సోయిలేని కాంగ్రెస్ పాలనలో బతుకమ్మ తీరు మారింది. స్వరాష్ట్ర ఉద్యమానికి నేపథ్యంలా నిలిచిన ప్రజల పండుగ అయిన బతుకమ్మకు ఆదరణ కరువై కళ తప్పుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగుబాటు బావుటాలా ఎగిసిన బతుకమ్మ, కేసీఆర్ పాలనలో కీర్తి బావుటలా విలసిల్లిన బతుకమ్మ, కాంగ్రెస్ పుణ్యమా అని స్వరాష్ట్రంలో అనాదరణకు గురవుతున్నది. మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు చిన్న గా చిహ్నాల మార్పుతో మొదలుపెట్టి ఏకంగా తెలంగాణ తల్లినే మార్చే శారు. అమ్మ చేతిలో బతుకమ్మను మాయం చేశారు. ఇవీ తెలంగాణ తల్లి పట్ల, ఆ తల్లి గుండెల్లో నెలకొన్న బతుకమ్మ పట్ల వారికున్న భక్తిశ్రద్ధలు.
ఇప్పుడు బతుకమ్మపైనే శీతకన్ను వేసి ప్రజల సెంటిమెంటుతో ఆటాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో బతుకమ్మ కష్టాలు అన్నీఇన్నీ కావు. సంబురాలు జరిపేందుకు పంచాయతీలకు ఇచ్చే నిధులకు మొం డిచేయి చూపింది సర్కారు. బతుకమ్మ అంటేనే గుర్తొచ్చే చీరల పంపిణీకి రెండో ఏడాదీ ఎగనామం పెట్టింది. 60 లక్షల మందికి ఒక్కొక్కరికి ఒకటి కాదు, రెండు ఇస్తాం.. 1.2 కోట్ల చీరలు వస్తున్నాయని ఊరించిన సర్కారు చివరకు ఒక్కటీ ఇవ్వకుండా చేతులెత్తేసింది. ఆడపడుచు ల ఆశలపై నీళ్లు గుమ్మరించింది. అటు కాంగ్రెస్ మార్కు కరెంటు కష్టాలతో సద్దుల బతుకమ్మకు కూడా సెల్ఫోన్ వెలుగులే దిక్కయ్యాయి.
బతుకమ్మను రాష్ట్ర ఉత్సవంగా గుర్తించేందుకూ కాంగ్రెస్ సర్కారుకు మనసు రాలేదు. ప్రజల పండుగ అంటున్నారు మరి ప్రజలే జరుపుకోవాలి అన్నట్టుగా చేతులు ముడుచుకుని కూర్చున్నది. హైదరాబాద్లో ఘనంగా పండుగ జరుపుకొనే సంప్రదాయాన్ని అటకెక్కించింది. పండుగ సందర్భంగా గుర్తుంచుకునే గొప్ప కార్యక్రమం ఏదీ సర్కారు చేపట్టకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది. నగర కూడళ్లలో కళావిహీనమైన రబ్బరు ట్యూబుల బతుకమ్మలు పేర్చి తన కళాపోషణను చాటుకున్నది.
నగర వీధులను హోరెత్తించే బతుకమ్మను సరూర్నగర్ స్టేడియంలోకి నెట్టేసి ఇంతే సంగతులు అనిపించింది. ఓ వెయ్యిమంది అక్కడ బతుకమ్మ ఆడితే ఇదే ప్రపంచ రికార్డు అని టాంటాం వేసుకుంటున్నది. ఆ మాత్రానికే మురిసిపోతే ఎలా? హనుమకొండ వేయిస్తంభాల గుడి, పద్మాక్షి గుట్ట, కరీంనగర్ సర్కస్ గ్రౌండు, మానేరు తీరం, సిద్దిపేట కోమటిచెరువు గట్టున జరిగిన బతుకమ్మల్లో వేలాదిగా పాల్గొన్న బతుకమ్మల రికార్డు ఎక్కడికి పోవాలి? ఉద్యమకాలంలో, స్వరాష్ట్ర సాధన తర్వాత నెక్లెస్ రోడ్డును అలంకరించిన బతుకమ్మ ఏమైపోవాలి?
పండుగ గురించి సర్కారు పెద్దలు, పాలకపక్షీయులు చేసిన వ్యాఖ్యలు కొన్ని గందరగోళానికి దారితీస్తే మరికొందరు ఒక్కొక్కరు ఒక్కో రకం పేర్లతో నవ్వు తెప్పించారు. ఒకరు ఇది గిరిజనుల పండుగ అని సరికొత్త భాష్యం చెప్పారు. మరొకరు జానపద నృత్యమని రాగాలు తీశారు. అసలు బతుకమ్మ ఆత్మను మాత్రం కాంగ్రెస్ సర్కారు పట్టుకోలేదు, ఆ మాటకు వస్తే పట్టించుకోలేదు. ‘జై తెలంగాణ’ అనేందుకు నోరు రాని ముఖ్యమంత్రి, ‘సజ్జల’ బతుకమ్మకు, సద్దుల బతుకమ్మకు తేడా తెలియని మంత్రుల పరిపాలనలో బతుకమ్మ ఆగమాగం కాక ఏమవుతుంది? తల్లి తెలంగాణ నగలు వలిచినోళ్లు బతుకమ్మను నిరాదరణకు గురిచేయడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకే బతుకమ్మ వేదికలు సర్కారు వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించాయి.