బతుకమ్మ అంటే నాకు పూల అమరిక అని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే నాతో పాటే పుట్టి, పెరిగినట్టే ఉంటుంది. దసరా సెలవులకు నా మేనత్తల ఇంటికి పోయినా, పెద్దమ్మల ఇంటికి పోయినా, ఆఖరికి నాకు పెళ్లయినా.. నాతో పాటు అత్తింటికి వచ్చినట్టే అనిపిస్తుంది. మొత్తంగా బతుకమ్మ ఎప్పుడూ నాతోనే ఉన్న భావన. ఈ భావన నాకే కాదు, తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి ఆడపడుచుకూ ఉంటుంది.
మా ది సదాశివనగర్. నాన్న ఉద్యోగ రీత్యా రామారెడ్డిలో ఉండేవాళ్లం. సెలవులొస్తే చాలు సదాశివనగర్‌కు పోయేటోళ్లం. లేదా మా పెద్దమ్మవాళ్ల ఊరు కామారెడ్డికి, లేకుంటే పెద్ద మేనత్త ఉండే అడ్లూర్ ఎల్లారెడ్డికి పోయేటోళ్లం. దసరా సెలవుల్లో పెదనాన్న, ముగ్గురు చిన్నాన్నల కుటుంబాలన్నీ ఒక్కగూటికి చేరేవాళ్లం. మేమంతా కలిస్తే ఇల్లంతా సందడే సందడి. మా ఊళ్లో మెయిన్ రోడ్డుకు సత్తే పీర్ దర్గా ఉంటది. ఆ మసీదు మొత్తం అల్లుకున్న జాజిపూల తీగ ఉంటుంది. అక్కడికిపోయి జాజిమొగ్గలు తెంపుకొచ్చిన రోజులు నేనింకా మర్చిపోలేదు.
బతుకమ్మ పేర్చేందుకు గునుగు, తంగేడు పూల కోసం పొలాలు, రోడ్ల వెంబడి తిరిగేవాళ్లం. పొద్దున్న నాలుగు గంటలకే పెదనాన్న స్నానం చేసి, పూజ ముగించుకొని బతుకమ్మ పేర్వడానికి సిద్ధమయ్యేవాడు. అందరం తలో చేయి వేసేవాళ్లం. పళ్లెంలో మొదట ఆంజేపుకాయ తీగ ఆకులను పెట్టి, ఆ తర్వాత రెండు వరుసలు గునుగు పూలు పేర్చి, మూడో వరుస తంగేడు పూలు పేర్చేది. అవి కదలకుండా ఉండేందుకు మధ్యలో తంగేడు, గునుగు ఆకులు పోసేది. దాన్ని పొట్ట నింపు డు, కడుపు నింపుడు అనేవాళ్లం. బతుకమ్మ పేర్చేటప్పుడు పెదనాన్న ఎన్నో విషయాలు చెప్పేవాడు. కానీ, మాకేమో బతుకమ్మ అయిపోంగనే పెరట్లోకి పోయి జామకాయలు తెంపుకొని తినుడుతోనే సరిపోయేది. సాయంత్రం బతుకమ్మ ఆడటానికి పోయేటప్పుడు పచ్చ గోర్మీటి (డిసెంబర్) పూలు పెట్టుకునేవాళ్లం.
ఇక సాయంత్రం మేం (పిల్లలు) మాత్రమే రోజు గుడి దగ్గరికి పోయేది. ఒక ఇత్తడి టిఫిన్ డబ్బాలో అటుకులు పోసి కొద్దిగ నెయ్యి, చెక్కర వేసి కలిపిస్తే రోజూ తీసుకుపోయేది. కనీ, మిగతా దోస్తులు తెచ్చుకున్న ఆహార పదార్థాలు నోరూరించేవి. బాల్యం కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని తొందరగానే మరపులోకి నెట్టివేసేది. ఇప్పుడు కొంతమంది తప్ప, మిగతావారు మొదటి, చివరి బతుకమ్మ మాత్రమే పేరుస్తున్నారు. పెద్ద బతుకమ్మ ముందురోజు దాదాపు రాత్రి పన్నెండు వరకు ఇంట్లో అందరం కూర్చొని రెండు మూడడుగుల బతుకమ్మ పేర్చేవాళ్లం. చివరికి శిఖరం పెట్టి, తాళ్లతో కట్టి దేవుడి గది ముందు అలికి, ముగ్గేసి అక్కడ బతుకమ్మ ను పెట్టి నిద్ర పోయేవాళ్లం. తెల్లారి ఇంకో చిన్న బతుకమ్మ పేర్చేవాళ్లం. సాయంత్రం మళ్లీ పసుపు, కుంకుమ వేసి రెండు బతుకమ్మలను పెద్ద వాకిట్లో పెట్టి ఆడి, పాడి తర్వాత గుడి దగ్గరికి తీసుకుపోయేవాళ్లం. తర్వాత అర్ధరాత్రి వరకు పాటలు పాడేవాళ్లం.
ఇక పాటల విషయానికి వస్తే మా ఇంటి చుట్టుము ట్టు ఉన్న అమ్మలక్కలు ఒక్కో పాట గంటన్నర అయినా ఆపకుండా, దమ్ము తీయకుండా పాడేవాళ్లు. చప్పట్ల మధ్య లయబద్ధంగా ఆ పాటలు సాగేవి. అర్ధరాత్రి దాకా బతుకమ్మ ఆడిన తర్వాత అందరం కలిసి కాలువలు, చెరువుల్లో ఆ బతుకమ్మలను ‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా.. మళ్లొచ్చే ఏడాదికి మళ్లీ రావమ్మా’ అంటూ సాగనంపేది. ఇప్పుడైతే ఎవరి సంఘాలు లేదా గుళ్లు, కమ్యూనిటీ హాళ్ల దగ్గరే పెద్ద నీటి కొలనులను ఏర్పాటు చేసుకొని అక్కడే ఆటపాటలతో గౌరమ్మను సాగనంపుతున్నరు. మా చిన్నతనంలో అలా కాదు. అందరం పసుపు, కుంకుమలు ‘ఇచ్చుకోవమ్మ వాయి నం, పుచ్చుకోవమ్మ వాయినం’ అంటూ పరస్పరం స్వీకరించి, తెచ్చుకున్న పిండివంటలు ఒకరికొకరు రుచి చూపించేవాళ్లం. మళ్లీ ఇంటికి చేరుకున్నాక ఆడవాళ్లు ఖాళీ తాంబాళాలతో బతుకమ్మ ఆడేవాళ్లం. బతుకమ్మ పాటలు ఎంత అర్థవంతంగా ఉంటాయో తెలంగాణ లోని ప్రతి ఆడబిడ్డకు తెలిసిన విషయమే.
ఆ పాటల్లో నాకే కాదు, అందరికీ చటుక్కున గుర్తొచ్చేది ‘ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో’ పాటనే. నాకు బాగా నచ్చిన పాట, నేను మా గల్లీలో తప్పక పాడే పాట…
‘ఆకాశాన పొయ్యేటి ఉయ్యాలో
అడవి పక్షుల్లారా ఉయ్యాలో
ఆకలాయెనే హంస ఉయ్యాలో
దూపలాయెనే హంస ఉయ్యాలో..’
ఈ పాట ఎందుకో నాకే కాదు, చాలామంది తెలంగాణ ఆడపడచుల జీవితాలకు దగ్గరగా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం.
(నేడు ఎంగిలిపూల బతుకమ్మ)