2001కి ముందు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఏ ఉద్యమమూ నిలబడలేకపోయింది. ఇదిలా ఉంటే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారు. ఈ తరుణంలో స్వరాష్ట్ర పాలన ద్వారా నే తెలంగాణ బాగుపడుతుందని భావించిన తెలంగాణ ఉద్యమ రథసారథి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటం జరిగింది. దీంతో సబ్బండ వర్ణాల్లో చైతన్యం వచ్చింది.
పద్నాలుగేండ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరి రాష్ర్టాన్ని స్వయంగా పాలించుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతున్న పథకాలను యావత్ దేశమే అనుసరిస్తున్నది. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్రంలోని పలువురు మంత్రులు ఒప్పుకోవడం తెలంగాణలోని పాలనాతీరుకు నిదర్శనం.
కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సాధిస్తామనే ధీమాతో ఆయన వెంట తెలంగాణ యావత్ ప్రజానీకం నడిచింది. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు, ఉద్యమకారులకు, యువకులకు ప్రాధాన్యం ఇవ్వడంలో కేసీఆర్ ముందుంటున్నారు. పార్టీ కోసం, పార్టీ నిబంధనలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేసినవారికి సముచిత స్థానం కల్పించి, గౌరవించుకుంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ఆయా పార్టీలు యువకులను తమ స్వలాభం కోసం వాడుకోవడం తప్ప అవకాశాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇందుకు జాతీయ పార్టీలూ అతీతం కాదు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ 2014 నుంచే ఉద్యమకారులకు, యువతకు ప్రాధా న్యం ఇవ్వడంలో ముం దున్నది. 2014 సాధారణ ఎన్నికల్లో పది మందికి పైగా యువతకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నది. యువతను చట్టసభల్లోకి పంపిన ఘనత ఉద్యమ పార్టీది. చాలామంది యువకులను కార్పొరేషన్ చైర్మన్లుగా, సభ్యులుగా నియమించుకొని గౌరవించుకున్నది. 2018 సాధారణ ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న విద్యార్థి నాయకులకే ప్రాధాన్యం ఇచ్చారు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీల్లో విద్యార్థి నాయకులను వాడుకోవడమే తప్ప, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వడమంటూ జరగకపోవడం శోచనీయం.
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జరిగిన 12 స్థానిక సంస్థల కోటాలో ఆరు స్థానాలను బీఆర్ఎస్ ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నది. మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఆరు స్థానాలనూ బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం విశేషమైతే, ఆ ఫలితాలు వెలువడిన సాయంత్రం లోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు దళిత, యువ ఉద్యమకారులను ఆయా కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యమపార్టీ బీఆర్ఎస్ మాత్రమే యువతను రాజకీయాలలో భాగస్వామ్యం చేస్తున్నది. రాజకీయ పట్టు కోసం యువతను వాడుకొని వదిలేసే జాతీయపార్టీలు యువతకు ప్రాధా న్యం ఇవ్వడంలో నిరాసక్తిని ప్రదర్శిస్తున్నాయనే విషయాన్ని ఆయా పార్టీల్లోని యువత గమనించాలి. ఆచితూచి అడుగువేసే ఉద్యమ అధినేత కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు, కల్పించే అవకాశాలు అద్భుతంగా ఉంటాయనడంలో సందే హం లేదు.
భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ మరింత పటిష్ఠమైన రాజకీయశక్తిగా ఎదగడానికి జిల్లాలవారీగా ఉన్న విద్యార్థి నాయకత్వా న్ని గుర్తించాలి. శిక్షణా కార్యక్రమాలతో యువతను బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయాలి. దీంతోపాటుగా బీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయశక్తిగా మార్చడానికి యువత కూడా కృషిచేయాలి. మన ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే పార్టీతో నడిస్తే అవకాశాలు పుష్కలంగా లభిస్తాయనియువత గ్రహించాలి. రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ వెంట నడవాల్సిన అవసరం ఉన్నది.
సంపత్ గడ్డం: 78933 03516