తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి గారికి బహిరంగ లేఖ
విషయం: కులగణన చేపట్టడం గురించి.
గౌరవనీయులైన రేవంత్‌రెడ్డి గారికి నమస్కారం..
BC Reservations | బీసీలు అధికారానికి, అవకాశాలకు, అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిన కులాలుగానే మిగిలిపోతున్నారు. దురదృష్టవశాత్తు ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పుడూ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప ఏనాడూ వారికి తగినంత ప్రాతినిధ్యం కల్పించడం లేదు. పార్టీలు తమ అధికార, ధన, కుల బలాన్ని ఉపయోగించి బీసీలను ఓటర్లుగానే పరిగణిస్తున్నాయి. ఒకరిద్దరికి అవకాశాలు కల్పించి మొత్తం బీసీల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారు.
1961 జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక బీసీ రిజర్వేషన్లు రాష్ర్టానికో రకంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తుంటే.. బీసీలకు మాత్రం జనాభాలో సగం నిష్పత్తికే ఇస్తున్నారు. మండల్ కమిషన్ ప్రకారం.. దేశంలో బీసీలు 52 శాతం ఉండగా.. రిజర్వేషన్లు మాత్రం 27 శాతమే అమలవుతున్నాయి. ఇక ఓసీల జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికీ ఏ సర్వే లేకుండానే నేరుగా ఎస్టీల కంటే ఎక్కువగా 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్లలో ఎస్సీ, ఎస్టీలకే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
తెలంగాణలో బీసీలు 60 శాతానికి పైగా ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో కలిపితే 93 శాతం ఉంటారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ వర్గాలదే రాజ్యాధికారం. అంటే ఈ లెక్కన 60 శాతం ఉన్న బీసీలకే రాజ్యాధికారం దక్కాలి కదా! దేశంలోని అన్ని రాష్ర్టాల్లో బీసీలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ, ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో ఒక్క బీసీ వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాలేదు. రాజ్యాంగం కల్పించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి రాజకీయ పార్టీలు కట్టుబడటం లేదు. రాజకీయ నాయకుల మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదు.
2022లో ఉదయ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో మీ (కాంగ్రెస్) పార్టీ కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపట్టి సామాజిక న్యాయం చేస్తామని భారత్ జోడో యాత్రలో మీ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పదే పదే చెప్పారు. అలాగే మీరు కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. అంతేకాదు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు బీసీ సబ్‌ప్లాన్‌ను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తెస్తామన్నారు. అంతేకాకుండా, బీసీల అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం చేశారు. ప్రతి జిల్లాలో బీసీ భవన్‌తో పాటు రుణాలు, మండలానికో బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు.
సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన మాటలను మీకు గుర్తుచేస్తున్నాను. ‘బలహీనవర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశం. ఇంతకాలం పాలితులుగా ఉన్నవారిని రాబోయే రోజుల్లో పాలకులుగా తయారు చేయడమే మా లక్ష్యం. కులగణన చేపట్టి రాజకీయ ప్రాధాన్యంతో పాటు జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం’ అని మీరు హామీ ఇచ్చారు. మీ హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయే తప్ప అమల్లోకి రావడం లేదు.
ఈ సందర్భంగా మీకో విషయం గుర్తుచేయదలుచుకున్నాను. 2021లో జనగణనలో బీసీల కులగణన కూడా చేయాలని నాటి సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ‘సమాజంలోని పేదవర్గాల సముద్ధరణను దృష్టిలో ఉంచుకొని, నిరుపేదలకు లబ్ధి చేకూర్చడం కోసం వివిధ సంక్షేమ చర్యలు చేపట్టడానికి కచ్చితమైన గణాంకాలు నిర్వహించాల్సి ఉన్నది. సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పౌరులకు సంబంధించి రాజ్యాంగంలోని సెక్షన్ 15 రూల్ 4, 5, సెక్షన్ 16 రూల్ 4, సెక్షన్ 243 (టీ) రూల్ 6 మేరకు 2021 సాధారణ జనాభా లెక్కలను నిర్వహించేటప్పుడు కులాలవారీగా వెనుకబడిన తరగతుల జనాభా లెక్కలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ శాసనసభ కోరుతున్నది’ అని తీర్మాన పత్రాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో చదివి వినిపించారు.
చివరిగా మిమ్మల్ని నేను కోరుతున్నది ఒక్కటే. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు మీ ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీల వాటా ఎంతో తేల్చాలి. బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన మీరు ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాదాపు 24 వేల మంది బీసీలు అదనంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా మారుతారు. ఈ నేపథ్యంలో కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా.
అలాగే బీసీల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి 2024-25 పద్దులో రూ.9,200 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని బట్టి చూస్తే.. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమవుతున్నది. మీరు ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఇలాగే మీరు కాలయాపన చేస్తే ఏ బీసీలైతే మిమ్మల్ని అధికార పీఠంపై కూర్చోబెట్టారో అదే బీసీలు గద్దె దింపడం ఖాయం.
– బూడిద బిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే