలో, అభివృద్ధి ఆలోచనలు ఏమిటో ఇంకా ప్రణాళికా రూపకల్పనలు చేయలేదు. ఇవన్నీ తక్కువ కార్యభారం కాదు.
అయినా వాటన్నింటి మధ్య చంద్రబాబుకు ఆ 24 నుంచి మరొక వారమైనా తిరగకుండా, జూలై నెల రానైనా రాకుండా, అకస్మాత్తుగా హైదరాబాద్ గుర్తుకువచ్చింది. దానితో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జూలై 1న లేఖ రాశారు. విభజన సమస్యలు పదేండ్లయినా పరిష్కారం కాలేదని, వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ర్టాల అభివృద్ధికి, ‘ఉమ్మడి లక్ష్యాల’ సాధనకు కృషి చేద్దామన్నారు. అందుకోసం చర్చలకు సమావేశమవుదామంటూ కేవలం 4 రోజుల వ్యవధితో తానే ఒక తేదీని కూడా సూచిస్తూ లేఖ రాశారు. అది జూలై 6. చంద్రబాబు స్వయంగా అన్నట్లు అవి నిండు పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు. అంత క్లిష్టమైనవి. ఆ పదేళ్లలో రెండు రాష్ర్టాలు ఉన్నతాధికారుల మధ్య, ఒక్కోసారి మంత్రుల ప్రమేయంతో, తరచూ కేంద్ర హోంశాఖ నిర్వహణలో చర్చలు అనేకసార్లు జరిగాయి. కానీ తేలిన అంశాలు కొద్ది మాత్రమే. అవి ఎప్పటికీ తేలనివని కాదు. అదే సమయంలో తేలిక కాదు. ఆ విషయమై చంద్రబాబు చొరవ తీసుకోవటం, రేవంత్‌రెడ్డి సమ్మతి, ఉభయుల చర్చలు యథాతథంగా ఆహ్వానించదగ్గవే. ఇదంతా స్థూలమైన దృష్టి. కానీ, ఇటువంటి దీర్ఘకాలికమైన, క్లిష్టమైన అంశాలకు సంబంధించి సూక్ష్మదృష్టి అనేది ఒకటుంటుంది. దాని ప్రకారం, ముఖ్యమంత్రులనే అత్యున్నత స్థాయిలో చర్చలకు ముందు, ఉన్నతాధికారులు చర్చించి విషయాలను కనీసం వీలైనంత మేర ఒక కొలిక్కి తేవాలి. ప్రస్తుత సందర్భంలో అటువంటిదేమీ జరగలేదు. చంద్రబాబుకు అప్పుడప్పుడే అధికారం, అప్పుడే మంత్రివర్గ నిర్మాణం వంటివి జరిగి, శాఖలపై సమీక్షలైనా చేయకుండా ఇంతలోనే లేఖ అంతలోనే చర్చలన్న తీరుతోనే అంతా అనుమానాస్పదంగా మారుతున్నది. ఎందుకింత ఆతురత అన్నది సందేహం.
చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు, సూక్ష్మబుద్ధి, చాణక్యుడు గ్రహించలేని విషయాలు కావివి. తన చిరకాల మిత్రుడు, తన పట్ల ఇప్పటికీ ఎంతో ప్రశంసాభావం గల రేవంత్‌రెడ్డి, చర్చల ప్రతిపాదనకు సమ్మతించటంలో విశేషం లేదు. కానీ పైన చెప్పుకున్న వివిధ విషయాలన్నీ తెలిసిన చంద్రబాబు పరమోద్దేశాలు ఏమిటై ఉండవచ్చునన్నదే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించవలసిన, అర్థం చేసుకోవలసిన ప్రశ్న. అందుకు సమాధానం ఇరువురు సమావేశమైన జూలై 6న ఏమీ లభించలేదు. అది షరామామూలుగా జరిగింది. అయినప్పటికీ దానిని ఒక ఆరంభంగా తీసుకొని మునుముందు ఏవైనా రాజీలు జరిగితే తప్పక సంతోషించవలసిందే. అయితే, పైనంతా చర్చించుకున్నట్లు, చంద్రబాబు ఈ విధమైన, ఆకస్మికమైన, హడావుడి ప్రతిపాదనలోని పరమోద్దేశాలు ఏమై ఉండవచ్చునన్నది ప్రశ్న.
ఇందుకు సూచనప్రాయ సమాధానాలు మనకు రెండు దశలలో లభిస్తున్నాయి. ఒకటి, 6వ తేదీ సమావేశం కోసం 5వ తేదీ సాయంత్రం చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకున్నప్పుడు ఇక్కడ టీడీపీ వర్గాలు, ఇతర అభిమానులు చేసిన అసాధారణమైన హడావుడి. అంతకన్న ముఖ్యంగా 6వ తేదీ చర్చల తర్వాత 7వ తేదీన ఆయన ఎన్టీఆర్ భవన్లో చేసిన ప్రసంగం. వీటిలో మొదటిదానిని గమనిస్తే, మామూలుగానైతే ఇక్కడ చంద్రబాబు అభిమానులు తగినంతమంది ఉన్నారన్నది వాస్తవం. అట్లాగే, ఆయన తిరిగి అధికారానికి రావటం వారిలో ఉత్సాహాన్ని కలిగిస్తుందనేది కూడా అంతే వాస్తవం. అయితే, పైకి సాధారణంగా, అమాయకంగా కనిపించే అంశాలు ఒకోసారి నిర్వాహకుల రహస్యోద్దేశాలకు తెరవెనుక నుంచి ప్రేరకాలు, దోహదకారులు అవుతాయి. ఇది సామాజికంతో ముడిపడిన రాజకీయ సూత్రం. ఇక 7వ తేదీన జరిగింది అన్నింటికన్న ముఖ్యమైనది. చంద్రబాబు జూలై 1న అంత ఆకస్మికంగా లేఖ ఎందుకు రాశారన్న దాని నుంచి మొదలుకొని, ఇక్కడ తెలంగాణలో తన భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన ఆలోచనలు ఏమిటన్నంతవరకు అన్నింటికి క్లూలు అందులో కనిపిస్తాయి తన 7వ తేదీ నాటి ప్రసంగంలో.
చంద్రబాబు అసలు ఉద్దేశాలు అవి. కాకపోతే వాటిని పదేండ్ల విభజన సమస్యల పరిష్కారం, రెండు తెలుగు రాష్ర్టాల అభివృద్ధి అనే అందమైన మాటల ముసుగులో దాచిపెట్టారు. ఈ ముసుగు అనే ఎత్తుగడను ట్రోజన్ హార్స్ ఎత్తుగడతో పోల్చవచ్చు. ఇప్పుడు కథలు, చరిత్రలు చదవటం తగ్గింది గనుక ట్రోజన్ హార్స్ కథ ఏమిటో రెండు మాటలు చెప్పుకోవాలి. ఈ కథ గ్రీకు పురాణాల లోనిది. గ్రీకు రాజులు ట్రాయ్ నగరాన్ని జయించేందుకు పదేండ్ల పాటు విఫలయత్నం చేస్తారు. పదేండ్ల పాటు అనగానే చంద్రబాబు హైదరాబాద్ కోసం పదేండ్ల పాటు సాగించిన ప్రయత్నాలు కాకతాళీయంగా గుర్తుకువస్తే అది వేరే విషయం. అదట్లా ఉంచితే, గ్రీకు రాజులు చివరికి ఒక ఎత్తుగడ వేస్తారు. దాని ప్రకారం భారీ సైజులో ఒక కొయ్యగుర్రాన్ని తయారుచేసి, దానిలోపల మెరికల్లాంటి యోధుల్ని నింపి, ట్రాయ్ నగరపు గేట్ల వద్ద ఒక రాత్రి వదలుతారు. దానిని ఉదయం చూసిన ట్రాయ్ వాసులు ముచ్చట పడి కోటలోకి తోసుకుపోతారు. ఆ రాత్రి గ్రీకు సైనికులు ఆ గుర్రం పొట్టలోంచి బయటకు వచ్చి గేట్లు తెరవగా, గ్రీకు సైన్యం లోపల చొరబడి నగరాన్ని స్వాధీనం చేసుకుంటుంది.
ఇప్పుడు చంద్రబాబు విభజన సమస్యల పరిష్కారం, రెండు తెలుగు రాష్ర్టాల అభివృద్ధి అంటున్నది ఆ ట్రోజన్ హార్స్ వంటి ఎత్తుగడే. కాకపోతే రెండింటికి ఒక తేడా ఉన్నది. గ్రీకుల కొయ్యగుర్రంలో పారదర్శకత లేదు. చంద్రబాబుది పారదర్శక కొయ్యగుర్రం. తన ఉద్దేశాలు, ఎత్తుగడలు మనకు తేలికగా అర్థమవుతాయి. నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండినపుడు తెలంగాణకు చేసిందేమిటో, తన రెండు కండ్ల సిద్ధాంతమేమిటో, విభజన సమయంలో సాగించిన కపట రాజకీయాలు ఏమిటో, వీటన్నింటికి ముందు ఎన్టీఆర్ విషయంలో చేసిందేమిటో, సమస్తం పాదర్శకంగానే ప్రజలకు తెలిసిపోయాయి. తను గాఢంగా నమ్మే ఆర్థిక సంస్కరణల ఫిలాసఫీ పారదర్శకత అవసరాన్ని నొక్కిచెప్తుంది. ఆ ఫిలాసఫీ ఆచరణ నిజంగా అంత పారదర్శకత కాదన్నది వేరే విషయం. కానీ, చంద్రబాబు రాజకీయ ఆచరణ మాత్రం చాలావరకు పారదర్శకమే. ఆ విధంగా ఆయన విభజన సమస్యల పరిష్కారం, రెండు తెలుగు రాష్ర్టాల అభివృద్ధి పేరిట ఒక ట్రోజన్ గుర్రాన్నయితే తెలంగాణపైకి వదిలారు గాని, ఆ ఎత్తుగడలోని పరమోద్దేశాన్ని 7వ తేదీనాటి ఎన్టీఆర్ భవన్ ప్రసంగంలో ఎంతో పారదర్శకంగా వెల్లడించారు.
చంద్రబాబు ప్రసంగ విశేషాలను తన అనుయాయులతో పాటు తెలంగాణ ప్రజలు అమితాసక్తితో చదివే ఉంటారు గనుక, ఇక్కడ మళ్లీ రాయనక్కరలేదేమో. ఆంధ్ర ధనిక వర్గాల వలస పాలనపై దశాబ్దాల పోరాటాన్ని చివరి పదిహేనేండ్లలో విజయవంతం చేసి, తర్వాత పదేండ్లలో ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా సుస్థిరం చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదు. తెలంగాణ స్వతంత్రతపై కాంగ్రెస్‌కు 1956 నుంచి కూడా శ్రద్ధ లేదు. వారి చరిత్ర యావత్తు అధికారం కోసం కాంట్రాక్టుల కోసం సీమాంధ్రులతో కుమ్మక్కు అయ్యి వారికి ఊడిగం చేస్తూ తెలంగాణకు ద్రోహం చేయటం, ఉద్యమాలను అణచివేయటమే. తమ కూటమి పక్షమైన బీజేపీ ఫెడరలిజానికి వ్యతిరేకి కాగా, ఆ పార్టీ ప్రధాని తెలంగాణ ఏర్పాటునే పలుమార్లు అవమానించినవాడు. ఇక చంద్రబాబు ఒక ఘన విజయం సాధించి ఊపు మీదున్నవాడు. తమకు తెలంగాణలో వివిధ సామాజిక, ఆర్థిక వర్గాల మద్దతు గలవాడు. కనుక తెలంగాణలో, మరీ ముఖ్యంగా సిరిసంపదల హైదరాబాద్ గడ్డపై తిరిగి కాలుమోపేందుకు ఇది తగిన అదను అని ఆయన నమ్ముతున్నట్టు తన ఎన్టీఆర్ భవన ప్రసంగం అరచేతి ఉసిరిక వలె తెలియజెప్తున్నది. వారికి హైదరాబాద్‌పై, తెలంగాణపై ఆశలు, కేసీఆర్‌పై కక్షలు ఇంకా చావలేదు.
తక్కినవి అట్లుంచి త్వరలో రానున్న అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలు. అందుకోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పనిచేస్తే ఆశ్చర్యపడనక్కరలేదు. అదిగాక అధికారం కోసం ఆశపడే తొత్తులు తెలంగాణలో ఇప్పటికీ కొందరు లేకపోలేదు. తాము ఇప్పటికిపుడు పై చేయి సాధిస్తారనే ఆశ చంద్రబాబుకు లేకపోవచ్చు. కానీ, ఆయన 7వ తేదీన స్వయంగా అన్నట్టు, తెలుగుదేశం పుట్టిన తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీ పసుపు జెండా ‘తిరిగి’ రెపరెపలాడటం మొదలుపెడితే, ప్రస్తుతానికి అదే ఒక విజయం అవుతుంది. అందువల్ల, ఇన్నిన్ని పని వత్తిళ్లు అమరావతిలో ఉండినా, హైదరాబాద్‌కు ఊరకనే రారు ట్రోజన్ హార్స్ మహాత్ములు.
– టంకశాల అశోక్