గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులగణన చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌నూ విడుదల చేసింది. ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకునేందుకే ఈ వాగ్దానాలు చేసిందా? లేక ఆయా వర్గాలకు న్యాయం చేయడానికి చిత్తశుద్ధితో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేస్తుందా? అని రెండు కోట్ల మంది బీసీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధిగా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు సమ వాటా ఇవ్వకుండా ఆ ఎన్నికలను నిర్వహిస్తే ఆ పార్టీ బడుగు, బలహీన వర్గాలను మరొకసారి మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. 2023 ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కులగణన చేస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జగిత్యాల, వరంగల్ జిల్లా పర్యటనల్లో రాహుల్‌గాంధీ గట్టిగా చెప్పారు. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీ జనాభాను తమ వైపునకు తిప్పుకోవటం తప్ప మరోదారి లేకనే కాంగ్రెస్ బీసీ కులగణనను నినాదాన్ని ఎత్తుకున్నదన్న భావన బీసీ ఆలోచనాపరుల్లో ఉన్నది.
2023 ఎన్నికల్లో కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ సుప్రీం తీర్పుకు విరుద్ధమైనది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల్లో విద్య, ఉద్యోగ రిజర్వేషన్లలో మొత్తంగా 50 శాతం రిజర్వేషన్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలుండగా 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామనటం పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమైనది. బీసీలకు స్థానిక సంస్థల్లో సమ వాటా కేటాయించాలంటే ముందుగా పార్లమెంటులో పంచాయతీరాజ్ చట్టా న్ని రాజ్యంగ సవరణ చేయాలి. అది జరుగకుండా బీసీ రిజర్వేషన్లు పెంచటం అసాధ్యం. బీసీలకు గ్యారెంటీ పథకాలు ప్రకటించినట్టుగానే బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని పదేపదే చెప్పారు. బీసీ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నమే తప్ప ఇది మరొకటి కాదని కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వారెవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉందని నిరూపించదలచుకుంటే బీసీ కులగణనను వెంటనే చేపట్టాలి.
బీసీ కులగణన చేయకుండా, బీసీ సామాజికవర్గాల లెక్కలు తేల్చకుం డా 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? బీసీలు 50 శాతానికి పైగా ఉంటే 42 శాతం రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? ఇందుకు సంబంధించిన, సమగ్రమైన అధ్యయనం జరుగకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధ్యం కావు. ఒకవేళ ఓటరు లిస్టుల ఆధారంగా బీసీల లెక్కలు తీసే వేరే పద్ధతి చేపట్టినా బీసీలలో ఉన్న 130 కులాల సమగ్ర సమాచారం తెలియదు. ఇందుకోసమైనా హౌజ్‌హోల్డ్ సర్వే చేయవలసి ఉంటుంది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వటమే కాకుండా అన్ని బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. రాష్ట్రంలో 130 బీసీ కులాలకు సంబంధించి ఇప్పటివరకు 7 నుంచి 10 బీసీ కులాలు తప్ప 120 కులాలకు ఇంతవరకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం లేదు.
పంచాయతీ సభ్యులుగా కూడా అడుగుపెట్టని బీసీ లు, అత్యంత వెనుకబడిన బీసీలు, సంచార, అర్ధ సంచార బీసీలున్నారు. వీళ్లందరి లెక్కలు తీయాలి. ఏ కులం జనాభా ఎంత ఉం ది? జనాభా దామాషా పద్ధతిలో ఏయే కులానికి ఎన్ని సీట్లివ్వాలో తేల్చితేనే అన్ని బీసీ కులాలకు సమప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. ఈ పని చేయకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎట్లా నిర్ధారిస్తారో కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీలు మరొక్కసారి మోసపోకుండా బడుగులు తమ చైతన్యాన్ని పదును పెట్టుకోవాలి. సంఘటితంగా స్థానిక సంస్థల్లో తమ వాటా తాము సాధించుకోవాలి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్, నాగ్‌పూర్ బీసీ డిక్లరేషన్, ఉదయపూర్ బీసీ డిక్లరేషన్లను చేసింది కాని ఆచరణలో మాత్రం శూన్యం. తను చెప్పిన మాటపై నిలిచిందా చూడాలి. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి ఎంపీ సెగ్మెంట్లో రెండు ఎమ్మెల్యే స్థానాలను బీసీలకు ఇస్తానన్నది. తెలంగాణలో ఎన్ని సీట్లిచ్చిందో చూశాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌తో 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తానన్నది. ఇది కులగణన జరగకుండా సాధ్యం కాదు.
కులగణన జరిగితే అది సామాజిక మార్పునకు సంకేతమవుతుంది. దేశ పాలకులు వాగ్దానాలు ఎన్నయినా చేస్తారు కానీ బీసీలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను చేయటంలో మాత్రం ముందుకురారు. దేశంలోని బీసీ సమస్యలు ఇన్నేండ్లు నాన్చి తొక్కేసింది కాంగ్రెస్ అయితే, రిజర్వేషన్లు అమలు జరిపేందుకు ఒప్పుకోమని బీజేపీ తెగేసి చెప్తున్నది. కులగణనను చేస్తారని బీసీలు ఆశగా ఎదురుచూడటం సహజమే కానీ, చరిత్ర పేజీలు తిరగేస్తే కాంగ్రెస్ ఆ పని చేస్తుందనే నమ్మకం లేదని తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కసారిగా 6 వేలకు పైగా గ్రామరాజ్యాలు బీసీల చేతుల్లోకి పోవడం ఆధిపత్య వర్గాలు జీర్ణించుకోలేని విషయం. అందుకే ఏదో ఒకరకంగా అడ్డుపడి తీరుతాయి. రాజకీయాలను పక్కనపెట్టి బీసీలంతా ఐక్యమై ఒక్కతాటిపై నిలిచి పోరాడినప్పుడే కులగణనతో పాటుగా 6000 స్థానిక రాజ్యాలు బీసీల చేతుల్లోకి వస్తాయి. ఇది ఒకరకంగా గ్రామీణ తెలంగాణ రాజకీయ వ్యవస్థలో పెను విప్లవంగా మారుతుంది. ఇది తెలంగాణ సమాజానికి కొత్త మలుపు.
– జూలూరు గౌరీశంకర్